జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యంగ్ క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా, కె.ఎల్. రాహుల్ ఇకపై క్రికెట్‌కి దూరమైపోతారేమో.! ఆ స్థాయిలో ఈ యంగ్ క్రికెటర్స్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కాఫీ విత్ కరణ్ అనే ఓ టెలివిజన్ షోలో ఈ ఇద్దరు క్రికెటర్స్ హద్దులు దాటి మాట్లాడటమే అందుకు కారణం. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో కరణ్ జోహార్, కొద్ది సేపు ఈ ఇద్దరితోనూ ముచ్చటించాడు.
కరణ్ జోహార్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. 'బాహుబలి'ని బాలీవుడ్‌కి తీసుకెళ్ళింది ఈయనగారే. దర్శకుడిగా నిర్మాతగా, కరణ్ జోహార్‌కి వున్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఎంత ఎదిగితేనేం, కరణ్ జోహార్‌కి నైతిక విలువల్లేవు. ఆ విషయం కాఫీ విత్ కరణ్ షో చూసినవారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఎప్పటినుంచో ఈ షో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. 'కాఫీ విత్ కరణ్ షో'ని బ్యాన్ చేయాలనే డిమాండ్లు ఇప్పటివి కావు.
'అన్నీ బోల్డ్‌గా మాట్లాడే షో ఇది..' అని చెబుతుంటారుగానీ, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్ని జుగుప్సాకరంగా కూపీ లాగడం తప్ప, ఇందులో కొత్తదనం ఏమీ వుండదన్నది మెజార్టీ అభిప్రాయం. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వివాదంపై తీరిగ్గా స్పందించాడు కరణ్ జోహార్. 'ఆ సమయంలో మేం ఈ షో ఇంత వివాదాస్పదమవుతుందని అనుకోలేదు. పరోక్షంగా వారి కెరీర్‌పై మచ్చ పడటానికి నేనూ ఓ కారకుడిని అయ్యాను. ఆ ఘటన తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను..' అంటూ మొసలి కన్నీరు కార్చాడు కరణ్ జోహార్. అయితే, కరణ్ మొసలి కన్నీళ్ళను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదిప్పుడు.
మరోపక్క, 'తొలిసారి తప్పిదం'గా భావించి ఆ ఇద్దరు యంగ్ క్రికెటర్స్‌నీ అంతర్జాతీయ క్రికెట్‌కి అనుమతించాలని మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇద్దరిపైనా 'వేటు' పడింది.. విచారణ జరుగుతోంది. రేపో మాపో బ్యాన్ ఎత్తేస్తారేమో.! లేదంటే, నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తారేమో.! ఒకవేళ బ్యాన్ ఎత్తివేసినా, ఈ ఇద్దరిపైనా ఈ వివాదం తాలూకు ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే వుంటుందన్నది నిర్వివాదాంశం.
చిన్న వయసులో ఉన్నత శిఖరాలు అందుకున్న అత్యుత్సాహంతో నోరు జారేసిన హార్దిక్, కేఎల్ రాహుల్‌ని ఈ వివాదానికి సంబంధించి ఏమాత్రం సమర్థించలేమనుకోండి.. అది వేరే విషయం.