నూతన రైల్వే లైన్ల ఏర్పాటు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులపై డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన ప్రసంగం వైరల్ గా మారింది. రెండు రోజుల క్రితం పార్లమెంట్ లో కనిమొళి చేసిన ప్రసంగం ఆసక్తి దాయకమైన సమాచారాన్ని ఇస్తోంది.
రైల్వేల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల్లో ఉన్న వ్యత్యాసాన్ని ఆమె ప్రస్తావించారు. కనిమొళి సభ ముందు ఉంచిన సమాచారం ప్రకారం.. రానున్న ఏడాదికి సంబంధించి కొత్త లైన్ల ఏర్పాటు, ఇతర రైల్వే వర్క్స్ కు సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయించిన బడ్జెట్ 13, 200 కోట్ల రూపాయలు.
ఇవే వర్క్స్ కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్ కేవలం 59 కోట్ల రూపాయలు మాత్రమే అని కనిమొళి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు షేమ్ షేమ్ అంటూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు.
ఇంత అన్యాయమైన కేటాయింపులా.. అంటూ రైల్వే కేటాయింపులపై చర్చ సందర్భంగా కనిమొళి రైల్వే శాఖామంత్రిని ప్రశ్నించారు. అంతే కాదు.. గత కొన్నేళ్లుగా కేంద్రం దక్షిణాదిన రైల్వే అభివృద్ధికి కేటాయించిన నిధుల మొత్తాలను కూడా కనిమొళి ప్రస్తావించారు.
2019 నుంచి దక్షిణాదిన రైల్వేల అభివృద్ధికి కేటాయించిన మొత్తం 309 కోట్ల రూపాయలు కాగా, అదే ఉత్తరాదిన రైల్వే లైన్ల ఏర్పాటు, ఇతర రైల్వే సదుపాయాల కల్పనకు ఏకంగా 31,108 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించిందని కనిమొళి సభ దృష్టికి తీసుకు వచ్చారు.
మోడీ సర్కారు దక్షిణాది రాష్ట్రాలపైచూపుతున్న నిర్లక్ష్యం, చిన్నచూపు గురించి కనిమొళి ఈ విధంగా ఎండగట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంలో ఉత్తరాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్న నేపథ్యంలో.. దక్షిణాదిపై సవతి తల్లి ప్రేమను చూపడానికి బీజేపీ ఏ మాత్రం మొహమాట పడుతుండటం లేదు!