ఫిబ్రవరి 15.. నరాలు తెగుతున్నాయ్‌.!

వరల్డ్‌ కప్‌ ఫీవర్‌ పీక్స్‌కి వెళ్తోంది. కాస్సేపటి క్రితమే లాంఛనంగా వరల్డ్‌ కప్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ మ్యాచ్‌ ఎవరి మధ్య జరుగుతుంది.? కప్‌ ఎవరు గెలుస్తారు.? ఇవన్నీ కాదు భారత్‌, పాక్‌ క్రికెట్‌…

వరల్డ్‌ కప్‌ ఫీవర్‌ పీక్స్‌కి వెళ్తోంది. కాస్సేపటి క్రితమే లాంఛనంగా వరల్డ్‌ కప్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ మ్యాచ్‌ ఎవరి మధ్య జరుగుతుంది.? కప్‌ ఎవరు గెలుస్తారు.? ఇవన్నీ కాదు భారత్‌, పాక్‌ క్రికెట్‌ అభిమానుల ఆసక్తికి కారణం. ఫిబ్రవరి 15న జరిగే భారత్‌ – పాక్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నదే అందరి టెన్షన్‌కీ కారణం.

ఇప్పటిదాకా జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ పోటీల్లో పాకిస్తాన్‌, బారత్‌పై విజయం సాధించింది లేదు. దాంతో, ఓ రకంగా ఎడ్జ్‌ భారత్‌ వైపే వుంటుందన్నది నిర్వివాదాంశం. మానసికంగా ఇది పాక్‌ ఆటగాళ్ళని దెబ్బ తీసే అంశం. అయితే, గతాన్ని మర్చిపోతామనీ, కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా వున్నామని పాక్‌ క్రికెటర్లు చెబుతున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం తాము భారత్‌ కన్నా బలంగా వున్నామని పాక్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా, అండర్‌ డాగ్స్‌లానే బరిలోకి దిగుతోందిప్పుడు టీమిండియా. గత వరల్డ్‌ కప్‌ విజేత హోదా వున్నా, గత కొంతకాలంగా టీమిండియా సరైన విజయాలు సాధించలేకపోతోంది. ఆ కారణంగానే, భారత్‌ని అండర్‌ డాగ్‌లా అంచనా వేస్తున్నారు క్రికెట్‌ విశ్లేషకులు. ఇప్పటిదాకా టీమిండియాకి సచిన్‌ టెండూల్కర్‌ ప్రధాన బలం. కానీ ఇప్పుడు సచిన్‌, టీమిండియాలో లేడు. దాంతో, ప్రత్యర్థికి కొంత ధైర్యం.

మొత్తమ్మీద, భారత్‌ – పాక్‌ జట్లకు సంబంధించి టెన్షన్‌ ఓ రేంజ్‌లో వుంది. అప్పుడే క్రికెట్‌ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ షురూ అయ్యింది. బెట్టింగ్‌లు అయితే బీభత్సంగా జరుగుతున్నాయి. బెట్టింగుల్లోనూ భారత్‌ వైపే మొగ్గు చూపుతున్నారు చాలామంది. ఫలితం ఏమిటన్నది తెలియాలంటే ఫిబ్రవరి 15 వరకూ ఆగక తప్పదు. అప్పటిదాకా టెన్షన్‌ కూడా తప్పదు.