షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ని 'ఫిక్సింగ్‌' కుంభకోణం ఓ కుదుపు కుదిపేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తాజాగా చెన్నయ్‌, రాజస్తాన్‌ జట్లపై వేటు పడటంతో ఐపీఎల్‌ భవిష్యత్తుపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అనుమానాలకు చెక్‌పెడుతూ…

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ని 'ఫిక్సింగ్‌' కుంభకోణం ఓ కుదుపు కుదిపేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తాజాగా చెన్నయ్‌, రాజస్తాన్‌ జట్లపై వేటు పడటంతో ఐపీఎల్‌ భవిష్యత్తుపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అనుమానాలకు చెక్‌పెడుతూ ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా, షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ తాజా సీజన్‌ నడుస్తుందని వెల్లడించారు. 

ఈసారి ఐపీఎల్‌ పోటీల్లో ఐదు జట్లు బరిలోకి దిగుతాయని రాజీవ్‌ శుక్లా ప్రకటించడం గమనార్హం. చెన్నయ్‌, రాజస్తాన్‌లకు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో, ఖచ్చితంగా కొత్త జట్లు రంగంలోకి దిగాల్సిందే. అయితే ఆ కొత్త జట్లు ఏవి.? అన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాజీవ్‌ శుక్లా చెప్పగా, కొత్త జట్లతోపాటు, ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న జట్లలోని ఆటగాళ్ళ భవితవ్యంపైనా భిన్న కథనాలు, ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. 

ఇదిలా వుంటే, ఐపీఎల్‌ కుంభకోణంపై విచారణ జరుగుతోందనీ, కొంతమంది అక్రమార్కుల వల్ల ఐపీఎల్‌ అభాసుపాలవుతున్న మాట వాస్తవమే అయినా, క్రికెట్‌ అభిమానులకు పసందైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వడంతోపాటు, జాతీయ జట్టుకి మెరికల్లాంటి యువ ఆటగాళ్ళను తీసుకొచ్చే గొప్ప ఆలోచనతో ఐపీఎల్‌ని తీర్చిదిద్దిన దరిమిలా ఆ లక్ష్యం నుంచి పక్కకు వెళ్ళబోమని ఐపీఎల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. 

మరోపక్క, బీసీసీఐ పెద్దలు ఐపీఎల్‌ విషయమై ప్రతి ప్రకటననూ ఆచి తూచి విడుదల చేస్తున్నారు. మీడియాతో మాట్లాడేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఏదిఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో విచ్చలవిడిగా డబ్బుని ఐపీఎల్‌లోకి తీసుకురావడం, ఐపీఎల్‌ ద్వారా వెదజల్లడం.. ఇవన్నీ జెంటిల్‌మెన్‌ గేమ్‌ క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ని పలచన చేస్తున్నాయన్నది నిష్టురసత్యం.