ఈ టీమ్ ప్రపంచకప్ ను పట్టేస్తుందా!

ధోనీసేన ప్రపంచకప్ ను నెగ్గి  దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. సొంత గడ్డ మీద ప్రపంచకప్ ను నెగ్గింది టీమిండియా. ఆ తర్వాత ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ లలో జరిగిన ప్రపంచకప్ లో మనోళ్లు ఫర్వాలేదనిపించారు కానీ..…

ధోనీసేన ప్రపంచకప్ ను నెగ్గి  దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. సొంత గడ్డ మీద ప్రపంచకప్ ను నెగ్గింది టీమిండియా. ఆ తర్వాత ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ లలో జరిగిన ప్రపంచకప్ లో మనోళ్లు ఫర్వాలేదనిపించారు కానీ.. సెమిఫైనల్ వరకూ వెళ్లి వెనక్కు వచ్చేశారు. ఇక ఈసారి ఇంగ్లండ్- వేల్స్ వేదికగా ప్రపంచకప్ కు జట్టు ఎంపిక కూడా పూర్తి అయ్యింది. ఇరవై సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ లో ప్రపంచకప్  జరుగుతూ ఉండటం విశేషం. 1999లో ఇంగ్లండ్ లో చివరిసారి ప్రపంచకప్ జరిగింది. అప్పట్లో టీమిండియా అజరుద్ధీన్ కెప్టెన్సీలో వెళ్లింది. సూపర్ సిక్స్ వరకూ వెళ్లింది కానీ.. అదేమీ అంత మెరుగైన ప్రదర్శన అనిపించుకోలేదు.

ఈసారి విరాట్ కొహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ లో పాల్గొంటోంది. పేపర్ మీద చూస్తే టీమిండియాలో మంచి సమన్వయం కనిపిస్తూ ఉంది. ఫామ్ తో నిమిత్తం లేకుండా చాలా సహజంగానే అద్భుతంగా ఆడే కొహ్లీకి ఒక్కడు చాలు మ్యాచ్ ల ఫలితాలు తారుమారు చేయడానికి. అయితే ఎంతసేపూ కొహ్లీ మీదే ఆధారపడటం టీమిండియాకు మైనస్ పాయింట్. అయితే  ఇంగ్లండ్ వేదికగా ఈ జట్లు పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో పలు విజయాలను నమోదు చేసిన ఘనతను కలిగి ఉంది. కొన్నేళ్ల కిందట అక్కడే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. 

ధావన్, రోహిత్ శర్మ వంటి బ్యాట్స్ మన్ ఇది వరకూ ఇంగ్లండ్ పిచ్ ల మీద బాగానే రాణించారు. వారు ఆ ఫామ్ ను కనబరిస్తే విజయం సునాయాసమే అవుతుంది. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా బలోపేతంగా కనిపిస్తూ ఉంది. బుమ్రా, షమీలు మంచి ఫామ్ లో ఉన్నారు. భువనేశ్వర్ కొన్నాళ్లుగా గ్రిప్ కోల్పోయాడు. దాన్ని తిరిగి రాబట్టుకోవాలతను.

ఇక మ్యాచ్ విన్నర్లు ఆల్ రౌండర్లే. ఆ విషయంలో కూడా టీమిండియా పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. స్టార్ ఆల్ రౌండర్ అంటే హార్ధిక్ పాండ్యానే. విజయ్ శంకర్ ఉన్నప్పటికీ.. అతడు ఇంకా బౌలింగ్ లో పరిణతి సాధించాల్సి ఉంది. ధారాళంగా పరుగులు ఇచ్చే తీరును మార్చుకోవాల్సి ఉంది. రవీంద్ర జడేజా రూపంలో స్పిన్ ఆల్ రౌండర్ ఉన్నాడు. ఇక పార్ట్ టైమ్ బౌలింగ్ విషయంలో కేదార్ జాదవ్ కొన్నాళ్లుగా నమ్మకంగా కనిపిస్తున్నాడు.

ఇతడు టీమిండియాకు లక్కీ సైన్. ఇతడు ఆడిన చాలా మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్ విషయంలో సత్తా చూపగలడు. ఐదారు ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడు. ఒక్కోసారి పది ఓవర్ల కోటానూ పూర్తి చేయగలడు. కాబట్టి జాదవ్ టీమ్ అదనపు ఆస్తి.

ధోనీ రూపంలో అనుభవం ఉండనే ఉంది. ఇది కొహ్లీకి చాలా ఉపయోగపడనుంది. దినేష్ కార్తిక్, కేఎల్ రాహుల్ లకు ఎంత మేరకు అవకాశాలు లభిస్తాయో చూడాల్సి ఉంది. వీరు ఫైనల్ లెవెన్ లో ఉంటారా.. అనేది మ్యాచ్ ల ఆరంభంలో కానీ తెలియదు. చాహల్, కుల్దీప్ లు స్పిన్ విభాగంలో ఉన్నారు. వీరిలో ఒకరికి ఫైనల్ లెవెన్లో చోటు తప్పకుండా ఉండవచ్చు.

టీమిండియా చరిత్రలో ఇంతవరకూ రెండు వన్డే వరల్డ్ కప్ లను సాధించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా మరోసారి ప్రపంచకప్ ను నెగ్గడం అంత కష్టమూ కాదు, అంత సులభమూ కాదు. ఈ ఆటగాళ్లంతా తమ తమ స్థాయి మేరకు రాణించినా.. మూడో ప్రపంచకప్ భారత్ వశమైనట్టే!

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది