ఫిరోజ్ షా కోట్ల టెస్టు ను ఎలాగైనా డ్రా చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది దక్షిణాఫ్రికా. ఇప్పటికే టెస్టు సీరిస్ లో ఇండియా 2-0తో లీడ్ లో ఉండగా.. చివరిదైన నాలుగో టెస్టు నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా చాలా పాట్లనే పడుతోంది. భారీ లక్ష్యంతో ముందుండగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రి ఆ స్కోరు గురించి చేజింగ్ ఆలోచనే లేనట్టుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది. నాలుగు రోజు కావాల్సినన్ని ఓవర్లు.. ఐదో రోజు ఆట చేతిలో ఉన్నా సౌతాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్ ను డ్రా లక్ష్యంతోనే మొదలుపెట్టింది.
అయితే డ్రా చేసుకోవడం కూడా అంత వీజీగా అయితే కనపడటం లేదు. రెండో ఇన్నింగ్స్ లో అరవై ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా రెండు వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజ్ లో హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ జిడ్డుతనానికి పరాకాష్టలా సాగుతోంది. ప్రత్యేకించి కెప్టెన్ హషీమ్ ఆమ్లా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు! తను ఎదుర్కొన్నతొలి వంద బంతుల్లో ఈ బ్యాట్స్ మన్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడంటే… మ్యాచ్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా జిడ్డుతనానికి మరిన్ని గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 61 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా చేసిన మొత్తం పరుగులు 61. రన్ రేటు కేవలం 1 మీద నడుస్తోంది! ఈ సమయానికి ఆమ్లా 175 బంతులను ఎదుర్కొని కేవలం ఇరవై పరుగులు చేయగా.. వర్తమాన క్రికెట్ లో దూకుడైన ఆటతీరుకు నిదర్శనంగా చెప్పబడే డివిలియర్స్ 57 బంతులకు గానూ కేవలం మూడంటే మూడే పరుగులే చేశాడు! ఎటు తిరిగీ డ్రా చేసి ఆ ఆనందాన్ని అయినా పొందాలనేది దక్షిణాప్రికా బ్యాట్స్ మన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
అంతకు ముందు భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. రహనే రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్ లో 127 పరుగులు చేసిన ఈ బ్యాట్స్ మన్ రెండో ఇన్నింగ్స్ లో వంద పరుగులతో నాటౌట్ గా నిలిచి… పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం అన్న సందేశాన్ని తన ప్రత్యర్థి ఆటగాళ్లకు ఇచ్చాడు. ఇంతకు ముందు మ్యాచ్ లలో ఇండియా గెలిస్తే.. అనుకూలమైన పిచ్ లను తయారు చేసి గెలిచారనే ముద్రను వేయడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికా ఆటతీరును చూసి.. అలాంటి వాళ్లందరి నోళ్లూ మూతబడుతున్నాయి.