చాన్నాళ్లుగా వార్తల్లో నానుతున్న తన రిటైర్మెంట్ అంశం గురించి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తేల్చేశాడు. ధోనీ ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడా? ఆడగలడా? అనే అంశాల గురించి బోలెడంత చర్చ జరిగింది. ప్రస్తుత టీమిండియాకు ధోనీ అవసరం ఉందని కొందరు, లేదని మరి కొందరు వాదించసాగారు. అయితే ఇప్పటికే చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఏడాది గడిపేసిన ధోనీ మాత్రం కామ్ ఉంటూ వచ్చాడు. చివరకు ఏమనుకున్నాడో కానీ.. ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.
కొన్నేళ్ల కిందటే ధోనీ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. వన్డే, టీ20 ఫార్మాట్ లలో కొనసాగుతూ వచ్చాడు. ఈ క్రమంలో వాటి నుంచి కూడా తప్పుకుని అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాడు ఈ క్రికెటర్. దీంతో ధోనీ ఆడిన చివరి మ్యాచ్ గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ సెమిఫైనల్ అయ్యింది. న్యూజిలాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయి, ఫైనల్ కు చేరలేకపోయింది. అప్పటికే ధోనీ బ్యాటింగ్ తీరుపై విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత తనే విశ్రాంతి కోరుతూ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు ధోనీ. ఆ తర్వాత మళ్లీ అతడి ఎంపిక జరగలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదు నెలలుగా టీమిండియా కూడా మ్యాచ్ లేవీ ఆడలేదు. ఇప్పుడప్పుడే టీమిండియా ఆడే అవకాశాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్ ను ప్రకటించి తప్పుకున్నాడు.
ఆటు బ్యాట్స్ మన్, వికెట్ కీపర్ గా ఇటు కెప్టెన్ గా ధోనీ భారత క్రికెట్ చరిత్రలో సంచలనం అని చెప్పనక్కర్లేదు. 15 సంవత్సరాలుగా ఎన్నో విన్యాసాలతో క్రికెట్ అభిమానులను అలరించాడు.
-తన కెరీర్ లో ధోనీ 90 టెస్టులు ఆడి 4,876 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఆరు సెంచరీలు చేసిన ధోనీ అత్యధిక స్కోరు 224.
-350 వన్డే మ్యాచ్ లు ఆడిన ధోనీ 10,773 పరుగులు పూర్తి చేశాడు. 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ అత్యధిక వన్డే స్కోరు 183 నాటౌట్.
-98 టీ20లు ఆడిన ధోనీ ఈ ఫార్మాట్ లో 1,617 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.
-కీపర్ గా టెస్టుల్లో 256 క్యాచ్ లు పట్టి 38 స్టపింగ్స్ చేశాడు. వన్డేల్లో 321 క్యాచ్ లు 123 స్టంపింగ్ లు ధోనీ ఖాతాలో ఉన్నాయి.
-టీ ట్వంటీల్లో 57 క్యాచ్ లు 34 స్టంపింగ్ లు చేసి.. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కీపర్ లలో అత్యంత సక్సెస్ ఫుల్ కీపర్ గా రికార్డు సృష్టించాడు.
ఇక ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసిన కొద్ది సేపటికే మరో ఆటగాడు సురేష్ రైనా కూడా అదే విషయాన్ని ప్రకటించాడు. తను కూడా ధోనీని అనుసరిస్తూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా రైనా ప్రకటించాడు. గత కొన్నాళ్లుగా రైనాకు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో 33 యేళ్ల ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
-కెరీర్ లో 18 టెస్టులు ఆడిన రైనా 768 పరుగులు చేశాడు. ఒక్క సెంచరీ ఉంది.
-వన్డే కెరీర్ లో 226 మ్యాచ్ లకు గానూ 5,615 పరుగులు చేశాడు రైనా. ఐదు సెంచరీలు చేశాడు.
-78 టీ20 మ్యాచ్ లు ఆడి 1,605 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్ లో ఒక సెంచరీ చేశాడు రైనా.
టీమిండియాకు గ్రేగ్ చాపెల్ కోచ్ గా ఉన్నప్పుడు రైనా ను ఆయన ఆకాశానికెత్తాడు. రైనా ఏనాటికైనా టీమిండియాకు కెప్టెన్ అవుతాడని చాపెల్ అంచనా వేశాడు. అయితే రైనా పూర్తి స్థాయి కెప్టెన్ కాలేదు. ఏదో గెస్ట్ అప్పీరియన్స్ లా ఎవరూ అందుబాటులో లేనప్పుడు రైనాకు కెప్టెన్సీ దక్కిన దాఖలాలున్నాయి.