ఇండియాలో క్రికెట్ కున్న క్రేజ్ గురించి, క్రికెటర్లకు వచ్చి పడే డబ్బు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ వచ్చాకా.. క్రికెటర్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు ఎలా అయిపోతున్నారో ప్రపంచమంతా చూస్తోంది. కేవలం ఐపీఎల్ మాత్రమేగాక భారత క్రికెటర్లకు భారీస్థాయిలో ఎండార్స్ మెంట్ డీల్స్ కూడా ఉంటాయని అందరికీ తెలుసు. ఇండియాలో క్రేజున్న క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక డబ్బును సంపాదిస్తున్న అథ్లెట్స్‌గా నిలుస్తున్నారని కూడా జగమెరిగినదే.
ఇలాంటి నేఫథ్యంలో తాజాగా బీసీసీఐ భారత క్రికెటర్లకు చెల్లిస్తున్న జీతభత్యాల వివరాలను ప్రకటించింది. కొన్నినెలల కిందట టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన జీతాలను, నెల జీతాలను, రాబోయే పర్యటనలకు సంబంధించి అడ్వాన్స్ పేమెంట్స్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. పారదర్శకత కోసం ఎవరికి ఎంత చెల్లిస్తున్న వివరాలను కూడా బోర్డు ప్రకటించింది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి… భారీ మొత్తం పొందుతున్నది ఎవరోకాదు.. కోచ్ రవిశాస్త్రి. మూడు నెలల జీతభత్యాల కింద శాస్త్రి రెండుకోట్ల రూపాయల మొత్తాన్ని జీతాన్ని తీసుకుంటున్నాడు. ప్రతి మూడు నెలలకూ ఒకసారి శాస్త్రికి ఇంత జీతం అందుతోంది. ఇక దక్షిణాఫ్రికా పర్యటన మ్యాచ్ ఫీజ్ కింద కెప్టెన్ కొహ్లీకి 1,25,04,964 చెల్లించినట్టుగా బోర్డు ప్రకటించింది. ఈ మొత్తంలోనే కొహ్లీకి దక్కిన ఇతర ప్రైజ్ మనీ మొత్తం కూడా ఉంది.
60,80,725 ఇది ఒక్క దక్షిణాఫ్రికాలో సీరిస్ ఆడినందుకు గానూ చతేశ్వర్ పుజారాకు బీసీసీఐ చెల్లిస్తున్న మొత్తం. ఒక్క సీరిస్ మొత్తమే అది. ఇక ఐసీసీ నుంచి అందిన ప్రైజ్ మనీ 29,27,700, బోర్డుతో ఒప్పందంలో భాగంగా మూడునెలల శాలరీగా ఈ క్రికెటర్‌కు అందుతున్న మొత్తం 1,01,25,000..టెస్టులు మాత్రమే ఆడే పూజారాకు ఇలా మొత్తం అన్నీ కలుపుకుంటే ఏడాదికి రెండుకోట్ల రూపాయలపై మొత్తమే ఉంది.
మిగతా క్రికెటర్లందరి జీత భత్యాలూ ఇలా కళ్లుచెదిరే స్థాయిలోనే ఉన్నాయి. ఒక్క దక్షిణాఫ్రికాకు వెళ్లి టెస్టు మ్యాచ్‌లు ఆడి వచ్చినందుకు గానూ ఒక్కోరికి మ్యాచ్ ఫీజులే 50 లక్షల రూపాయల వరకూ ఉన్నాయి. ఇక ఐసీసీ టెస్టు ర్యాంక్సింగ్‌లో టీమిండియాను మంచి స్థానంలో నిలిపినందుకు వచ్చిన ప్రైజ్ మనీ ఒక్కోరికి ఇరవై లక్షల రూపాయల పై స్థాయిలోనే ఉంది.
ఇక ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ చెల్లింపులు ఒక్కొక్కరికి కోటి రూపాయల చిల్లర వరకూ ఉన్నాయి. ఇక వన్డేలు, టీ20 ఆడిన వాళ్లకు అదనపు మొత్తాలు. స్థూలంగా బీసీసీఐ తాజాగా ప్రకటించిన మొత్తాలతోనే ప్రస్తుతం టీమిండియాలో రొటేట్ అవుతున్న దాదాపు 20 మంది క్రికెటర్లు కోటీశ్వరులు అయ్యారు.
ఆరునెలల జీతాలతోనే ఇలా కోటీశ్వరులు అయ్యారంటే.. టీమిండియాకు ఆడుతున్న క్రికెటర్ల ఆర్థిక శక్తి ఏమిటో అంచనా వేసుకోవచ్చు!