పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి తన రాజీనామాను ప్రకటించారు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ. పార్టీ ఓటమికి బాధ్యతగా ఆయన తన రాజీనామాను సోనియాగాంధీకి పంపించారట. మరి సోనియా ఆ రాజీనామాను ఆమోదిస్తారా? లేదంటూ ప్రకటిస్తారా.. అనేది వేరే కామెడీ.
ప్రస్తుతానికి అయితే పంజాబ్ కాంగ్రెస్ రిక్తహస్తలతో ఉంది. పంజాబ్ లో ఆప్ తన పట్టును కొనసాగిస్తే.. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఆ మేరకు సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదు. అలాగే పంజాబ్ లో ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజ్యసభ సీట్ల సంఖ్యపై కూడా పడనుంది.
ఇదంతా ఇలా ఉంటే.. పంజాబ్ రాజకీయాల్లోకి మరో మాజీ క్రికెటర్ ఎంటరవుతున్నాడనే వార్త కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అతడే ఒకప్పటి స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఇది వరకే భజ్జీ బీజేపీలోకి చేరబోతున్నాడని, కాదు కాంగ్రెస్ అని రూమర్లు వినిపించాయి. ఇప్పటికే భజ్జీ అంతర్జాతీయ క్రికెట్ నుంచినే కాకుండా, ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నట్టుగా ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో భజ్జీ రాజకీయాల్లోకి రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. సిద్ధూ తరహాలో భజ్జీ కూడా దూకుడైన మనస్తత్వం కలిగిన వాడే. ఇప్పటికే అధికారం అందినా.. ఆప్ కు పంజాబ్ లో క్రికెట్ గ్లామర్ కూడా అవసరమే కావొచ్చు. భజ్జీ చేరికతో జాతీయ స్థాయిలో కూడా ఆప్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అందుకే హర్బజన్ ను రాజ్యసభకు నామినేట్ చేయనుందట ఆప్.
పంజాబ్ కోటా నుంచినే భజ్జీని ఆప్ రాజ్యసభకు నామినేట్ చేయనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి పంజాబ్ రాజకీయం నుంచి సిద్ధూ నిష్క్రమణ దాదాపు జరుగుతున్న వేళ, హర్భజన్ ఎంట్రీ ఇస్తాడేమో!