ఆ మధ్య తన నిశ్చితార్థం విషయాన్ని ప్రకటించిన భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ఇంకా పెళ్లి కబురు చెప్పలేదు కానీ, ఇంతలోనే తను తండ్రి కాబోతున్నట్టుగా ప్రకటించుకున్నాడు. తనతో ఎంగేజ్డ్ అయిన తన ప్రియురాలు ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని హార్ధిక్ ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా తన అనుభూతిని తెలిపాడు హార్ధిక్.
ఎంగేజ్ మెంట్ తర్వాతే వీళ్లు సహజీవనం మొదలుపెట్టారో, అంతకు ముందు నుంచినే కలిసుంటున్నారో కానీ.. లాక్ డౌన్ తో ఇండియాలో ప్రెగ్నెన్సీ రేటు పెరిగిందనే అంచనాలను న్యాయం చేస్తున్నట్టుగా ఉన్నాడు హార్ధిక్! ఎంగేజ్ మెంట్ కు, పెళ్లికి మధ్యన ప్రెగ్నెన్సీ వార్తను అనౌన్స్ చేయడం ఇండియాలో విడ్డూరమని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే హార్ధిక్ పాండ్యా లాంటి వారికి ఇది విడ్డూరం కాకపోవచ్చు. ఎందుకంటే తనొక ప్లేబాయ్ ని అంటూ ఇతడు స్వయంగా ప్రకటించుకున్నాడు. ఆ మధ్య కాఫీ విత్ కరణ్ టాక్ షో లో తన ప్లేబాయ్ హ్యాబిట్స్ గురించి వీర లెవల్లో చెప్పుకుని అడ్డంగా బుక్కయ్యాడు ఇతడు. అమ్మాయిలతో అలా గడిపి ఇంటికి చేరుకోవడం తనకు చిటికెలో పని అన్నట్టుగా ఇతడు ఎబ్బెట్టుగా చెప్పుకొచ్చాడు.
దీంతో దేశ వ్యాప్తంగా అనేక మంది ఇతడిపై విమర్శలు గుప్పించారు. ఉన్నట్టుండి హార్ధిక్ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. విదేశీ పర్యటన నుంచి ఇతడిని, ఇతడితో పాటు ఆ టాక్ షో లో కూర్చున్న కేఎల్ రాహుల్ ను బీసీసీఐ వెనక్కు పిలిపించింది. బోలెడంత విచారణ జరిగిన తర్వాత కొన్ని నెలలకు గానీ వీరికి లైన్ క్లియర్ కాలేదు. చివరకు ఎలాగో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత తన విదేశీ ప్రియురాలిని పరిచయం చేశాడు, ఎంగేజ్ మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఇంతలోనే తండ్రి కాబోతున్న విషయాన్నీ అనౌన్స్ చేశాడు.