ఇలాంటి ఓటమిని ఎవరైనా ఊహించారా.?

ఎలాగైనా గెలిచేస్తామనుకున్న మ్యాచ్‌ని అడ్డంగా కోల్పోవడంలో టీమిండియా తర్వాతే ఎవరైనా. తొలి ఇన్నింగ్స్‌లో లంకేయులపై భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా, ఇన్నింగ్స్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అంతా అనుకున్నారు. అనూహ్యంగా లంక బ్యాట్స్‌మెన్‌ రెండో…

ఎలాగైనా గెలిచేస్తామనుకున్న మ్యాచ్‌ని అడ్డంగా కోల్పోవడంలో టీమిండియా తర్వాతే ఎవరైనా. తొలి ఇన్నింగ్స్‌లో లంకేయులపై భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా, ఇన్నింగ్స్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అంతా అనుకున్నారు. అనూహ్యంగా లంక బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నారు. ఛాన్స్‌ దొరికితే ఎంతటి బలమైన ప్రత్యర్థినైనా కుదేలు చేయగలగడం లంక స్పెషాలిటీ.

టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌ వరకూ టీమిండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఎడ్జ్‌ సాధిస్తే, చివర్లో లంకేయులు సత్తా చాటారు. వెరసి, లంక ఘనవిజయాన్ని అందుకుంది. టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి అంచుల్లోంచి, విజయతీరాలకు చేరుకుని లంకేయులు పోరాట పటిమను చాటుకుంటే.. సింపుల్‌గా గెలిచేయాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసి, అనుభవలేమిని మరోమారు చాటుకుంది టీమిండియా.

తొలి ఇన్నింగ్స్‌లో ధావన్‌, కోహ్లీ, సాహా టీమిండియాని ఆదుకున్నారు. రోహిత్‌, లోకేష్‌ రాహుల్‌, రహానే చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తంగా అందరూ కలిసికట్టుగా చేతులెత్తేశారు. ఈ పరాజయాన్ని టీమిండియానే కాదు, భారత క్రికెట్‌ అభిమానులూ ఊహించలేకపోయారు. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగిపోయిన భారత క్రికెట్‌ అభిమానులు.. లంకపై విక్టరీ కొట్టి సంబరాలు చేసుకుందామనుకున్నారు.. కానీ టీమిండియా పరాజయంతో ఉస్సూరుమన్నారు.

పసలేని భారత బ్యాటింగ్‌ని రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూల్చిన ఘనత లంక బౌలర్‌ హెరాత్‌కే దక్కుతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకోవడానికి ప్రయత్నించకపోవడంతో హెరాత్‌ పని తేలికైపోయింది. ఏడు వికెట్లు తీసి లంకకు ఘనవిజయాన్ని అందించాడు లంక బౌలర్‌ హెరాత్‌. లంక బ్యాటింగ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడిన బ్యాట్స్‌మన్‌ చండిమాల్‌కి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. టీమిండియాని రెండో ఇన్నింగ్స్‌లో దారుణమైన దెబ్బ కొట్టాడు.

ఆట అన్నాక గెలుపోటములు సహజం. అయితే కోరి తెచ్చుకున్న పరాజయాలు బాధిస్తాయి. అలాంటి దారుణ పరాజయాల్లో ఇదొకటి.