కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన వంతుగా ఆపన్న హస్తం అందించాడు టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ముంబై ఆటగాడు 80 లక్షల రూపాయల విరాళాన్ని అనౌన్స్ చేశాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ విరాళాన్ని ప్రకటించాడు. అయితే కొహ్లీ ఎంత ప్రకటించిందీ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కొహ్లీ, అతడి భార్య అనుష్క కలిసి మూడు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారని వార్తలు మాత్రం వచ్చాయి.
రోహిత్ శర్మ మాత్రం తన విరాళం ఎంతో కూడా ప్రకటించాడు. మొత్తం 80 లక్షల రూపాయల విరాళాన్ని అనౌన్స్ చేశాడు శర్మ. అందులో 45 లక్షల రూపాయల మొత్తాన్ని పీఎం-కేర్ కు ప్రకటించాడు. 25 లక్షల రూపాయల మొత్తాన్ని మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు జోడించాడు. మిగిలిన మొత్తాన్ని వేర్వేరు స్వచ్ఛంద సంస్థలకు అందిస్తున్నట్టుగా ఉన్నాడు రోహిత్ శర్మ.
ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని కరోనా లాక్ డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్న వారి కోసం వెచ్చించాడు ఈ క్రికెటర్. వారికి ఆహారాన్ని అందించేందుకు పని చేస్తున్న సంస్థలకు శర్మ ఈ డబ్బును ఇస్తున్నట్టుగా ఉన్నాడు. మరో ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని వీధి కుక్కలకు ఆహారాన్ని అందించేందుకు వెచ్చిస్తున్నాడు. బహుశా ఇలాంటి పనిలో నిమగ్నం అయిన స్వచ్ఛంద సంస్థలకు శర్మ ఈ డబ్బును డొనేట్ చేసి ఉండవచ్చు. మొత్తంగా ఇతడి దాతృత్వం 80 లక్షల రూపాయలు. అభినందనీయమైన మొత్తం ఇది.