టీమిండియా, సౌతాఫ్రికాతో తలపడ్తున్న చివరి టెస్ట్ వాస్తవానికి ఈ రోజే ముగియాల్సి వుంది. అయినా టీమిండియా, సౌతాఫ్రికాని ఫాలో ఆన్ ఆడించకుండా, తానే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. టపటపా నాలుగు వికెట్లు పడిపోయినా, ఆ తర్వాత టీమిండియా నిలదొక్కుకుంది. భారీ స్కోర్, ఇంకా భారీ ఆధిక్యం సాధించే దిశగా టీమిండియా బ్యాటింగ్ సాగుతోంది.
తొలి ఇన్నింగ్స్‌లో రహానే చేసిన సెంచరీనే నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటిదాకా అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఆ మాటకొస్తే, అదొక్కటే సెంచరీ ఇప్పటిదాకా నమోదయ్యింది. దాంతో, బ్యాటింగ్ పరంగా సగటు క్రికెట్ అభిమాని తీవ్ర నిరాశకు గురయ్యాడు. సౌతాఫ్రికా మిస్టర్ డిపెండబుల్ హషీమ్ ఆమ్లా పప్పులు ఈ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటిదాకా ఉడకలేదు. డివిలియర్స్ మెరుపులూ పెద్దగా లేవనే చెప్పాలి. ఇంత పేలవమైన సిరీస్ ఇంకొకటి లేదు.. అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, మ్యాచ్‌ని ఎలాగైనా మూడు రోజులు, ఆ పైన నడవాల్సిందేనని టీమిండియా భావించిందో, బీసీసీఐ భావించిందో, టీమిండియా – సౌతాఫ్రికా ఓ అవగాహనకు వచ్చాయోగానీ, మ్యాచ్.. అలా అలా సాగుతోంది.
మైదానంలో మ్యాచ్‌ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా టిక్కెట్లు తీసుకున్న సగటు క్రికెట్ అభిమాని, పూర్తిగా మ్యాచ్ జరగాల్సినన్ని రోజులు జరగకపోవడంతో నిరాశ చెందాడు. రెండున్నర రోజులకే మ్యాచ్ ముగిస్తే అభిమానులకు నిరాశ కాక మరేమిటి.? అందుకే ఇప్పుడు మ్యాచ్ సాగదీయబడ్తోంది. కానీ, ఇది ఇంకా చిరాకు కల్గిస్తోంది అభిమానులకి. అటువైపు సౌతాఫ్రికా, 200 పరుగులు సాధించడమే కనా కష్టం.. అలాంటిది ఇప్పటికే 400 దాటేసింది టీమిండియా ఆధిక్యం.
ఏమో, రేపు కోహ్లీ సెంచరీ చేసేస్తాడేమో, రహానే కూడా సెంచరీ నమోదు చేసేస్తాడేమో. పరిస్థితి చూస్తోంటే అలానే వుంది. ఆ తర్వాత ఎటూ సౌతాఫ్రికా చతికిలపడ్తుంది. లేదంటే, సౌతాఫ్రికా కూడా క్రీజ్‌లో నిలదొక్కుకుంటే ఈ మ్యాచ్‌ని గెలిచేయొచ్చు, లేదా డ్రా చేసేసుకోవచ్చు. ఆ అవకాశం టీమిండియానే ఇవ్వొచ్చు. ఆల్రెడీ 'ఫిక్సింగ్' అన్న అనుమానాలు అభిమానుల్లో పెరిగిపోతున్నాయి.
'వీళ్ళూ కొట్టలేకపోతున్నారు.. వాళ్ళూ కొట్టలేకపోతున్నారు.. ఇంత చెత్త పిచ్‌లు ఎలా తయారుచేస్తున్నారు.? క్రికెట్‌ని నాశనం చేయడానికేనా ఇదంతా.? ఇది కుట్రపూరితం..' అంటూ పిచ్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో బీసీసీఐ వ్యూహాత్మకంగా మ్యాచ్‌ని సాగదీస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే, దానికి ఆవకాశం అలా కల్పిస్తున్నారు మరి.!