మొహాలీ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. విశాఖ టెస్ట్‌లో విజయం సాధించిన తర్వాత, మొహాలీలోనూ సేమ్ సీన్ రిపీటవుతుందని భారత క్రికెట్ అభిమానులు ముందే ఫిక్సయిపోయారు. వారి అంచనాల్లో తేడాలేమీ రాలేదు. అయితే, ఇన్నింగ్స్ విక్టరీ దక్కుతుందనుకున్నా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కాస్త ప్రతిఘటించడంతో విజయం కాస్త ఆలస్యమయ్యిందంతే. ఇన్నింగ్స్ విక్టరీ దక్కలేదన్న కసితో వున్నాడో, లేదంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడోగానీ, భారత ఓపెనర్, వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్, వన్డేల తరహాలో బ్యాటింగ్ చేసి, టీమిండియాకి విజయాన్ని అందించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 417 పరుగులు సాధించింది. పుజారా, కోహ్లీ, అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్ అర్థసెంచరీలతో టీమిండియా ఈ స్కోర్ సాధించగలిగింది. ఓ దశలో ఇంగ్లాండ్ కంటే వెనకబడ్తుందనుకున్నా, చివర్లో అశ్విన్, జడేజా, యాదవ్ సాధించిన అర్థ సెంచరీలతో టీమిండియా ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగింది.
ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 100 పరుగుల లోపే ఆలౌట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. అయినా, ఇంగ్లాండ్ జట్టు బాగానే ప్రతిఘటించింది. రూట్ 78 పరుగులు సాధిస్తే, చివర్లో హమీద్ (59), వోక్స్ (30) పరుగులతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అలా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేయగలిగింది.
104 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయి, విజయాన్ని అందుకుంది. కేవలం 54 బంతుల్లో 67 పరుగులు సాధించి మ్యాచ్‌ని త్వరగా ముగించేశాడు పార్తీవ్ పటేల్.
మొహాలీ టెస్ట్ విజయంతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 2-0 తేడాతో ఇంగ్లాండ్ పై ఆధిక్యం కొనసాగిస్తోంది. మిగతా రెండు మ్యాచ్ లు గెలిచినా, రెండూ డ్రా చేసుకున్నా, ఒకటి గెలిచినా టీమిండియా టెస్ట్ సిరీస్ ని కైవసం చేసుకున్నట్టే.