మనుషులను మత్తులో పడేసే కింగ్‌ఫిషర్ లిక్కర్ బ్రాండ్ ద్వారా ప్రపంచస్థాయి రేంజ్ కి ఎదిగి మనుషులను ఆకాశంలో విహరింపజేసే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దెబ్బకు కుప్పకూలడం ప్రారంభించిన “మాల్యా” సామ్రాజ్యం… రోజు రోజుకూ కష్టాల ఊబిలో కూరుకుపోతోంది.
తాజాగా శనివారం విజయ్‌మాల్యా కార్యాలయాలపై సిబిఐ దాడులు నిర్వహించినట్టు సమాచారం. ఆయన తన ఎయిర్‌లైన్స్ సంస్థ కోసం ఐడిబిఐ బ్యాంకు దగ్గర తీసుకున్న దాదాపు రూ.900 కోట్ల రుణం ఎగవేశారనే అభియోగంపై సిబిఐ కేసు నమోదు చేసుకుని సంబంధిత సమాచారం కోసం ఆకస్మిక దాడులు చేసినట్టు తెలిసింది.
ఇంత పెద్దమొత్తంలో ఇచ్చిన రుణానికి సంబంధించి బ్యాంకు అధికారులు అన్ని నిబంధనలూ తుంగలో తొక్కినట్టు సిబిఐ విచారణలో తేలిందని భోగట్టా. సదరు సంస్థకు అంత క్రెడిట్ లిమిట్ ఇవ్వడం సహేతుకం కాదని బ్యాంకు అంతర్గత విశ్లేషణలో తేలినప్పటికీ, దాన్ని కూడా పట్టించుకోకుండా ఈ రుణ మంజూరు తతంగం చోటు చేసుకోవడంపై బ్యాంకు అధికారుల పాత్రను సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికి మొత్తం 17 బ్యాంకులు కలిపి రూ.7వేల కోట్లు ఈ ఎయిర్‌లైన్స్ సంస్థకు ధారపోసినట్టు తేలింది. దీనిలో అత్యధికంగా ఓకే బ్యాంకు ఇచ్చిన అప్పు రూ.1600 కోట్లట.
ఏదేమైనా… అందమైన అమ్మాయిలను కేలండర్ బొమ్మలుగా చేసి ఆడించిన బడా వ్యాపారవేత్త తాను సాగించిన జల్సాలకు, విలాసాలకు ఇప్పుడు పెద్ద మూల్యమే చెల్లిస్తున్నాడు.