ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చిన్ని సినిమా నిర్మాతలకు ఒక గొప్ప వరం ప్రకటించారు. ఏపీ వ్యాప్తంగా అయిదో ఆటకు అధికారికంగా అనుమతి ఇచ్చారు. రోజుకు అయిదు ఆటలకు అనుమతి ఇస్తూ.. ఆ అయిదింటిలో ఒక ఆటను తప్పనిసరిగా చిన్న సినిమాకు కేటాయించాల్సిందేనని ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రాజమౌళి- ఎన్టీఆర్- రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యే రోజున.. ఏదైనా ఒక చిన్న సినిమాను విడుదలకు ప్లాన్ చేసుకుంటే కలెక్షన్లు కుమ్మేసే అవకాశం ఉంది. సదరు చిన్న సినిమా నిర్మాత ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే థియేటర్లలో తన సినిమా వేయడానికి అనుమతులు అడిగి ఏర్పాట్లు చేసుకుంటే గనుక.. సూపర్‌హిట్ కలెక్షన్లు గ్యారంటీ. ఎలాగంటారా?
ప్రభుత్వం తన ఆదేశాల్లో చాలా స్పష్టంగా పేర్కొంది. భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యే సందర్భాల్లో కూడా చిన్న సినిమా ఉన్నట్లయితే.. ఖచ్చితంగా ఆ సినిమాకు ఒక షో ఇచ్చి తీరాల్సిందే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంటే మార్చి 25న చిన్న సినిమా వస్తే గనుక.. రోజుకు ఒక షో వేయడానికి థియేటర్లు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. పైగా సదరు థియేటర్ల వద్ద కనీసం రెండు వారాల పాటు రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులు పోటెత్తుతూ ఉంటారు. గంటల తరబడి థియేటర్ దగ్గరే వేచి ఉండే పరిస్థితి ఉంటుంది.
ఇలా వేచి ఉండే బదులు ఏదో ఒకటి చూద్దాం అని వారిలో పది శాతం మంది అనుకున్నా కూడా.. సదరు చిన్న సినిమాకు బంపర్ కలెక్షన్లు వచ్చేస్తాయి. సో, ఆ రకంగా ఫస్ట్ వీక్ లో ఓపెనింగ్ కలెక్షన్లకు ఢోకా ఉండదు. ఇక ఆ సినిమాలో ఏ కొంచెమైనా సరుకున్నదనే అభిప్రాయం ప్రేక్షకులకు కలిగితే చాలు.. అది ఎక్కడికో వెళ్లిపోతుంది. అంత సీన్ లేదనుకున్నా సరే.. చిన్న సినిమాకు ఒక వారం రోజులు మినిమం కలెక్షన్లు వచ్చి, వారం దాకా థియేటర్లో నిలబడితే చాలు.. గిట్టుబాటు అయిపోతుంది.
ఈ నిబంధన ఎవరైనా పాటించి తీరాల్సిందే. దర్శకుడు రాజమౌళి మాత్రం.. తమ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రతిరోజూ బెనిఫిట్ షోనే అని, ప్రభుత్వం అయిదు షోలకు అనుమతి ఇవ్వడం గొప్ప సంగతి అని వాక్రుచ్చారు. రోజూ అయిదు ఆటలు ఆడిస్తాం అంటూ సీఎంకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. కానీ.. ప్రభుత్వ జీవో ప్రకారం.
అదే రోజున చిన్న సినిమా వస్తే ఆయన ఆశలు గల్లంతవుతాయి. పైగా రాజమౌళి, నిర్మాత దానయ్యతో కలిసి సీఎం జగన్ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత.. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని విడిగా మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద సినిమా ఉన్న రోజుల్లో చిన్న సినిమా విడుదల అయితే.. ఒక షో ఇచ్చి తీరాల్సిందేననే నిబంధన గుర్తు చేశారు.
సో.. చిన్న నిర్మాతలు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? తెగించి మార్చి 25న రిలీజ్ చేయగలిగితే మాత్రం.. కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు.