గౌతమ్ గంభీర్.. ఒకప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దుమ్మురేపాడు. దాదాపు అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటాడు. ఇప్పుడేమో టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. రిటైర్‌మెంట్ ప్రకటించలేక, వచ్చిన ఒకటీ అరా అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక.. డైలమాలో పడిపోయాడు గౌతమ్ గంభీర్. సేమ్ టు సేమ్ అదే పరిస్థితి యువరాజ్‌సింగ్‌ది కూడా.
మొన్న టెస్టుల్లో గౌతమ్ గంభీర్‌కి రాక రాక అవకాశమొచ్చినట్లే, ఇప్పుడు యువరాజ్‌సింగ్‌కి కూడా అదే స్థితిలో అవకాశమొచ్చింది.. యువీ 2011 వన్డే వరల్డ్ కప్ హీరో. అంతకు ముందు టీ20 వరల్డ్ కప్‌లో కూడా అతనే హీరో. 'హీరో' కదా అని, ఫామ్‌లో లేని అతన్ని, ఫిట్‌నెస్ లోపించిన అతన్ని జట్టులోకి తీసుకోలేరు కదా.! కానీ, ఫిట్‌నెస్ వున్నా, ఫామ్‌లో వున్నా అవకాశాలివ్వకపోవడం అవమానకరమే.
గౌతమ్ గంభీర్ విషయంలో అయినా, యువరాజ్‌సింగ్ విషయంలో అయినా జరిగినవి అవమానాలే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఒక్క మ్యాచ్‌లో అవకాశమిచ్చి, సత్తా చాటేసుకోవాలంటే ఎలా.? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే.
ఎలాగైతేనేం, యువరాజ్‌సింగ్ జట్టులోకి వచ్చాడు. కానీ, ఎలా.? దీని వెనుక వున్నది ఎవరు.? అంటే, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాటల్లో అయితే పరోక్షంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు తెరపైకొస్తోంది. కోహ్లీతో సంప్రదించాకే యువీ సహా, ఇతర కొత్త ఆటగాళ్ళపై ఓ నిర్ణయానికొచ్చామని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు.
ఇదిలా వుంటే, గౌతమ్ గంభీర్ స్థాయిలో ఇంకా ఉప్పొంగిపోవడం లేదు యువరాజ్‌సింగ్. ఎందుకంటే, ఎంపికవడానికీ, తుది జట్టులో చోటు దక్కించుకోవడానికీ చాలా తేడా వుందని యువీకి తెలుసు. పైగా, గంభీర్‌కి గతంలో జరిగిన అవమానం యువీకి బాగా అర్థమయ్యింది. తుది జట్టులో యువీ చోటు దక్కించుకుని, ఫామ్ చాటుకుని, కనీసం ఐదారు వన్డేలు అయినా ఆడి, సత్తా చాటితేగానీ.. యువీకి బంపర్ ఆఫర్ తగిలిందని అనుకోలేం.