రవీంద్ర జడేజా దస్‌ కా ధమాకా.!

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దుమ్ము రేపాడు. అర్థ సెంచరీ చేశాడు.. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం పది వికెట్లు పడగొట్టాడు. టీమిండియాకి ఇన్నింగ్స్‌ విక్టరీని అందించాడు. నిన్నటి కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీతో టీమిండియా…

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దుమ్ము రేపాడు. అర్థ సెంచరీ చేశాడు.. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం పది వికెట్లు పడగొట్టాడు. టీమిండియాకి ఇన్నింగ్స్‌ విక్టరీని అందించాడు. నిన్నటి కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీతో టీమిండియా విజయం దాదాపుగా ఖరారైపోయింది. అయితే, చివరి రోజు.. ఐదో రోజు ఇంగ్లాండ్‌ పోరాడుతుందా.? డ్రా కోసం ప్రయత్నిస్తుందా.? అన్న సందేహాలు ఏదో ఒక మూల భారత క్రికెట్‌ అభిమానుల్లో కన్పించాయి. 

కానీ, టీమిండియా ఛాన్స్‌ ఇవ్వలేదు. ఇంగ్లాండ్‌ ఈ రోజు ఉదయం బ్యాటింగ్‌ ప్రారంభించాక, ఆట ఉత్కంఠ భరితంగానే సాగింది. 100 పరుగుల లోపు ఒక్క వికెట్‌ కూడా టీమిండియాకి దక్కలేదు. ఇంగ్లాండ్‌ 100 పరుగుల స్కోర్‌ బోర్డ్‌ దాటాక, రవీంద్ర జడేజా మ్యాజిక్‌ పనిచేసింది. ముందుగా కుక్‌, ఆ తర్వాత జెన్నింగ్స్‌, ఆ వెంటనే రూట్‌.. ఇలా వరుసగా మూడు వికెట్లు తీశాడు జడేజా. నిజానికి నాలుగో వికెట్‌ కూడా జడేజా ఖాతాలో వేసెయ్యొచ్చేమో. ఎందుకంటే జడేజా అందుకున్న క్యాచ్‌ అలాంటిది. మళ్ళీ ఆ తర్వాతి వికెట్‌ జడేజాదే. దాని తర్వాతా జడేజా ఆగలేదు, మరో వికెట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

మ్యాచ్‌ చివర్లో మళ్ళీ జడేజా మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యింది. బ్రాడ్‌, జేక్‌ బాల్‌ వికెట్లూ జడేజా ఖాతాలో పడ్డాయి. మొత్తంగా ఏడు వికెట్లు.. ఈ ఇన్నింగ్స్‌లో జడేజా వశమయ్యాయి. ఫలితం, టీమిండియా గ్రాండ్‌ విక్టరీ.. ఇన్నింగ్స్‌ విక్టరీ. ఆల్రెడీ సిరీస్‌ని కైవసం చేసుకున్న టీమిండియా, 3-0 లీడ్‌ని, చెన్నయ్‌ టెస్ట్‌ విజయంతో 4-0కి పెంచుకుంది. సిరీస్‌లో తొలి టెస్ట్‌ని డ్రా చేసుకోవడం మినహా, ఈ మొత్తం సిరీస్‌లో ఇంగ్లాండ్‌కి లభించిన ఊరట ఏమీ లేకపోవడం గమనార్హం. 

కొసమెరుపేంటంటే, తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క వికెట్‌ దక్కించుకున్న లోకల్‌ బాయ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ కూడా దక్కించుకోలేకపోయాడు. అయితేనేం, ఈ సిరీస్‌ మొత్తమ్మీద అశ్విన్‌ బౌలింగ్‌ అదరహో.. అన్నది నిర్వివాదాంశం. అన్నట్టు, జడేజా కూడా లోకల్‌ బాయ్‌ కిందే లెక్క. ఎందుకంటే, ఐపీఎల్‌లో చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ తరఫున జడేజా అదరగొట్టేశాడు.. తద్వారా చెన్నయ్‌ క్రికెట్‌ అభిమానులకి లోకల్‌ బాయ్‌ అయిపోయాడు. 

ఏదిఏమైనా, టీమిండియాకి ఇది మరో అద్భుతమైన సిరీస్‌ విజయం. కోహ్లీ సారధ్యంలో వెరీ వెరీ స్పెషల్‌ విక్టరీ ఇది టీమిండియాకి.