హైదరాబాద్ సమీపంలోని ఒక ఆస్తి వివాదంలో మాజీ మంత్రి అఖిలప్రియ మీద ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తిదాయకంగా మారింది. భూమా నాగిరెడ్డి తనయుడు , తన సొంత అక్క మీద కోర్టుకు ఎక్కారు! దీంతో వారి మధ్యన విభేదాలు మొదలయ్యాయా? అనేది చర్చనీయాంశంగా నిలుస్తోంది.
అయితే దీని వెనుక అసలు కథ వేరే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఒక ఆస్తి వివాదంతో తన సోదరిలను ప్రతివాదులు చేరుస్తూ జగత్ విఖ్యాత్ తరఫున పిటిషన్ దాఖలు అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా వ్యూహాత్మక పిటిషన్ అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అమ్మేసిన తమ ఆస్తిని వివాదంగా మార్చే క్రమంలో ఈ పిటిషన్ దాఖలు అయ్యిందని ఆ ఆస్తిని కొన్న వారి వైపు నుంచి ఒక వాదన వినిపిస్తూ ఉంది.
మూడేళ్ల కిందట భూమా కుటుంబం రాజేంద్రనగర్ సమీపంలో కొంత భూమిని అమ్మేసిందట. అయితే అప్పుడు తను మైనర్ ని అంటూ, తనకు పూర్తి అవగాహన కల్పించకుండా.. తన సోదరి ఆధ్వర్యంలో భూమి అమ్మకం జరిగిందని, అందులో తన మూడో వంతు భాగంపై తనకు హక్కులు కల్పించాలంటూ విఖ్యాత్ తరఫున పిటిషన్ దాఖలు అయినట్టుగా సమాచారం!
ఈ విషయంలో తన సోదరీమణులు ఇద్దరినీ విఖ్యాత్ ప్రతివాదులు పేర్కొన్నారట. అయితే ఇదంతా అఖిల కనుసన్నల్లో జరుగుతున్నదే అని ప్రతివాదులు కొందరు అంటున్నారు. ఇలాంటి రాజకీయాలతోనే అఖిల పరిస్థితిని ఇక్కడి వరకూ తెచ్చుకున్నారని, భూమా అనుచరులు, భూమా కుటుంబీకుల్లోని కొందరు కూడా ఆమెకు మద్దతుగా నిలవకపోవడానికి కారణాలు ఇలాంటి లిటిగెషన్సే అని వారు అంటున్నారు.
భూమా కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే బీజేపీలోకి చేరారు. ఇక బ్రహ్మానంద రెడ్డి కామ్ అయిపోయారు. అయినా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆ తరహా వ్యవహారాలే సాగుతూ ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు!