హమ్మయ్య.. లంకపై టీమిండియా గెలిచింది.. అంటూ భారత క్రికెట్ అభిమానులు తొలుత ఊపిరి పీల్చుకున్నారు.. ఆ తర్వాత సంబరాలు చేసుకున్నారు. చేతికి అంది వచ్చిన మ్యాచ్‌ని ఎలా కోల్పోవాలో టీమిండియాకి తెలిసినంత గొప్పగా ఇంకెవరికీ తెలియదేమో.. అన్పించేశారు మనోళ్ళు తొలి టెస్ట్‌లో. ఈజీగా గెలిచేయాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసి, భారత క్రికెట్ అభిమానుల్ని నిరాశపర్చింది. దాంతో, రెండో టెస్ట్‌లో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది.
ఏమో, వర్షం కురిసి మ్యాచ్ డ్రా అయిపోతుందేమోనని అనుక్షణం ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ని తిలకించిన అభిమానులకి, టీమిండియా తీపి కబురే చెప్పింది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్ చేతులెత్తేసినట్టు కాకుండా, బౌలర్లు.. ఎక్కడా తడబాటు ప్రదర్శించలేదు రెండో టెస్ట్‌లో. శ్రీలంకను పకడ్బందీ ప్రణాళికతో 134 పరుగలకు ఆలౌట్ చేసి, టీమిండియాకి విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌తో శ్రీలంక ఆటగాడు సంగక్కర టెస్ట్ కెరీర్‌కి గుడ్ బై చెప్పాడు. కెరీర్ చివరి టెస్ట్ ఆడిన సంగక్కర, రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమై అభిమానుల్ని నిరాశపరిచాడు. టీమిండియా బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ని లంక గెల్చుకోగా, రెండో టెస్ట్‌ని టీమిండియా గెల్చుకుంది. మూడో టెస్ట్ సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది. తొలి టెస్ట్ నేర్పిన పాఠాలతో రెండో టెస్ట్‌లో జాగ్రత్తగా వ్యూహాల్ని అమలుచేసిన టీమిండియా, ఇదే జోరు కొనసాగించి మూడో టెస్ట్‌లో విజయం సాధించి, శ్రీలంకలో శ్రీలంకపై సిరీస్ విజయాన్ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.