సొంత పార్టీ నేతలకే నచ్చని ‘చౌదరి’ తీరు.!

సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు.. ఆ మాటకొస్తే, చంద్రబాబుకి కుడి భుజం లాంటి వ్యక్తి. కానీ, ఆయనిప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరు. Advertisement భారతీయ జనతా పార్టీలో…

సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు.. ఆ మాటకొస్తే, చంద్రబాబుకి కుడి భుజం లాంటి వ్యక్తి. కానీ, ఆయనిప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరు.

భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. చంద్రబాబే ఆయన్ని బీజేపీలోకి పంపించారంటూ ఇప్పటికీ బలమైన అభిప్రాయం విన్పిస్తూ వుంటుంది రాజకీయ వర్గాల్లో. ఆ 'మచ్చ' చెరిపేసుకునేందుకు సుజనా చౌదరి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

'టీడీపీ – బీజేపీల మధ్య సయోధ్య కోసం నేను ప్రయత్నిస్తాను..' అంటూ గతంలో ఓ సారి సుజనా చౌదరి వ్యాఖ్యానించి నవ్వులపాలయ్యారు. 'చంద్రబాబుని మేం మళ్ళీ దగ్గరకు చేర్చుకునే అవకాశం లేదు..' అని బీజేపీ అధినాయకత్వం తేల్చేసింది.. అదీ సుజనా చౌదరి, చంద్రబాబు మీద ప్రేమ కురిపించిన వెంటనే. దాంతో, సుజనా చౌదరి రూటు మార్చారు.. చంద్రబాబుపై విమర్శల తీవ్రత పెంచారు. చంద్రబాబుది కుటుంబ పాలన.. అంటూ ఈ మధ్య తెగ హడావిడి చేసేస్తున్నారు.

ఇదిలా వుంటే, తెలుగుదేశం పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ నుంచి కూడా అంతకన్నా ఎక్కువమందే బీజేపీలో చేరతారంటూ సుజనా చెప్పిన జోస్యం మరోమారు నవ్వులపాలవుతోంది.

టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన మాట వాస్తవం. అందులో సుజనా చౌదరి ఒకరు. అయితే, ఎమ్మెల్యేలెవరూ బీజేపీలో చేరేందుకు అంత సుముఖత వ్యక్తం చేయడంలేదు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీకి గుడ్‌ బై చెప్పే క్రమంలో బీజేపీతో మంతనాలు జరిపినా.. ఆయన చివరికి వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 'జనంలో మాకు బలం వుంది' అనుకుంటోన్న నేతలు టీడీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళాలనుకుంటోంటే, అదృష్టంతోనో, అవకాశవాదంతోనో పదవులు దక్కించుకున్నోళ్ళు బీజేపీ పంచన చేరుతున్న మాట వాస్తవం.

ఇక, సుజనా చౌదరి తాజా వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. సుజనా తీరు బీజేపీకి చేటు చేస్తోందనీ, ఆయనపై ఇంకా చంద్రబాబు ప్రభావం పోలేదనీ, చంద్రబాబు చేతిలో రిమోట్‌లా సుజనా వ్యవహరిస్తున్నారని కరడుగట్టిన బీజేపీ నేతలు అంటున్నారు.