శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను ఇచ్చే హడావుడి ప్రారంభమైపోయింది. ట్వీట్లు మోత మోగిపోయాయి. హీరో బాలకృష్ణ తన సినిమా కోసం కెసిఆర్ కు వినతిపత్రం ఇచ్చారు. నిజానికి ఇది ఇవ్వాల్సింది నిర్మాతలు తప్ప హీరో కాదు. దర్శకుడు అంతకన్నాకాదు, ఆ సంగతి అలా వుంచితే ఓ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలంటే, ఆ సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకుల స్పందన వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది.
ముక్తకంఠంతో అందరూ బాగుందని, చరిత్రను బాగా తెరకెక్కించారని ప్రశంసించినపుడే రాష్ట్ర ప్రభుత్వాలు, పన్ను మినహాయింపునకు అనుకూలంగా స్పందించే అవకాశం వుంది. కేవలం తెలుగు పాలకుడి చరిత్ర అయినంత మాత్రాన సినిమా చూడకుండా పన్ను మినహాయింపు ఎలా ఇస్తారో అర్థం కాదు.
పైగా ఇదేమైనా ఫ్రీ ఫ్రాజెక్ట్ నా? కాదు. టేబుల్ ప్రాఫిట్ ప్రాజెక్టు. ఈ సినిమాకు పని చేసిన వారు ఎవరూ ఫ్రీగా పని చేయలేదు. డిస్కౌంట్ రేట్లకు పని చేయలేదు. అలా నిర్మాతలు నష్టపోలేదు. టేబుల్ ప్రాఫిట్ చేసుకున్నారు. తెలుగు పాలకుడి చరిత్ర తెరకెక్కిస్తున్నాం..అందుకు గాను, మేం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా పనిచేసాం అని ఏమన్నా అన్నారా? లేదే?
అందరూ పారితోషికాలు తీసుకున్నపుడు, నిర్మాతలు లాభం చేసుకున్నపుడు, ప్రభుత్వాలు మాత్రం ఎందుకు నష్టపోవాలి? అమెరికాలోని ఓ కీలక ప్రాంతంలో నెలకు పాతిక లక్షల వంతున ఫీజు చెల్లించి, రెండు నెలల పాటు హోర్డింగ్ పెట్టేంత స్థోమత వున్న సినిమా ఇది. మరి అలాంటి సినిమాకు పన్ను మినహాయింపు ఏలనో?