అదేమిటో, రాజకీయాలతో సంబంధం ఏర్పడితే గానీ కొన్ని మాటలకు ప్రాచుర్యం రాదు. ఎన్టీయార్ పాలిటిక్స్‌లోకి వచ్చేవరకూ 'వెన్నుపోటు' గురించి పెద్దగా పట్టించుకొన్నవారు లేరు. అదేదో ఆర్థోపెడిక్ వ్యవహారం అని ఊరుకొనేవారో ఏమో, ఇప్పుడు – ? ఎలక్షన్ నినాదాల్లో కూడా వెన్నుపోటుదే పెద్దపీట.
ప్రస్తుతం 'బయటి మద్దతు' కూడా అలాటిదే. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర్నుంచీ 'బయటి మద్దతు, లోపలి మద్దతు, లోపలిది బయటిది కావడం, బయటిది లోపల కావడం, బయటిదాని ఉపసంహరణ, లోపలిదాని ఉపసంహరణ' – ఇలాటి పదాలు లేకుండా ఏ డైలీ పేపరూ బయటకు రావటం లేదు. పైగా ఈ మాటలతోనే వాటి మనుగడ సాగుతోందన్న హడావుడి ఒకటి. అసలు వాళ్లెవరైనా బ్రహ్మం జీవితం పరిశీలించారా? 'బయటి మద్దతు' అనేది అడుగడుగునా వాడి జీవితంలో ఎంతటి ప్రముఖ పాత్ర వహించిందో తెలుసుకొనే ప్రయత్నం చేసారా? పోనీ కాలేజీ జీవితం నుండైనా అలా, ఓ ఝలక్‌గానైనా వాడి లైఫ్‌ని దర్శించారా?
********
''ఒరేయ్, మన క్లాసుమేట్ రాధను గాఢంగా ప్రేమించానురా. అదిరిపోయేట్లా ఓ బ్రహ్మాండమైన లవ్‌లెటర్ రాసాను కానీ ఇవ్వడానికి ధైర్యం చాలటం లేదు. కాస్త హెల్ప్ చేయరా'' అన్నాడు బ్రహ్మం రూమ్మేట్ సుబ్బుతో, ఓ సాయంత్రం.
సుబ్బు అప్పటికే లోకవ్యవహారాల్లో ఆరితేరిన ఘటం. కాలేజీ స్టూడెంట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓ గ్రూపునీ, కల్చరల్ అసోసియేషన్ ఎన్నికల్లో మరో గ్రూపునీ వెనకేసుకొచ్చి, ఇద్దరి సపోర్టు పోగొట్టుకొని, పదవి వూడి వున్నాడు. ''బ్రహ్మం, నా సిద్ధాంతాలు నాకున్నాయి. చదువుకునే వయస్సులో ప్రేమలో పడకూడదన్న సిద్ధాంతం నాది. అందువల్ల నీకు సహాయపడకూడదు. అయినా స్నేహితుడిగా నీ చర్యలకు మద్దతివ్వడం నా ధర్మం. కాబట్టి మధ్యేమార్గంగా బయటి మద్దతునిస్తాను. దాంతో తృప్తిపడు'' అన్నాడు.
అదే పదివేలన్నాడు బ్రహ్మం. ''అయితే లెటరు పట్టుకెళ్లి చేతికిచ్చేయి. లోపల నాపేరు రాయలేదు, ఎందుకైనా మంచిదని. నువ్వే ఓరల్‌గా చెప్పేయి, నేనిచ్చానని'' అన్నాడు ఉత్సాహం ఉరకలేస్తూండగా.
''భలేవాడివి. బయటి మద్దతు పరిమితులు నీకు తెలియవు లాగుంది. ఉత్తరం ఇవ్వాల్సింది నువ్వే. మద్దతు మాత్రం నాది''
''అంటే?''
''అంటే, రాధ లేడీస్ టాయిలెట్‌కి వెళ్లినప్పుడు నువ్వు ఆమె వెనక్కాలే వెళ్లి లెటరు చేతికిచ్చెయ్. చెంపదెబ్బ కొట్టినా ఎవరికీ వినబడదు. నే నీ లోపుల బయట కాపలా కాస్తాను. ఎవరైనా వస్తే 'బాత్‌రూమ్ అవుటాఫ్ ఆర్డర్' అని చెప్పి ఎవరూ రాకుండా చూస్తాను.''
అదే అయిదువేలన్నాడు బ్రహ్మం. రెండు రోజుల తర్వాత లంచ్‌టైములో వాడు అనుకున్న ప్రకారం బాత్‌రూమ్‌లో రాధను కలవడం కుదిరింది. వణుకుతున్న చేతుల్తో రాధకు ఉత్తరం ఇవ్వబోతూ కింద పడేస్తున్న టైములో లేడీ ప్రిన్సిపాల్‌గారు బాత్‌రూమ్‌లోకి రాబోయారు. సుబ్బు భయపడుతూనే, 'రిపేరు, మేడమ్, కిందఫ్లోర్‌లో దానికెళ్లండి' అన్నాడు. ఆవిడ అసలే భారీ మనిషి. మరింత భారీతనం అరువు తెచ్చుకుని, 'నువ్వెవరు?' అంది. ''సివిల్ కాంట్రాక్టర్ తాలూకు మనిషిని'' అన్నాడు సుబ్బు వణుకు దాచుకుంటూ.
''మొన్ననేగా రిపేరు చేయించింది. మేం కంప్లెయింట్ ఇవ్వకుండానే మీరు వచ్చారంటే…? ఇంపాజిబుల్. చూస్తే స్టూడెంటులాగున్నావు. కాంట్రాక్టరు మనిషినంటున్నావు. చేతిలో ఆ బుక్స్ ఏమిటి? వాటీజ్ యువర్ నేమ్? ఉచ్ సెక్షన్?…'' అని ఆవిడ గొంతు చించుకోవడంతో సుబ్బు, అరిగిపోయిన సబ్బులా జారిపోయాడు.
********
మర్నాడు మధ్యాహ్నం ప్రిన్సిపాల్ రూమ్ లోంచి రాధ, ఆమె తండ్రి కోటేశ్వర్రావు బయటకొచ్చే సమయానికి బ్రహ్మం బిక్కమొహం వేసుకొని వరండాలో బెంచీ మీద కూచున్నాడు. కోటేశ్వర్రావు దగ్గరకొస్తూంటే లేచి భక్తిగా, భయంగా లేచి నిలబడ్డాడు కూడా. అయినా ఆయన కరగలేదు. ''ఏటయ్యా నీ వెహారం? ప్రిన్సిపాల్ గారు అంతా చెప్పారు. బాత్రూమ్‌లో దూరి అల్లరి పెట్టేటంత మొనగాడివా? కాలేజీలో వారం రోజులు సస్పెండ్ చేసారు. ఇప్పుడు చూపించు నీ మొగతనం. అంతే కాదు. నీ కీ డోసు చాలదు. నేనిస్తాను ఓ స్ట్రాంగు డోసు చూడు. నా కూతుర్ని అల్లరి పెట్టినోడిని నేను క్షమించడమే!? ఇంపాజిబుల్. రేపు సాయంత్రం తాటితోపు దగ్గరకు రా. నా తడాఖా చూపిస్తాను. రాకపోయావో, అప్పుడూ చూపిస్తా – పబ్లిగ్గా. ఖబడ్దార్. నువ్వు క్షమాపణలడక్కు. నే నివ్వను.'' అని చరచరా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. పోనీ రాధనైనా క్షమాపణ అడుగుతామనుకొంటే తండ్రి ఆమెను ఈడ్చుకుపోతున్నాడు.
బ్రహ్మానికి కన్నీళ్ల పర్యంతం అయింది. వరండా స్తంభం చాటున దాక్కున సుబ్బు బయటకు వచ్చి భుజాన చేయి వేసి ఊరడించబోయేడు. కోపం, రోషం కలిపి, ''ఏవిట్రా సుబ్బూ, వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదు. లవ్‌లెటరూ ఇవ్వలేకపోయాను. అది కిందపడి తడిసిపోయింది. సస్పెన్షన్, అది చాలదన్నట్టు వాళ్ల నాన్న చేత బాజా బజాయింపు కార్యక్రమం ఒకటి. చూశావా నీ నిర్వాకం?'' అన్నాడు బ్రహ్మం.
బ్రహ్మం అజ్ఞానానికి సుబ్బు జాలిపడ్డాడు. ''నేనిస్తానన్నది బయటిమద్దతే కదా. ప్రిన్సిపాల్ గారు రావడంతో నాకు భయం వేసింది. వెళ్లిపోయాను''
''పోనీ పోతూ, పోతూ ఓ కేక పెట్టలేకపోయావా? నేను ఏదో మూల నక్కి ఆవిడ వెళ్లిపోయిన తర్వాత బయటపడేవాణ్ని.''
''అది మద్దతుదారులు చేసే పనికాదు. వ్యవహారం నడుపుకోవలసినది నువ్వే. నువ్వివాళ ఎలా మునిగావో చూసి తెలుసుకొంటే, రేపు నే నా పరిస్థితిలో ఉంటే ఏమవుతుందో, కథ ఎంత దూరం పోతుందో తెలుసుకోగలుగుతాను. అందుకే బయటి మద్దతు నిస్తానన్నది'' అని విశదీకరించాడు సుబ్బు.
********
ఆ సాయంత్రం ఓ పెద్ద (ఆకారంలో) మనిషి కలిసాడు బ్రహ్మాన్ని. పేరు జంబుకేశ్వర్రావుట. వెనక్కాల అరడజను మంది జమాజట్టీల్లాటి మనుషులున్నారు. ''కోటేశ్వర్రావు నిన్ను బెదిరించాడటగా. నీకేం భయం లేదు. ఎదురొడ్డి పోరాడు. మేం బయటనుంచి మద్దతు ఇస్తాం'' అన్నాడు జంబూకం బ్రహ్మం భుజం తట్టి.
''నా ప్రేమ వ్యవహారం గురించి మీరింత తంటాలు పడుతున్నారంటే, అదీ నేనడక్కుండా, మీ అంతటి మహా..''
''…ఆగాగు, మేం నీకు మద్దతునిచ్చేది, నీ మీది ప్రేమతో కాదు, కోటిగాడి మీద కోపంతో. వాడుత్త లంచగొండి. నా దగ్గర లంచం పుచ్చుకున్నాడు కానీ పనిచేసి పెట్టలేదు. పోనీ డబ్బు వెనక్కిచ్చాడా అంటే అదీ లేదు. అందువల్ల వాడి మీద పగబట్టాను. నేను కొడితే కేసవుతుంది. వాడు నా మీద పోలీసు కంప్లెయింటు ముందే ఇచ్చి ఉన్నాడు. అందువల్ల..''
''…అందువల్ల నా ద్వారా మీరు పగ తీర్చుకుంటారన్నమాట. పోన్లెండి, దీన్లో మీకూ లాభం ఉంది, నాకూ ఉంది. అలాగే కానివ్వండి'' అన్నాడు బ్రహ్మం విషాదం రంగరించిన నువ్వు మొహానికి పులుముకుని.
మర్నాడు సాయంత్రం తాటితోపులో బ్రహ్మం గంభీరంగా నిలబడ్డాడు. వెనకాల నిలబడ్డ ఆరుగురు సిమ్మెంటు స్తంభాల్లాంటి మనుషుల అండ చూసుకొని ఛాతీ పొంగించి 'ఏడీ కోటేశ్వర్రావు, ఇంకా రాడేం?' అన్నట్టు మెడ రిక్కించి చూస్తున్నాడు.
పాపం, కోటేశ్వర్రావు రాకపోలేదు. బ్రహ్మాన్ని చితకబాదడానికి తానొక్కడూ చాలనుకొని ఒంటరిగా వచ్చి కూచుని అరగంటయింది. కానీ అతని వెనకాల మనుషులను చూడగానే తన అంచనా తప్పని తేలింది. పదిమంది గూండాలను పంపమని తనకు తెలిసున్న రౌడీ కొకతనికి ఫోన్ చేసి నక్కి కూచున్నాడు.
ఇంకో పావుగంట చూసి 'ఇకపోదాం రండి, కోటేశ్వర్రావు తోక ముడిచాడు' అంటూ బ్రహ్మం కదలేటంతలో కోటేశ్వర్రావు తన కిరాయి రౌడీలతో దిగబడ్డాడు. వికటాట్టహాసాలు, తొడ చరుపుల కార్యక్రమం త్వరలోనే ముగించి ఆ పదిమందీ బ్రహ్మం మీద పడ్డారు. కొద్ది నిమిషాల్లోనే అతనికి అర్థమయింది – తన వెనక నిలిచిన జంబూకం మనుషులు ఉత్సవ విగ్రహాల్లా నిలబడ్డం తప్ప మరేమీ చేయలేదని. ఆ విషయంపై ఆలోచించే శక్తి కొద్ది సెకన్లలోనే పోగొట్టుకున్నాడు. శరంపరగా పడుతున్న దెబ్బలవల్ల. కానీ వాళ్లనేదో అడగాలన్న కోరిక మాత్రం చావలేదు. చివరికి ఓపిక చేసుకొని అడిగాడు, కోటేశ్వర్రావు మనుషులు తనని ఏ కీలు కా కీలు వూడదీసి పడేసాక. ''మీరు వచ్చినదెందుకు? చేసినదేమిటి?'' అని.
పాపం వాళ్లు ఓపికమంతులే. విసుక్కోకుండా 'బయటి మద్దతు' అర్థం తెలియజెప్పారు. 'ప్రతికూల శక్తులను ఎదుర్కోడానికి మేం మానసిక స్థయిర్యం ఇస్తాం. అంతేగానీ మా శక్తియుక్తులు నీకై ఖర్చు చేయం' అని. 'కావాలంటే దగ్గరున్న హాస్పటల్ పేరు చెప్పి పుణ్యం కట్టుకుంటాం' అని ఓ ఆఫర్ కూడా ఇచ్చారు.
********
పదిరోజుల తర్వాత బ్రహ్మం హాస్పటల్ నుండి డిశ్చార్జి అయ్యేడు. కుంటుకుంటూ నీరసంగా వచ్చి హాస్పటల్ ఎదురుగా ఉన్న పార్కులో బెంచీ మీద కూలబడ్డాడు. కళ్లు మూసుకుని రాధ రూపాన్ని తలచుకున్నాడు. రాధ మాట వినబడింది. కళ్లు తెరిచి చూస్తే మాట మాయవుతుందేమో చూద్దామని కళ్లు తెరిచాడు. కట్టెదుట రాధ కనబడింది. మాటలు వినబడుతూనే ఉన్నాయి.
''…మీ గురించి ఎంత వెతికానో తెలుసా, …మా నాన్న హాస్పటల్‌కి రానిచ్చాడు కాడు… నా గురించి దెబ్బలు తిన్నారు. నా పై మీ ప్రేమను నిరూపించుకున్నారు. ఆ రోజు నుండి మీకై కలవరించని రోజు లేదు…'' అంటోంది రాధ.
''….నా లెటర్ కింద పడిపోయిందిగా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు ఎలా తెలిసింది?'' అన్నాడు బ్రహ్మం బోల్డంత ఆశ్చర్య'పడ'బోయి, బెంచీ కొస పట్టుకొని నిలదొక్కుకుంటూ.
''ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి అంత రహస్యంగా ఉత్తరం ఇవ్వజూపితే దాంట్లో ఏముంటుందో ఊహించుకోలేనా?'' అంది రాధ బుంగమూతి పెట్టి.
బ్రహ్మం బ్రహ్మానందభరితుడై పోయాడు. ఒంటినొప్పులు మర్చిపోయి టక్కున లేచి నిలబడ్డాడు. ''రా, వచ్చి కూచో'' అంటూ బెంచీ మీద దుమ్ము దులిపి రాధకు ఆఫర్ చేసాడు. రాధ సిగ్గు పడుతూనే అసలు విషయం చెప్పింది –
''పెళ్లికి ముందు ఎవరితోనూ ప్రేమలో పడవద్దని మా నాన్నగారు చెప్పారు. పడినా ఎదటివారితో సంకీర్ణంగానీ, భాగస్వామ్యం కానీ కాకుండా బయటనుండి మద్దతు ఇచ్చి ఊరుకోమన్నారు. అందుకని, నేను మీకు బయటిమద్దతే ఇస్తా'' అంది.
''పోనీ అలాగే కానీ, వచ్చి నా పక్కన కూచో, అదే చాలు'' అన్నాడు బ్రహ్మం, 'ఎక్కడికక్కడే…' అన్న ధోరణిలో.
''అమ్మో, మీతో బాటు బెంచీ మీద కూచుంటే పాలు పంచుకున్నట్లవదూ'' అంటూ దగ్గర్లో ఉన్న ఖాళీ పూలకుండీని బోర్లేసి బెంచీ పక్కనే వేసి, దానిమీద కూచుంది రాధ.
బ్రహ్మం బెంచీ మీదనుంచి లేచి ఆమె చేయి అందుకున్నాడు, కానీ ఆమె విడిపించుకుంది. ''మీరు దూరంగా కూచుంటే మీకు గాలిలో ముద్దు ఇస్తా'' అని ఆశ పెట్టిందామె. ఆ తర్వాత 'ఇదిగో మీ ఛాతీ మీద నిమురుతున్నా' అంటూ అతని శరీరానికి ఆరంగుళాల దూరంలో గాలిలో చేయి ఆడించింది. అదే పద్ధతిలో కౌగలింతలు, ముద్దులు కూడా జరిగేయి. ఒక దశలో ఆమె చేస్తున్న ఓ చర్య బొత్తిగా అర్థం కాలేదు బ్రహ్మానికి. ''ఏమిటి, దోమలు తోలుతున్నావా?'' అని అడిగి చూశాడు. ''కాదు, మీ జుత్తులో వేళ్లు జొనిపి ఆడిస్తున్నానన్నమాట'' అని జవాబు వచ్చింది.
దీనితో తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు బ్రహ్మం. ''ఇక చాలు బాబోయ్, తక్కిన ఏ విషయంలోనైనా బయటి మద్దతు స్వీకరిస్తాను కానీ, ప్రేమ విషయంలో మాత్రం ఛస్తే ఒప్పుకోను. నిన్ను పెళ్లాడతాను; సంపూర్ణ మద్దతు, కాదు, కాదు… విలీనం కోరతాను. అంతవరకూ నిన్ను కలవను. మా వాళ్ల ద్వారా మీ నాన్నగారికి చెప్పించి పెళ్లికి ఒప్పిస్తాను.'' అని శపథం చేసాడతను.
********
బ్రహ్మం రాయబారాలు ఫలించేయి లాగుంది. ఓ నెల్లాళ్ల తర్వాత కోటేశ్వర్రావు స్వయంగా బ్రహ్మాన్ని కలవడానికి రూముకొచ్చేడు.
''నువ్వు బుద్ధిమంతుడివని మా అమ్మాయి నివ్వడానికి ఒప్పుకొన్నానోయ్. మాఘమాసం రాగానే పెళ్లి చేసేద్దాం. ఏదో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కదాని ఒప్పుకున్నా గానీ, లేకపోతే మా అమ్మాయికి దీని తాతలాటి సంబంధం…''
''చాలా థాంక్సండీ, మామగారూ'' అన్నాడు బ్రహ్మం ఆయన వాక్యం పూర్తిగా వినడానికి ఇష్టపడక.
''కాస్త ఆగు బాబూ, అప్పుడే మావగారు అనకు. ఓ చిన్న పని చేసి పెడితే వెంటనే పెళ్లికి ఒప్పుకుంటాను. లేదంటే కాస్త ఆలోచించాల్సి వస్తుంది. పిల్ల నివ్వబోయే ముందు కుర్రాడి శక్తియుక్తులు అంచనా వేసి చూసుకోవాలనుకోవడం తప్పులేదు కదా…'' అని ఆర్ధోక్తిలో ఆగేడాయన.
''నా శక్తి, యుక్తి గురించి మీకేమీ సందేహం వద్దండి…''
''…అదే మరి, విషయం చెబుతా. తలుపు కాస్త దగ్గరగా వేసి రా. నువ్వైతే కాబోయే ఫామిలీ మెంబరువి. ఊళ్లో వాళ్లెందుకు మన లొసుగులు వినడం?'' అని బ్రహ్మాన్ని కూచోబెట్టి అసలు విషయం నెమ్మదిగా చెప్పాడు కోటేశ్వర్రావు.
– ''మనవాళ్లొట్టి కుళ్లుబోతులోయ్. నేను లంచాలు పడుతున్నానని చెప్పి పిటిషన్లు పెట్టి నన్ను సస్పెండ్ చేయించారు కొందరు వెధవలు. ఏంటీ కరప్షన్ బ్యూరో వాళ్లకు అప్పగించారా కేసు. నా కేసు చూసే ఆఫీసరు మాధవరావని, గాంధీ నగర్లో ఆకుపచ్చ మేడ, నువ్వు చూసే ఉంటావు, అక్కడ ఉంటాడు. పై అంతస్తులో అతని పడగ్గదిలోనే ఫైళ్లన్నీ ఉంటాయి. నీలంరంగు ఫైలు నా కేసుది. నాకు వ్యతిరేకంగా వాళ్లు సేకరించిన సాక్ష్యాలు, సంపన్నాలూ అన్నీ అందులోనే ఏడిచాయిలే. నువ్వెళ్లి ఆ ఫైలు పట్టుకొచ్చేయి. మా అమ్మాయితో నీ పెళ్లి ఖాయం''
బ్రహ్మానికి బుర్ర తిరిగింది. చేయనని ఛట్టున అనేస్తే మొదటికి మోసమని అనేక అడ్డుపుల్లలు వేసాడు, సందేహాలు లేవనెత్తాడు. వాటన్నిటికి కోటేశ్వర్రావు దగ్గర సమాధానాలున్నాయి – 'ఆఫీసరు గారింటి కాంపౌండుగోడ నానుకొని వీధిలో చెట్టు ఉంది. రాత్రివేళ నిచ్చెన సహాయంతో బ్రహ్మం చెట్టెక్కి కొమ్మలమీద నుంచి డాబా మీదకు దిగవచ్చు. అక్కణ్నుంచి చప్పుడు చేయకుండా బాల్కనీలోకి దిగి బెడ్‌రూమ్‌లోకి దూరిపోవచ్చు. తలుపు తీసే ఉంటుంది. లోపలికి వెళ్లి ఫైల్ బయటకు తీసుకువచ్చి చెట్టు కిందనున్న కోటేశ్వర్రావు వైపు విసిరితే చాలు. ఫైలు కనబడకపోతే విచారణ వాయిదా పడుతుంది. ఈ లోపుల కోటేశ్వర్రావుకి తెలిసున్నతను ఆఫీసరుగా వస్తాడు.' ఈ ఆపరేషన్‌లో కోటేశ్వర్రావు బయటి మద్దతు ఇస్తాట్ట. అంటే నిచ్చెన వేయడం పట్టుకోవడం, ఎవరైనా వస్తే హెచ్చరించడం అన్నమాట.
''పోనీ ఆ 'బయటి మద్దతే'దో నేనే ఇస్తాను. మీరెక్కండి నిచ్చెన'' అన్నాడు బ్రహ్మం తెగించి.
''మామూలు పరిస్థితిలోనయితే సరేనందును. కానీ ఈ విషయంలో మాత్రం అది కుదరదు. ఏదైనా బెడిసికొట్టి పట్టుబడితే, నువ్వయితే దొంగనుకొని నాలుగు తన్ని వదిలేస్తారు. అదే నేనయితే ఈ ఫైలు గురించే వచ్చేనని తెలుసుకొని సాక్ష్యాలు నాశనం చేయబోయేనని చెప్పే డిస్మిస్ చేసి పారేస్తారు. పెళ్లి జరపడానికి నా దగ్గర చిల్లిగవ్వ ఉండదు. దాంతో పెళ్లి ఆగిపోతుంది.''
సరేననక తప్పలేదు బ్రహ్మానికి.
అంతా అనుకున్నట్టే జరిగింది, బ్రహ్మం బ్లూ ఫైల్ విసిరేదాకా. ఆ తర్వాత చెట్టుమీద నుండి దిగాలని చూస్తే నిచ్చెన కనబడలేదు. ''ఏవండోయ్, నిచ్చెన?'' అని అరిచేడు బ్రహ్మం, ఫైల్ పట్టుకొని పరిగెడుతున్న కోటేశ్వర్రావుని చూసి.
''సారీ, చెప్పడం మరిచిపోయానోయ్, మద్దతు ఉపసంహరించుకున్నాను. చెట్టుమీద నుండి ఉరికేయ్. తల బద్దలవుతే పిచ్చి పట్టి ఇక పెళ్లి మాట మర్చిపోతావు'' అన్నాడు కోటేశ్వర్రావు పరుగు ఆపకుండానే.
'అమ్మ టోకేశ్వర్రావ్' అనుకున్నాడు బ్రహ్మం. అనుకోవడమేమిటి, అరిచినట్టున్నాడు. వాచ్‌మన్‌కి అది వినబడటం, దొంగనుకొని బ్రహ్మాన్ని చెట్టు దింపి నాలుగు తగిలించడం జరిగేయి. ఈసారి బ్రహ్మం పిక్కబలమే అతన్ని కాపాడింది.
********
మర్నాడు పొద్దున్నే కోటేశ్వర్రావు బ్రహ్మం దగ్గరకు విసవిసా వచ్చాడు. ఫైల్ విసిరేసి '' 'బ్లూఫైల్ అంటే ఈ రంగుది తెచ్చేవేమయ్యా'' అంటూ కోప్పడ్డాడు.
''బెడ్‌రూము లైట్ బ్లూగా ఉంది కాబట్టి అన్నీ బ్లూగానే అనిపించాయి. పొరబాటయిందేమో, అయినా నేను మీకు సంజాయిషీ ఇవ్వడం దేనికి? మీరు చేసిన ద్రోహానికి…''
''స్టాప్‌్. ఆపత్కర పరిస్థితుల్లో, మితృలే శతృవులయితే నువ్వెలా ఎదుర్కొంటావో అదొక పరీక్షన్నమాట. అసలు నిన్ను ఫెయిల్ చేసేయాల్సిందే. అయినా పోనీ కదాని రీ-ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. ఇవాళైనా తీసుకురా, కావాలంటే నా మద్దతు…''
''మీ మద్దతుకీ, మీకూ ఓ దణ్ణం. నా పాట్లు నేను పడతాను. కానీ పెళ్లి సంగతి..''
''…ఫైలు పుచ్చుకున్న చేత్తో కన్యాదానం చేసి తీరతాను. నా మాట నమ్ము.'' అన్నాడు కోటేశ్వర్రావు రవివర్మ భీష్మప్రతిజ్ఞ పోజు పెట్టి.
********
కాసేపటికి బ్రహ్మం, మాధవరావు వాచ్‌మన్‌తో గుసగుసలాడుతున్నాడు. ''మిమ్మల్నెక్కడో చూసాను సార్'' అంటున్న వాచ్‌మన్‌తో ''నిన్ననే కదా పరిచయమైంది. అప్పుడే మర్చిపోతే ఎలా? అయినా నేను డబ్బు దొంగిలించడానికి రాలేదయ్యా, ఏదో ఆఫీసు కాగితాల గొడవ. నేను చెప్పిన ఫైలు తెచ్చిపెట్టు. నాలుగొందలిస్తా. నీ మీద ఎవరికీ అనుమానం రాదు. అసలు ఫైలు పోయిందనే విషయమే వారం దాకా బయటకు రాదు. ఈ లోపుల ఫైలు పట్టుకొచ్చి ఇచ్చేస్తా'' అన్నాడు బ్రహ్మం.
వాచ్‌మన్ మెత్తబడ్డాడు. కానీ ''నాకవన్నీ తెలియవు. మీరు లోపలికి వెళ్లి తెచ్చుకోండి. నేను బయటి మద్దతు ఇస్తా'' అన్నాడతను. ''బయటి మద్దతంటే భయం పట్టుకుందయ్యా, నీవే లోపలికి వెళ్లి బెడ్‌రూమ్ కిటికీలోంచి ఫైలు కిందకు పడేయ్. నేను గోడ కివతల నక్కి ఉంటా. ఫైల్ పడేయగానే, అందుకొని గోడ కవతల ఉన్న మా మావగారికి విసిరేస్తా. ఆయన అక్కణ్నుంచి అలాగే వెళ్లిపోతాడు. ఎవరికైనా అనుమానం వచ్చి వెతికినా ఏమీ దొరకదు'' అని నచ్చచెప్పాడు బ్రహ్మం.
చివరికి బేరం కుదిరి అయిదువందలు చేతిలో పడ్డాక వాచ్‌మన్ పైకి వెళ్లాడు. అతను మెట్లెక్కుతుండగానే మాధవరావు భార్య ఎదురైంది. 'వాచ్‌మన్ అనేవాడు గేటు దగ్గరుండాలి. పైన ఏం పని నీకు?' అని తిట్టిపోసింది.
గోడచాటు నున్న బ్రహ్మం భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి తిరిగిచూస్తే, వాచ్‌మన్.
''ఫైలేదీ?'' అన్నాడు బ్రహ్మం ఆతృతగా.
''నా వల్ల కాదు, మీరే వెళ్లి తెచ్చుకోండి. అమ్మగారు స్నానానికి వెళుతున్నారు. అయ్యగారు డాబామీద పేపరు చదువుకుంటున్నారు. మీరు చప్పున వెళ్లి ఫైలు కింద పడేయండి. నేను దాచి ఉంచుతాను'' అన్నాడు వాచ్‌మన్.
''ఆ కాడికి ఐదువందలెందుకు పుచ్చుకున్నావు? లోపలి మద్దతు అంటే నువ్వే లోపలికి వెళ్లి…''
''అబ్బ, లోపలి మద్దతు, బయటి మద్దతుగా ఫిరాయించానండీ…''
''ఎప్పుడు?''
''ఇప్పుడే.., చర్చలు ఆపండి సార్. ఖర్మం చాలక మీరు పట్టుబడితే నేను దెబ్బలు లైటుగా కొడతాను. సరేనా? త్వరగా వెళ్లండి, లేకపోతే ఆయన వచ్చేస్తాడు'' అని తొందరపెట్టాడు వాచ్‌మన్. గత్యంతరం లేక బ్రహ్మం మెట్లెక్కాడు.
********
ఈ లోపుగా వీళ్లకు తెలియకుండా కొన్ని మార్పులు జరిగాయి. డాబా మీద పేపరు చదువుతున్న మాధవరావు పడగ్గదిలో చేరాడు, పనిమనిషి రత్తాలుతో సహా. దానికి కారణం, డాబా ఊడుస్తూ, రత్తాలు అతని మీదకు వంగి, ''అమ్మగారు స్నానాలగదిలోకి ఇప్పుడే ఎళ్లారు. ఆరొచ్చేలోగా నాతో మీకేదైనా పని ఉందా'' అని అంటూ కన్నుగీటడం. అతను పేపరు చాటునుండే దాన్ని ఓ దరువు వాయించి గబగబా కిందకు దిగాడు. అటాచ్డ్ బాత్‌రూములో నీళ్ల చప్పుడు వినబడుతోంది. మంచం మీదకు చేరుతూనే రత్తాల్ని మీదకు లాక్కున్నాడు మాధవరావు. వాళ్లిద్దరూ గాఢాలింగనంలో ఉండగానే తలుపు తోసిన చప్పుడు వినబడింది. 'స్నానం అప్పుడే అయిపోయి ఉండదు. ఏ సబ్బు కోసమో బయటకు వస్తోందేమో, అది మళ్లీ లోపలికి వెళ్లేదాకా మంచం కింద దాక్కుందాం' అంటూ గుసగుసలాడి రత్తాలుతో సహా మంచం కిందకు దూరిపోయాడు మాధవరావు.
తలుపు నెమ్మదిగా తోసినది బ్రహ్మం! అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. గదిలో ఎవరూ కనబళ్లేదు. టేబుల్ దగ్గరకెళ్లి ఫైల్ వెతకడం మొదలెట్టాడు. అయిదు నిమిషాలయిందేమో, బాత్‌రూము తలుపు తీస్తున్న చప్పుడయింది. 'ఇంటావిడ స్నానం చేస్తున్నది దీని అటాచ్డ్ బాత్‌రూములోనా, కొంప మునిగిందే' అనుకుంటూ ఫైల్ వదిలేసి మంచం కిందకు దూరిన బ్రహ్మం అప్పటికే ఇద్దరు మనుష్యులు అక్కడ ఉండడం చూసి తెల్లబోయాడు.
గదిలోకి వచ్చినవాళ్లు బయటకు వెళ్లాక పైకి వద్దామని చూస్తున్న మాధవరావు, వచ్చినవాడు తన పక్కనే చేరడంతో బిత్తరపోయాడు. తన ఒంటిమీద బనీను, గళ్లలుంగీ. పక్కన మాసిన బట్టలు వేసుకున్న రత్తాలు. అందుకే లాగుంది, వచ్చినవాడు 'మీ ఇద్దరూ దొంగతనానికి వచ్చారా?' అని అడిగాడు.
కాదనలేక, అవుననలేక ఏదోలా తల ఊపాడు మాధవరావు. 'నువ్వెందుకు వచ్చావు?' అని అడిగే ధైర్యం చాలలేదు. పక్కనున్న రత్తాలు పరిస్థితి తీవ్రత గమనించకుండా తన నడుం మీద మోచెయ్యి వేసి జుట్టు నిమురుతూండడం చికాకు కలిగించింది. తన పరిస్థితికి తనే జాలిపడుతూ నోరెత్తకుండా తల వంచుకొని ఊరుకున్నాడు.
కానీ బ్రహ్మం మాత్రం ఊరుకోలేదు. తలకాయ కాస్త బయటకు పెట్టి బాత్‌రూమ్‌లోంచి వచ్చినావిడ వెళ్లిపోయిందేమో చూడబోయేడు. ఆవిడ టవల్ విప్పి పారేసి, డ్రెస్సింగుటేబులు ముందు నుంచొని పౌడరు రాసుకొంటోంది. బ్రహ్మానికి నోట తడారిపోయింది. తలకాయ లోపలికి పెట్టుకోవడం మర్చిపోయాడు.
కాస్సేపటికి మాధవరావు తలెత్తేసరికి బ్రహ్మం నోరు తెరిచిఉండడం కనబడింది. అతని చూపులెక్కడున్నాయో గ్రహించేసరికి అతనికి చిర్రెత్తుకొచ్చింది. బ్రహ్మం మెడ పట్టుకుని బలవంతంగా తలకాయ తనవైపు తిప్పుకున్నాడు. బ్రహ్మానికి చచ్చేంత కోపం వచ్చింది. ''ఉండవయ్యా, భలే సీను, నీకేం పోయింది? నీ పెళ్లం పక్కనుంది కాబట్టి నువ్వు చూడడానికి కష్టం. లేకపోతే నువ్వూ కళ్లింత చేసుకుని చూసేవాడివే. నన్ను చూసి ఏడవకు. డిస్టర్బ్ చేయకు'' అంటూ మెడ మళ్లీ బయటకు రిక్కించాడు.
ఆ మెడ పిసికేయాలనుకున్నాడు మాధవరావు. భార్య బయటకు వెళ్లేదాకా ఓపిక పడితే ఆ తర్వాత వీడి పని పట్టచ్చు అని తనను తాను ఓదార్చుకోబోయాడు కానీ, బ్రహ్మం మొఖంలో కనబడే హావభావాలు అతన్ని ఉండనీయలేదు. అతని కళ్లల్లో ఏమేం పడుతున్నాయో ఊహించుకొనేసరికి అతనికి పిచ్చికోపం వచ్చి లేవబోయాడు. పక్కనున్న రత్తాలు పరిస్థితి గ్రహించి అతని నడుం చుట్టూ కాలు వేసి అదిమి పట్టింది. ''ఊరుకోండి, ఊరుకోండి'' అంటోంది. కానీ తన భార్య కేసి ఆబగా చూస్తున్న బ్రహ్మం నోటిలోంచి చొంగ కూడా కారడంతో మాధవరావు ఉండబట్టలేకపోయాడు. ''ఒరేయ్'' అంటూ అరుస్తూ లేచి నిలబడబోయాడు.
********
గోడ దగ్గర ఉన్న వాచ్‌మన్ ఉలిక్కిపడ్డాడు. గబగబా పైకి పరిగెట్టాడు. యజమానురాలు బెడ్‌రూము తలుపు లోపల్నుంచి వేసుకున్నట్టుగా ఉంది. గ్లాసు విండోలోంచి చూడబోయాడు. కర్టెన్ కొద్దిగా తొలగి ఉండడంతో మాటలు వినబడకపోయినా, మనుషులు కనబడుతున్నారు. తువ్వాలు సగం సగం చుట్టుకున్న యజమానురాలు అందరినీ చెరిగేస్తోంది. బ్రహ్మాన్ని చూపించి వీడెవడన్నట్టు యజమాని అరుస్తున్నాడు. పనిమనిషిని చూపించి ఇంకేదో అడుగుతోంది యజమానురాలు. అది చేతులు తిప్పుతూ ఇద్దర్నీ ఝాడించేస్తోంది. బ్రహ్మం అందరికీ దండాలు పెడుతున్నాడు. యజమానురాలు అందర్నీ తిట్టేస్తూ గదంతా కలయదిరగడంతో తువ్వాలు కాస్త జారడం, యజమాని దాన్ని సవరించబోవడం, ఆవిడ విదిలించుకొని పనిమనిషిని జబ్బ పట్టుకుని ఊపి పారేసి బ్రహ్మాన్ని తన దగ్గరకు లాక్కోవడం, యజమాని, బ్రహ్మాన్ని ఈడ్చిపారేయడం – ఇవన్నీ గాజు కిటికీలోంచి కనబడుతూండగనే 'వాచ్‌మన్' అన్న యజమాని కేక వినబడడంతో అతను ఉలిక్కిపడ్డాడు.
తలుపు తీసుకొని మాధవరావు బయటకు వచ్చాడు, చేతిలో బ్రహ్మం మెడ ఉంది. 'వీణ్ని రూఫ్ మీద నుంచి కిందికి తోసేయ్' అని అరిచి వాచ్‌మన్ వైపు తోసి రూమ్‌లోకి మళ్లీ వెళ్లాడాయన పోరాటం కొనసాగించడానికి. ఆ మెడను అలాగే పట్టుకొని లాక్కెళ్లాడు వాచ్‌మన్. బ్రహ్మం లబలబ లాడేడు, 'వదిలేయ్, పారిపోతా'నంటూ. 'నిన్ను వదిలేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. తోసేయక తప్పదు' అని ఘీంకరించాడు వాచ్‌మన్.
'మరి మద్దతు ఇస్తానన్నావు కదా' అన్నాడు బ్రహ్మం దీనంగా.
''అది అరగంట క్రితం మాట. ప్రస్తుతం నేను ప్రతిపక్షం'' అంటూనే కిందకు తోసేసాడు వాచ్‌మన్.
బ్రహ్మం అదృష్టం బాగుంది. పడబోతూంటే రూఫ్ పట్టు దొరికింది. దాన్ని పట్టుకొని వేలాడసాగేడు. వాచ్‌మన్ చేతులు దులుపుకొని వెళ్లిపోయాడు – యజమానీ, యజమానురాలూ ఏ స్థాయిలో పోట్లాడుకుంటున్నారో చూడడానికి.
వేలాడుతున్న బ్రహ్మానికి కింద కోటేశ్వర్రావు కనబడ్డాడు గేటుబయట. ''మావగారూ, నేను ఉరికేస్తా. కాస్త పట్టుకోండి'' అని కేక వేసాడు దీనంగా. ''నేను బయట మద్దతు ఇస్తానంటే అదీ వద్దని పోజు కొట్టావు. ఇప్పుడు నేనిచ్చేది ఆరుబయట మద్దతు. అంటే తమాషా చూడడం అన్నమాట'' అన్నాడాయన పళ్లికిలిస్తూ.
బ్రహ్మానికి ఏడుపు వచ్చింది. కన్నీళ్లు వచ్చి కళ్లు పొరలు కమ్మాయి. అంతలో ''బ్రహ్మం'' అనే తీయటి పిలుపు వినబడింది. కిందకు చూడబోయేడు. రాధ మసక మసకగా కనబడింది. ''నువ్వు ఉరికేయ్, నేను పట్టుకుంటా'' అంటోంది. ''కల బావుంది'' అన్నాడు బ్రహ్మం కళ్లు మరింత గట్టిగా మూసుకుంటూ. ''కలకాదు, బ్రహ్మం, మా నాన్నకు వెన్నుపోటు పొడిచి వచ్చేశా, నీ కోసం, నీ తోడు కోసం'' అంది రాధ.
బ్రహ్మానికి ఆనందంతో ఇంకా కన్నీళ్లు ఊరేయి. గద్గద స్వరంతోనే, ''నీ మీద నమ్మకంతో ఉరికేస్తా. మద్దతు ఇస్తావా?'' అన్నాడు 'మద్దతు' అనేమాట అయిష్టంతో పలుకుతూ.
''మద్దతే కాదు, ముద్దులూ ఇస్తా'' అంది రాధ చేతులు వాచి.
మద్దతుదారుల్లో ఇంత ముద్దరాళ్లు ఉంటారని ఊహించలేని బ్రహ్మం కళ్లు తిరిగి పట్టుతప్పి దభాలున కిందకు పడ్డాడు. (ఆంధ్రజ్యోతి ఆదివారం అక్టోబరు 1997)
– ఎమ్బీయస్ ప్రసాద్