విదేశాల్లో సరిగ్గా ఆడలేడు అన్నారు.. వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ వేదికగా తన సత్తా ఏమిటో చూపించాడు! టెస్టు క్రికెట్ కు సెట్ కాడని చాన్నాళ్ల పాటు పక్క పెట్టారు..ఏకంగా ఇప్పుడు మరో కొత్త రికార్డును సృష్టించాడు. పన్నెండేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు అసలు సిసలు సత్తా చూపిస్తూ ఉన్నాడు. అరుదైన రికార్డులను సాధిస్తూ సాగుతున్నాడు.
వైజాగ్ టెస్ట్ లో సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్ లో నూ రోహిత్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాది తన ఊపును చూపించాడు. ఒకవైపు అవసరానికి తగ్గట్టుగా వేగంగా ఆడుతూనే.. మరోవైపు జట్టుకు కీలకమైన సమయంలో సెంచరీతో తన సహకారం అందించాడు రోహిత్. తద్వారా క్రికెటర్ గా మరో మెట్టు ఎక్కాడు.
రోహిత్ సెంచరీతో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కీలకమైన ఆధిక్యాన్ని సంపాదించింది. ఆట చివరి రోజు ఆదివారం మిగిలి ఉంది. వర్షం అంతరాయం కల్పించకపోతే.. టీమిండియాకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా గట్టిగా పోరాడితే డ్రా చేసుకోగలదు. అయితే భారత బౌలర్లు ఆ అవకాశం ఇస్తారా..అనేది ఆసక్తిదాయకమైన అంశం.