దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నా, లాక్ డౌన్ విషయంలో రకరకాల మినహాయింపులు కొనసాగుతూ ఉన్నాయి. అంతరాష్ట్ర ప్రయాణాలు మాత్రమే ప్రస్తుతం కొంచెం అనుమతుల మేర సాగుతూ ఉన్నాయి. మాల్స్ కూడా కొన్ని ప్రధాన నగరాల్లో తెరుచుకున్నాయి. థియేటర్ల మూత మాత్రం కొనసాగుతూ ఉంది. అలాగే స్పోర్ట్ ఈవెంట్లకు కూడా కరోనా వైరస్ ఆటంకంగా మారింది. ఈ క్రమంలో ఇలా ఇప్పటికే వాయిదా పడిన ప్రధాన స్పోర్ట్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.
దాదాపు నెలన్నర పాటు సాగే ఈ లీగ్ ఇప్పటికే పూర్తి కావాల్సింది కూడా. అయితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. మినహాయింపులు మొదలైన నేపథ్యంలో మళ్లీ ఐపీఎల్ నిర్వహణపై చర్చ మొదలైంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరి కొన్నాళ్లకు అయినా ఈ లీగ్ ను నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తితోనే ఉంది.
బీసీసీఐకి, క్రికెటర్లకు బంగారు బాతులాంటిది ఐపీఎల్. ఈ క్రమంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ల నిర్వహణ ప్రతిపాదన ఒకటి మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఆ మేరకు ఖాళీ స్టాండ్స్ తో మ్యాచ్ లను నిర్వహించడం మీద బీసీసీఐ ఆసక్తితో ఉందట. ఈ మేరకు ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయని సమాచారం. ఇంకో నెల రోజుల తర్వాత అయినా ఈ తరహాలో మ్యాచ్ లను నిర్వహించాలని ఇండియన్ క్రికెట్ బోర్డు భావిస్తోందట.
అయితే ఐపీఎల్ కు ప్రధాన కళ విదేశీ ఆటగాళ్లతోనే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది క్రికెటర్లు ప్రయాణాలకు, హోటళ్లలో బస చేసి మ్యాచ్ లు ఆడేందుకు రెడీగా ఉంటారనేది కీలకమైన ప్రశ్న. కానీ ఇప్పటికే కొన్ని మ్యాచ్ లకు రంగం సిద్ధం అవుతోంది. యూరప్ దేశాల్లో ఖాళీ స్టాండ్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ ల నిర్వహణకు రెడీ అవుతున్నారు. అలాగే వెస్టిండీస్-ఇంగ్లండ్ ల టెస్టు సీరిస్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్ ల కోసం విండీస్ క్రికెటర్లు కొందరు ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్నారు కూడా!