మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత బ్యాట్స్‌మన్ చెలరేగిపోయారు. తొమ్మిది పరుగులకే రోహిత్‌శర్మ రూపంలో తొలి వికెట్‌ని కోల్పోవడంతో నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, క్రమక్రమంగా పరుగుల వేగం పెంచింది. ఓపెనర్ ధావన్ సెంచరీ సాధిస్తే, కోహ్లీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్థ సెంచరీకి దగ్గర్లో వుండగా 46 పరుగుల వద్ద వికెట్ పారేసుకున్నాడు కోహ్లీ.
విరాట్ కోహ్లీ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన అజింక్య రెహానే సౌతాఫ్రికా బౌలర్లతో ఓ ఆట ఆడుకున్నాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధావన్, రెహానే సౌతాఫ్రికా బౌలర్లను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు బౌండరీలు, సిక్సర్లు బాదుతూ వుంటే, సౌతాఫ్రికా బౌలర్లు బేల చూపులు చూడాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే ధావన్ సెంచరీ చేసుకోగా, మెరుపు వేగంతో ధావన్ అర్థ సెంచరీ సాధించాడు. 146 బంతుల్లో 137 పరుగులు చేసిన ధావన్, పర్నెల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కేవలం 60 బంతుల్లోనే 79 పరుగులు చేసిన రెహానే, సెంచరీ చేసే ఊపుతో వున్నా, స్టెయిన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు ‘ఎల్బీడబ్ల్యూ’గా దొరికిపోయాడు.
రైనా( 6), జడేజా (2) నిరాశపర్చారు. 11 బంతుల్లో 18 పరుగులు చేసిన ధోనీ, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. చివరి ఓవర్లలో ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో భారీ స్కోర్ సాధించలేకపోయింది టీమిండియా. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 307 పరుగులు చేయగలిగింది. చివరి నాలుగు ఓవర్లలో భారత బ్యాట్స్‌మెన్ జాగ్రత్తపడి వుంటే, స్కోర్ బోర్డ్, 340 దాటేదే.
ఓవరాల్‌గా బ్యాట్స్‌మన్ భళా అనిపించారు. ఇక బౌలర్లదే భారం. పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని టీమిండియా పునరావృతం చేయాలని భారత క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. భారత బౌలర్లు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.