ఒకవేళ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను సౌరవ్ గంగూలీ చేపట్టకపోతే..ఇండియా ఇప్పట్లో డే అండ్ నైట్ టెస్టులు ఆడే అవకాశమే లేదు. మొదటి నుంచి డే అండ్ నైట్ టెస్టులకు బీసీసీఐ పూర్తి దూరంగా నిలిచింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఆ తరహా మ్యాచ్ లు ఆడినా.. టీమిండియా ను అటుగా పంపలేదు బీసీసీఐ. ఈ విషయంలో ఐసీసీ కూడా ఎవరినీ ఒత్తిడి చేయలేదు. బీసీసీఐని అసలు ఒత్తిడి చేయలేదు.
అయితే గంగూలీ వచ్చీ రావడంతోనే.. డే అండ్ నైట్ టెస్టులకు ఓకే చెప్పాడు. మామూలుగానే క్రికెట్ విషయంలో గంగూలీ అభిప్రాయాలను ఎవరూ అంత తేలికగా ఖండించలేరు. అలాంటిది బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాకా.. తిరుగే లేకపోయింది.డే అండ్ నైట్ టెస్టుల విషయంలో రవిశాస్త్రినో, కొహ్లీనో కూడా ఆ నిర్ణయంపై స్పందించే అవకాశం కూడా లేకుండా పోయింది. గంగూలీ ఆడమంటే ఆడాల్సిన పరిస్థితి!
ఆ సంగతలా ఉంటే.. ఈ పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్టును కోల్ కతా వేదికగా ఆడుతూ ఉంది టీమిండియా. బంగ్లాదేశ్ ప్రత్యర్థి. గంగూలీ నిర్ణయానికి బంగ్లా బోర్డు కూడా ఓకే చెప్పేసింది. తమ జట్టు చేత డే అండ్ నైట్ టెస్టును ఆడిస్తూ ఉంది. బంగ్లా ప్రస్తుత ఫామ్ చాలా దారుణంగా ఉంది. టీమిండియాకు పోటీ ఇస్తే అదే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి.
ఇప్పుడు ఆసక్తి అంతా.. మ్యాచ్ ఫలితం మీద కాదు, డే అండ్ నైట్ టెస్ట్ అనేది అభిమానుల్లో ఏ మేరకు ఆసక్తి రేపుతుంది? పింక్ బాల్ ఎలా స్పందిస్తుంది.. పరుగుల వరద పారి కొత్త ఆసక్తిని రేపుతుందా? తొలి సారి భారత క్రికెట్ అభిమానులు డే అండ్ నైట్ టెస్టు చూసి ఎలా ఫీలవుతారు? అనేవే సిసలైన ప్రశ్నలు!