రాయలసీమ నాయకుడు కమ్ మాజీ మంత్రి కమ్ పార్లమెంటు మాజీ సభ్యుడు మళ్లీ టీడీపీ లీడరుగా అవతారం ఎత్తబోతున్నారా? ఈ ప్రశ్నకు 'అవును' అంటూ మీడియాలో తాజాగా వార్తలొచ్చాయి.
నిజానికి ఈ వార్త తాజాదే అయినా ఈ సమాచారం కొత్తది కాదు. టీడీపీ నుంచి వైఎస్ జగన్ పార్టీలోకి వచ్చిన ఈ నాయకుడు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత టీడీలో చేరతారనే ప్రచారం జరిగింది. కాని మైసూరా సైలెంట్ అయిపోవడంతో ఆ ప్రచారమూ ఆగిపోయింది. అయితే టీడీపీ నేతలు ఆయనతో 'టచ్'లో ఉన్నట్లు తెలుస్తూనే ఉంది.
'నమస్తే తెలంగాణ' పత్రిక సైతం మైసూరా టీడీపీలో చేరుతున్నారని వార్త ప్రచురించింది. టీడీపీ అధినేత కమ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదరణ తగ్గలేదని, వచ్చే ఎన్నికల్లో 'పచ్చ' పార్టీ గెలుపు ఖాయమని బాబు అనుకూల పత్రిక చేయించిన సర్వేలో తేలింది. సర్వే ఫలితాలను ఆ పత్రిక గత రెండు రోజులుగా ఆంధ్రా ఎడిషన్‌లో విస్తృతంగా, తెలంగాణ ఎడిషన్‌లో క్లుప్తంగా ప్రచురిస్తోంది. ఈ సమయంలోనే మైసూరా టీడీపీలోకి మళ్లీ ప్రవేశిస్తున్నారని వార్తలు రావడం విశేషం.
'గ్రేట్ ఆంధ్ర' ఈ ఏడాది ఫిబ్రవరిలో 'మైసూరా చివరి మజిలీ టీడీపీయేనా?', ఏప్రిల్‌లో 'పచ్చ' బొట్టేసిన చంద్రబాబు నీతో…' అనే కథనాలు ప్రచరించింది. ఇప్పుడు ఆ అంచనాలు నిజమవుతున్నాయా? మైసూరా పార్టీలో చేరిన తరువాత ఎమ్మెల్సీ చేస్తారని సమాచారం. ఈయన్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు సీఎం రమేష్ ప్రయత్నాలు చేశారట. గతంలో సుజనా చౌదరి ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి.
మైసూరా టీడీపీ నుంచి వైకాపాలో చేరిన కొంత కాలానికే జగన్ వ్యవహారశైలిపై ఆయనలో అసంతృప్తి మొదలైంది. పార్టీలో చేరిన కొత్తల్లో జగన్‌ను బాగా సమర్థించిన మైసూరా క్రమంగా దూరం జరగడం ప్రారంభించారు. ఒకప్పుడు టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ వైకాపా తరపున మైసూరాయే మాట్లాడేవారు. తరువాత మీడియాలో కనబడటం అరుదైపోయింది. జగన్ చేసే ఏ ఆందోళనలోనూ ఆయన కనబడలేదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయాల మీదా పెదవి విప్పలేదు. చంద్రబాబుపై వ్యతిరేకత ధ్వనించేలా వాఖ్యలు చేశారు.
అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశించి 'ఇది మా (రాయలసీమ) రాజధాని కాదు'…అని వ్యాఖ్యానించారు. రాయలసీమవారు కోస్తాంధ్రలో కలవబోరనే అభిప్రాయం పరోక్షంగా వ్యక్తం చేశారు. రాయలసీమలోని చంద్రబాబు వ్యతిరేకులు ప్రత్యేక రాయలసీమ ఉద్యమం లేవదీయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డివంటివారు కోస్తాంధ్రలో కలవబోమని చెప్పారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ప్రారంభిస్తే మైసూరాను కలుపుకోవాలని, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు.
రాయలసీమ ప్రయోజనాల కోసం గతంలో పోరాడిన చరిత్ర మైసూరాకు ఉంది. కాని ఆ తరువాత దీనిపై సమాచారం లేదు. మైసూరా రెడ్డి టీడీపీ నుంచి వైకాపాలో చేరినప్పుడు రాజ్యసభకు పంపుతానని జగన్ మాట ఇచ్చారట. దీంతో దానిపై మైసూరా ఆశ పెట్టుకున్నారు. కాని వైసూరాను కాదని తన కుడిభుజమైన విజయసాయిరెడ్డికి కట్టబెడుతున్నారట. ఇది మైసూరాకు ఆవేదన కలిగించిందంటారు.
టీడీపీ నుంచి వైకాపాలోకి చేరినప్పుడు ఆ చర్యను పూర్తిగా సమర్థించుకున్నారు. 'చిన్న పిల్లోడికి అండగా ఉండాలనుకున్నాను' అని అన్నారు. టీడీపీలో ఉండగా జగన్‌పై చేసిన ఆరోపణల గురించి చెబుతూ అవన్నీ బాబు చేయించాడని, జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని చెప్పేందుకు తన చేత కాకి లెక్కలు వేయించారని కూడా అన్నారు. వైకాపాకు రాజీనామా చేయగానే టీడీపీలోకి వెళతారనే పాత ప్రచారమే మళ్లీ తెర మీదకు వచ్చింది. అయితే తాను ఏ పార్టీలో చేరాలో, ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని మైసూరా మీడియాకు చెప్పారు. ఆ తరువాత ఆయన టీడీపీ మీద విమర్శలు చేసిన దాఖలాలు లేవు.
గత రెండేళ్లలో పాలక టీడీపీ మీద జగన్, వైసీపీ నాయకులు అనేక ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాజధాని భూముల విషయంలో నానా రగడ జరిగింది. సాక్షిలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. అయినా మైసూరా టీడీపీకీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో జగన్ అభిప్రాయాలను సమర్థించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ నిర్వహించిన ఏ ఆందోళన కార్యక్రమంలోనూ పాలుపంచుకోలేదు. వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనక డబ్బు ప్రమేయం ఉందని తాను అనుకోవడంలేదని కూడా అన్నారు. దీంతో టీడీపీ వైపు ఆయన అడుగులు పడతాయని అప్పుడే అనుకున్నారు. రిటైర్మెంటు వయసులో మైసూరా 'జంప్ జిలానీ' పాత్ర ధరించబోతున్నారా…!