ఇండియన్ క్రికెట్‌లో 'వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్' అనే పేరున్న ఒకే ఒక్కడు సౌరబ్ గంగూలీ. టీమిండియాకి అనూహ్య విజయాలు అందించిన కెప్టెన్‌గా గంగూలీకి తిరుగులేని ట్రాక్ రికార్డ్ వుంది. బ్యాటింగ్‌లో గంగూలీ అద్భుతాలే సృష్టించాడు. ఇక, జట్టులో ఆత్మస్థయిర్యాన్ని నూరిపోసి, పోరాట పటిమను పెంచిన కెప్టెన్‌గా గంగూలీ సాధించిన పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు.
అయినాసరే, బోర్డుతో గంగూలీకి విభేదాలు చాలానే వుండేవి. అలాగే, అతని హార్స్ బిహేవియర్ కారణంగా జట్టు సభ్యులూ కొందరు అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఒకానొక సందర్భంలో గంగూలీ నుంచి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. లక్ష్మణ్ సంగతి సరే సరి. కుంబ్లే సహనాన్ని పరీక్షించేశాడు గంగూలీ. ఏం చేసినా, జట్టు కోసమేనని తర్వాత్తర్వాత గంగూలీ తీరుని ప్రశంసించారనుకోండి.. అది వేరే విషయం.
ఇలా, గంగూలీ క్రికెట్ కెరీర్‌లో అద్భుతాలే కాదు, వివాదాలూ అనేకం. ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీలో గంగూలీ సభ్యుడు. లక్ష్మణ్, సచిన్‌లతో కలిసి సలహా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు గంగూలీ. ఇక్కడ మళ్ళీ వివాదాలు షురూ. వెటరన్ క్రికెటర్ రవిశాస్త్రి పనిగట్టుకుని, గంగూలీపై విమర్శలు చేస్తున్నాడు. కోచ్ పదవికి పోటీ పడ్డ సమయంలో తనకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు, ఆ ప్యానల్‌లో గంగూలీ లేకపోవడం తనకు బాధ కలిగించిందంటూ ఒకటికి పదిసార్లు మండిపడుతున్నాడు.
రవిశాస్త్రి అయినా గంగూలీ అయినా.. టీమిండియాకి తమ తమ కెరీర్‌లో అద్భుత విజయాల్ని అందించినవారే. ఒకరు తక్కువ, ఒరు ఎక్కువ అనడానికి వీల్లేదిక్కడ. అయితే, గంగూలీకీ రవిశాస్త్రికి ఎక్కడ చెడింది.? అన్నదే పాయింట్ ఇక్కడ. గంగూలీ టీమిండియా నుంచి తప్పుకోవడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి రవిశాస్త్రి. అప్పట్లో క్రికెట్ విశ్లేషకుడిగా రవిశాస్త్రి, గంగూలీ వరుస వైఫల్యాల్ని ఏకిపారేశాడు. అలా, అప్పట్లో వీరిద్దరి మధ్యా శతృత్వం తారాస్థాయికి చేరింది.
మరి, గంగూలీ గతాన్ని గుర్తుపెట్టుకుని కావాలనే రవిశాస్త్రిని 'ఎవాయిడ్' చేస్తున్నాడా.? లేదంటే, అప్పటి వైరాన్ని రవిశాస్త్రినే ఇంకా కొనసాగిస్తున్నాడా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒక్కటి మాత్రం నిజం.. రవిశాస్త్రితో పోల్చితే, ఈ తరం క్రికెట్ అభిమానులకి సచిన్ తర్వాత ఆరాధ్య దైవం అంటే, సౌరవ్ గంగూలీనే. రవిశాస్త్రి కన్నింగ్ నేచర్ తెలిసినవారంతా, అతనే గంగూలీతో పంచాయితీ పెట్టుకుంటున్నాడని అంటున్నారు.
చూద్దాం.. ప్రస్తుతానికి కోచ్ పదవికి పోటీ పడి అవకాశం దక్కించుకోలేకపోయిన రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్‌గానో, ఇంకో రూపంలోనో గంగూలీతో కలిసి పనిచేయాల్సి వస్తే, అప్పటికి ఈ వివాదాలు ఇంకెంతలా ముదిరి పాకాన పడ్తాయో.!