సెంచరీతో రోహిత్ శర్మ విరుచుకుపడ్డాడు. కానీ, సొంత గడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పరాజయాన్నే మూటగట్టుకుంది. మూడు టి20ల సిరీస్‌లో ఇప్పటికే ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా, వన్డే సిరీస్‌నీ పరాజయంతోనే ప్రారంభించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 303 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 304 పరుగుల భారీ టార్గెట్‌ని ఛేదించే క్రమంలో టీమిండియా జాగ్రత్తగానే బ్యాటింగ్ ఆరంభించింది. రోహిత్, ధావన్ ఓపెనింగ్ బాగానే కన్పించింది. ధావన్ ఔటయినా, కోహ్లీ చేతులెత్తేసి, రహానేతో కలిసి టీమిండియా స్కోర్ బోర్డ్‌ని రోహిత్ శర్మ పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో రోహిత్ శర్మ 150 పరుగులు సాధించాడు. రోహిత్ ఔటయ్యాక టీమిండియా గెలుపుపై అనుమానాలు పెరిగిపోయాయి. గట్టెక్కిస్తారనుకున్న ధోనీ, రైనా చేతులెత్తేశారు. కాస్సేపు ధోనీ ప్రతిఘటించినా ఫలితం లేకుండాపోయింది. ఐదు పరుగుల తేడాతో టీమిండియా పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది తొలి వన్డేలో.
విశేషమేంటంటే తొలి టీ20లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు.. టీమిండియా ఓడిపోయింది. తొలి వన్డేలో రోహిత్ సెంచరీ కొట్టాడు.. మళ్ళీ టీమిండియా ఓడిపోయింది. ఇది సెంటిమెంట్ అనుకోవాలా.? రోహిత్ తప్ప ఇంకెవరూ జట్టులో 'సెటిల్డ్'గా ఆడటంలేదనుకోవాలా.? రెండోదే కరెక్ట్ కావొచ్చు. ఇప్పటికే టీ20 సిరీస్‌ని కోల్పోవడంతో టీమిండియాపై ఆగ్రహంతో వున్న అభిమానులు, వన్డే సిరీస్‌ని ఓటమితో ప్రారంభించిన టీమిండియాపై మరింతగా గుస్సా అవుతున్నారు.