ధనాధన్‌ ధోనీ ఎందుకిలా చేస్తున్నాడు.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్‌ కెరీర్‌కి చివరి రోజుల్లో వున్నాడు. ఇప్పటికే టెస్టుల నుంచి తప్పుకున్న ధోనీ, అతి త్వరలో ఇతర ఫార్మాట్ల నుంచీ వైదొలగేందుకు మానసికంగా సిద్ధమైపోతే మంచిది.…

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్‌ కెరీర్‌కి చివరి రోజుల్లో వున్నాడు. ఇప్పటికే టెస్టుల నుంచి తప్పుకున్న ధోనీ, అతి త్వరలో ఇతర ఫార్మాట్ల నుంచీ వైదొలగేందుకు మానసికంగా సిద్ధమైపోతే మంచిది. తనలో ఇంకా సత్తా తగ్గలేదంటూ వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో సత్తా చాటినా, ధోనీలోని మునుపటి 'వేగాన్ని, వ్యూహాల్ని' ఇప్పుడు చూడలేకపోతున్నాం. జట్టు అంతా ధోనీ కనసున్నల్లో నడిచేది ఒకప్పుడు. ఇప్పుడు ధోనీకి జట్టు మీద కమాండ్‌ పోయిందన్న భావన నెలకొంది. 

కారణాలేవైనాసరే, ధోనీ పూర్తిస్థాయిలో అభద్రతాభావానికి గురవుతున్నాడు.. దాన్ని దాచుకోలేకపోతున్నాడు. ఆట అన్నాక గెలుపోటములు సహజం. టీ20 వరల్డ్‌ కప్‌ని రెండోసారి కైవసం చేసుకునే రేంజ్‌లో దూకుడు కన్పించినా, తృటిలో కప్పు చేజారిపోయింది. అందులో ధోనీ వైఫల్యమెంత.? అన్న చర్చ ఇప్పుడు అనవసరం. అయితే, డక్‌ వర్త్‌ లూయిస్‌ విధానంపైనా, ఆ విషయానికి సంబంధించి అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై ధోనీ కామెంట్స్‌ సిల్లీగానే కన్పిస్తున్నాయి. ఇది చాలు, ధోనీ ఎంత అభద్రతా భావానికి గురవుతున్నాడో చెప్పడానికి. 

వెస్టిండీస్‌తో రెండో టీ20 వర్షం కారణంగా ఆగిపోవడాన్ని ధోనీ తీవ్రంగా తప్పు పట్టేశాడు. అంపైర్లు తన మాటకు విలువ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించాడు. తీవ్రంగా తనను ఆ ఘటన కలచివేసిందన్నాడు. ఆ మ్యాచ్‌లో గెలిస్తే, వెస్టిండీస్‌ – టీమిండియా చెరో పాయింట్‌తో వుండేదంతే. కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాల్ని చవిచూసిన ధోనీ ఎందుకిలా అగ్రెసివ్‌ అయ్యాడో ఎవరికీ అర్థం కావడంలేదు. ఇదివరకటి ధోనీ అయితే చాలా సింపుల్‌గా తీసి పారేసేవాడే డక్‌ వర్త్‌ లూయీస్‌ నిర్ణయాన్ని. 

క్రికెట్‌లో డక్‌ వర్త్‌ లూయీస్‌ విధానంపై మొదటి నుంచీ వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. కానీ, దాన్ని మించిన కొత్త విధానమేదీ అర్థాంతరంగా ఆగిపోయే మ్యాచ్‌ల విషయమై ఇప్పటిదాకా తెరపైకి తీసుకురాలేకపోయారు. చాలా సందర్భాల్లో డక్‌ వర్త్‌ లూయీస్‌ పద్ధతి, టీమిండియాకి చేదు అనుభవాల్ని మిగిల్చింది. టీమిండియాకి మాత్రమే ఇతర జట్లు కూడా అప్పుడప్పుడూ ఇబ్బంది పడ్డాయి. టీమిండియాకి మాత్రం ఇందులో పెద్ద ట్రాక్‌ రికార్డే వుంది.. చేదు అనుభవాల పరంగా. 

మ్యాచ్‌ 'డక్‌ వర్త్‌ లూయీస్‌ పద్ధతి' పాటించడానికి తగినంత సమయం జరగకపోవడంతో, మ్యాచ్‌ని రద్దు చేసేయడాన్ని ఇక్కడ తప్పు పట్టలేం. కానీ, అంపైర్ల నిర్ణయమే వివాదాస్పదమయ్యింది. తమ ఆటగాళ్ళ భద్రత.. అంటూ వెస్టిండీస్‌ విముఖత వ్యక్తం చేయడం, అంపైర్లు వారి వాదనకు మద్దతు పలకడం.. ఇదంతా చకచకా జరిగిపోయాయన్నది ధోనీ తెరపైకి తెస్తోన్న అంశం. వెస్టిండీస్‌ ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం చూపుతుందనీ అనుకోలేం. 

ఓవరాల్‌గా, ఈ ఎపిసోడ్‌ వరకూ ధోనీ కాస్తంత ఎక్కువగా స్పందించాడేమో అన్పిస్తోంది. తొలి టీ20లో చివరి బంతికి ధోనీ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఫలితం తేడా కొట్టేసింది. అది యాదృశ్చికమే. కానీ, దాన్ని వైఫల్యంగా భావించి, సిరీస్‌ కోల్పోయామన్న ఆవేదనను ఇలా ధోనీ వెల్లగక్కడమే ఏమాత్రం సమంజసం అన్పించడంలేదు. ఇంత ఒత్తిడిలో ధోనీ, క్రికెట్‌కి పూర్తిగా గుడ్‌ బై చెప్పేయడమే మంచిదేమో.!