వీర బాదుడు బాది ట్రిపుల్ సెంచరీ చేసిన వాళ్లను చూశాం… నెమ్మెదినెమ్మదిగా ఆడుతూ ట్రిపుల్ సెంచరీ వరకూ చేరిన వాళ్లనూ చూశాం.. కానీ ఒక మారథాన్ ఇన్నింగ్స్ ను మంచినీళ్ల ప్రాయంగా ఆడటం మాత్రం కరుణ్ నాయర్ కే సాధ్యం అయ్యింది. చాలా సింపుల్ గా చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు కరుణ్.
381 బంతుల్లో 303 పరుగులు సాధించడం ద్వారా భారత్ తరపున ట్రిపుల్ సాధించిన రెండో బ్యాట్స్ మన్ గా నిలిచాడు ఈ జోధ్ పూర్ కుర్రాడు.
టెస్టు క్రికెట్ లో ఇండియన్ బ్యాట్స్ మన్ కు ఏదైనా అరుదైన ఫీట్ ఉంది అంటే.. అది ట్రిపుల్ సెంచరీ మాత్రమే! పరుగుల యంత్రాల్లాంటి, ప్రపంచక్రికెట్ లో సూపర్ స్టార్స్ గా ఎదిగిన భారతీయ బ్యాట్స్ మన్లలో కూడా చాలా మందికి ట్రిపుల్ సాధ్యం కాలేదు.
ఇంతవరకూ ఇండియన్ టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సాధించింది కేవలం వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే. వీరూ రెండు సార్లు మూడువందల పరుగుల ఫీట్ ను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ కూడా వీరూ పేరు మీదే ఉంది.
సెహ్వాగ్ తర్వాత మనోళ్లు డబుల్ సెంచరీల వరకూ కొంతమంది వెళ్లారు కానీ.. అరుదైన ట్రిపుల్ కరుణ్ నాయర్ కే సాధ్యం అయ్యింది. తన మూడో టెస్టు మ్యాచ్ లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి కరుణ్ మరో కొత్త రికార్డు కూడా స్థాపించాడు. బహుశా మూడో టెస్టుతోనే ట్రిపుల్ సాధించిన మొనగాడు ఇంత వరకూ అంతర్జాతీయ క్రికెట్ లో లేడు.
రెండువందల పరుగుల దగ్గర నుంచి కరుణ్ వేగంగా ఆడుతూ వచ్చాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఇన్నాళ్లు ఇతడి పేరు కేవలం ఐపీఎల్ సమయంలో మాత్రమే వినిపించేది. ఇప్పుడు ఒక్క ఇన్నింగ్స్ తో ధిగ్గజాల సరసన స్థానం సంపాదించాడు ఈ కుర్రాడు. ధిగ్గజాల నిష్క్రమణ తర్వాత యువ ఆటగాళ్లతో నిండిన భారత క్రికెట్ లో మరో సరికొత్త ఆశ కిరణం ఉదయించినట్టే.