వివాదాస్పద కాషాయ ధారి నిత్యానంద స్వామీజీ దేశం వీడి పరారీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. నకిలీ పాస్ పోర్టును ఉపయోగించుకుని ఆయన విదేశాలకు పరార్ అయ్యాడట. ఆస్ట్రేలియా సమీపంలోని ఒక ద్వీపానికి అతడు పరార్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఒక సినీ నటితో నిత్యానంద రాసలీలల వీడియోలు దాదాపు పది సంవత్సరాల కిందట వెలుగు చూశాయి. అలా ఆయన వివాదాల్లోకి ఎక్కారు. ఆ పై నిత్యానంద బాధితులు పలువురు ఆయనపై ఫిర్యాదులు చేశారు. నిత్యానందను పోలీసులు అరెస్టు చేశారు, కొంత కాలం జైల్లో కూడా ఉంచారు.
నిత్యానంద భక్తి సామ్రాజ్యం భారీ ఎత్తున ఉంది. ఆయన వివాదాల పాలైన తర్వాత కూడా ఆయనను విశ్వసించే వాళ్లు తగ్గినట్టుగా లేరు. అప్పటికే నిత్యానంద భక్తి సామ్రాజ్యం విలువ కొన్ని వందల కోట్ల రూపాయల స్థాయికి చేరింది. కర్ణాటకలోని బిడదితో సహా గుజరాత్ లో కూడా నిత్యానంద ఆశ్రమం ఉందట. అయితే ఆయన ఏడాదిన్నరగా కర్ణాటకలోని ఆశ్రమానికే రాలేదట! దీంతో ఆయన ఎక్కడున్నారనే అంశం గురించి భక్తుల్లోకూడా ఆరాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఆయన అసలు దేశంలోనే లేడని, కొంతకాలం కిందటే దేశం దాటి పరార్ అయ్యాడని, ఈ కేసుల తికమకలను తప్పించుకోవడానికి ఆయన ఒక విదేశీ ద్వీపానికి చేరుకున్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది. ఒకవేళ అదే నిజం అయితే.. బీజేపీ హయాంలో మరొక ప్రముఖుడు దేశం దాటినట్టుగా అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!