మామూలుగా చిన్న సినిమాలకి ఒక్క థియేటర్ దొరకడమే గగనమయ్యే పరిస్థితి వుంటుంది. కానీ కరోనా వైరస్ కారణంగా మూత పడిన చిత్ర పరిశ్రమ తిరిగి రొటీన్లో పడడానికి చిన్న సినిమాలేక ఎక్కువ థియేటర్లు కేటాయించేందుకు చూస్తోంది. ఒక్క థియేటర్లోనే రిలీజ్ అయితే జనం మధ్య భౌతిక దూరం కష్టం. అందుకని చిన్న సినిమాకి కూడా ఎక్కువ థియేటర్లు పెడితే ఫిజికల్ డిస్టెన్స్‌కి ఛాన్స్ పెరుగుతుంది.
చిన్న సినిమాలతో ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత మీడియం రేంజ్ సినిమాలకి అప్లయ్ చేస్తారట. ఇందుకోసం ఒకే వారంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ కాకుండా చూసుకుంటారట. అలాగే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం అనివార్యం కనుక ఎగ్జిబిటర్లు థియేటర్ల రెంట్ల పరంగా మినహాయింపులు ఇవ్వాల్సి వుంటుంది.
ఇందుకోసం ఎగ్జిబిటర్స్ సంఘంతో చర్చించాలి. సురేష్‌బాబు, దిల్ రాజు ఆధ్వర్యంలో వున్న థియేటర్లని ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా తక్కువ రెంట్లకి ఇవ్వడానికి సుముఖంగానే వున్నారని, ఇండివిడ్యువల్ ఎగ్జిబిటర్స్ కూడా తమ వంతు సహకారం అందిస్తే ఈ కష్టాన్ని కలిసికట్టుగా దాటవచ్చునని నిర్మాతల మండలి ఆశిస్తోంది.