ఊరించి, ఊస్సూరుమన్పించి.. ధోనీసేన ఫ్లాప్‌ షో.!

సిరీస్‌ ఎలాగూ పోయింది.. పరువైనా నిలుస్తుందా.? అని ఆశలు పెట్టుకున్న భారత క్రికెట్‌ అభిమానులకు నిరాశే మిగిలింది. కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు.. ఓ ఎండ్ లో ధావన్ సెంచరీ, ఇంకో ఎండ్లో కోహ్లీ సెంచరీ..…

సిరీస్‌ ఎలాగూ పోయింది.. పరువైనా నిలుస్తుందా.? అని ఆశలు పెట్టుకున్న భారత క్రికెట్‌ అభిమానులకు నిరాశే మిగిలింది. కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు.. ఓ ఎండ్ లో ధావన్ సెంచరీ, ఇంకో ఎండ్లో కోహ్లీ సెంచరీ.. ఇకనేం, ఛేజింగ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే మ్యాచ్‌ గెలిచేసినట్లే.. అని భారత క్రికెట్‌ అభిమానులు ఫిక్సయ్యారు.. అంతలోనే కోహ్లీ వికెట్‌ పడిపోయింది. అస్సలెవరూ ఊహించలేదు టీమిండియా, ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఓడిపోతుందని. 

రోహిత్‌ ధనాధన్‌ బాదేశాడు.. అర్థ సెంచరీ దాటకపోయినా, మంచి బిగినింగ్‌ ఇచ్చాడు. ఇంకో ఎండ్‌లో శిఖర్‌ ధావన్‌ చెలరేగిపోయాడు. రోహిత్‌ ఔటయ్యాక, వచ్చిన కోహ్లీ కూడా చితక్కొట్టేశాడు ఆసీస్‌ బౌలర్లని. కానీ ఏం లాభం.? శిఖర్‌ ధావన్‌ ఔటయ్యాక, వెంటనే కోహ్లీ కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ఆలస్యం చేయడానికి ఇష్టపడలేదు. చకచకా వికెట్లు పారేసుకున్నారు. చివరికి మ్యాచ్‌ని ఆస్ట్రేలియాకి అప్పగించేశారు. 

క్రికెట్‌లో ఇలాక్కూడా జరుగుతుందా.? అని అప్పుడప్పుడూ క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోవాలంటే ఇలాంటివి జరగాలి కదా మరి.! స్వదేశంలో పులి.. విదేశాల్లో పిల్లి.. అన్న మాటని ప్రతిసారీ టీమిండియా నిరూపించేసుకుంటోంది. ఆటలో గెలుపోటములు సహజం. అయితే, ప్రతి మ్యాచ్‌లోనూ చేతులెత్తేస్తోంటేనే, అభిమానులకీ చిరాకొస్తుంటుంది. ఇప్పుడు అదే జరిగింది. 

వాస్తవానికి ఆస్ట్రేలియా సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌ వైఫల్యం పెద్దగా ఏమీ లేదు. కానీ, మ్యాచ్‌ని నిలబెట్టడంలో బౌలర్లే ప్రతిసారీ విఫలమవుతున్నారు. ఈ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. ఫ్లాట్‌ పిచ్‌లు.. అనే సాకు చూపించడం తేలికే. కానీ, అదే ఫ్లాట్‌ పిచ్‌ల మీద మనం కూడా తడబడ్తున్నాం కదా. రోహిత్‌ సెంచరీ చేస్తే టీమిండియా ఓటమి తప్పదు.. అనే సెంటిమెంట్లకు కొదవేం లేదు. కానీ రోహిత్‌ ఆడనప్పుడు, ఇతర బ్యాట్స్‌మెన్‌ ఆడినప్పుడూ విజయం టీమిండియాని వరించలేదు. 

బ్యాట్స్‌మెన్‌ రాణించినా, బౌలర్లు చేతులెత్తేస్తే ఫలితం ఇలానే వుంటుంది. ప్రస్తుతానికి ఆసీస్‌ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 4 మ్యాచ్‌లు గెలిచి, కప్‌ని సొంతం చేసేసుకుంది. వైట్‌ వాష్‌ చేసేయడానికి ఆసీస్‌ చేతిలో ఓ మ్యాచ్‌ వుంది. అదే మ్యాచ్‌ వైట్‌ వాష్‌ కాకుండా వుండటానికి టీమిండియాకి చివరి అవకాశం. 'ఎలాగూ ఓడిపోయే మ్యాచ్చే..' అని ఈ రోజు మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటింగ్‌ అనంతరం భారత క్రికెట్‌ అభిమానులు ఫిక్సయిపోయారు. కానీ, అంతలోనే కాస్సేపు ఊరించారు. ఇది చూశాక, చివరి మ్యాచ్‌పై ఆసక్తి ఏమన్నా వుంటుందా.? ఛాన్సే లేదు. 

మైదానంలో అద్భుతాలు చేసే ధోనీలో మునుపటిలా కెప్టెన్సీ వ్యూహాలు కన్పించడంలేదు.. చేతికి అందివచ్చిన మ్యాచ్‌ని గెలిపించే మెరుపు ఇన్నింగ్స్‌ కూడా ధోనీ ఆడలేకపోయాడు. కెరీర్‌ని ముగించేయాలనే తొందరలో ధోనీ తడబడ్తున్నాడా.? ఏమో మరి.!