72 ఓవర్లు.. 72 పరుగులు. జిడ్డుకి పరాకాష్ట

టెస్టుల్లో ఎన్నెన్నో విడ్డూరాలు చోటు చేసుకుంటుంటాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఎట్టి పరిస్తితుల్లోనూ 'డ్రా' చేసుకోవాలనే కసితో కనిపిస్తోంది. విచిత్రంగా టీమిండియాలో గెలుపు 'కాంక్ష' తక్కువ…

టెస్టుల్లో ఎన్నెన్నో విడ్డూరాలు చోటు చేసుకుంటుంటాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఎట్టి పరిస్తితుల్లోనూ 'డ్రా' చేసుకోవాలనే కసితో కనిపిస్తోంది. విచిత్రంగా టీమిండియాలో గెలుపు 'కాంక్ష' తక్కువ వుందేమో అనిపిస్తోంది. సౌతాఫ్రికాని ఫాలో ఆన్‌ ఆడించి వుంటే మ్యాచ్‌ ఫలితం బహుశా నిన్ననే తేలిపోయి వుండేదేమో.! 

ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా కనీసంరోజులపాటు జరగలేదన్న ఆవేదన నేపథ్యంలోనే ఐదు రోజుల మ్యాచ్‌ని ఐదు రోజులు ఆడించెయ్యాలని టీమిండియా భావించినట్టుంది. ఎలాగైతేనేం, 481 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా, సౌతాఫ్రికా ముందుంచింది. దాదాపు రెండ్రోజుల మ్యాచ్‌ మిగిలి వున్న నేపథ్యంలో టీమిండియా కాస్తో కూస్తో పోరాడేందుకు ప్రయత్నించాలి. కానీ, సౌతాఫ్రికా ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. 200 పరుగులు చేయడం సౌతాఫ్రికాకి గగనమైపోతోంది. అందుకేనేమో, ఆచి తూచి ఆడుతోంది. 

ఆచి తూచి ఆడటమంటే, పది ఓవర్లలో ఇరవై పరుగులో, ఇరవై ఐదు పరుగులో చేస్తుందనుకోవచ్చు. పోనీ, 15 పరుగులు అయినా చెయ్యాలి. కానీ, సౌతాఫ్రికా మరీ నత్తను తలపిస్తోంది. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తోంది. 72 ఓవర్లలో కేవలం 72 పరుగులతో సరిపెట్టింది సౌతాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి. ఈ క్రమంలో రెండు వికెట్లు కూడా కోల్పోయింది. 

హషీమ్‌ ఆమ్లా ఎలాగూ జిడ్డు ప్లేయర్‌.. క్రీజ్‌లో పాతుకుపోయాడంటే బౌలర్ల సంగతి అంతే. జబ్బలు పడిపోయేలా బౌలింగ్‌ చెయ్యాల్సిందే. ఈ సిరీస్‌లో వరుసగా ఫెయిలయిన హషీమ్‌ ఆమ్లా, ఈసారి ఎలాగైనా అర్థ సెంచరీ కొడదామనుకుంటున్నట్టున్నాడు. అందుకే బంతిని అస్సలు టచ్‌ చేస్తే ఒట్టు.. అన్నట్టుగా వ్యవహరించాడు. 207 బంతుల్ని ఎదుర్కొని 27 పరుగులే ఆమ్లా చేశాడంటే, అతను ఏ స్థాయిలో జిడ్డు ఆడేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. 

ఇంకా విచిత్రమైన విషయమేంటంటే, డైనమైట్‌లా ప్రత్యర్థులపై విరుచుకుపడే డివిలియర్స్‌ 91 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేయడం. పరిస్థితిని చూస్తోంటే మ్యాచ్‌ డ్రా అయ్యేలా కనిపిస్తోంది. దానికి తగ్గట్టే టీమిండియా బౌలింగ్‌, సౌతాఫ్రికా బ్యాటింగ్‌ కనిపిస్తున్నాయి మరి.