స్థలం కోసం ‘మా’ డబ్బులతో తాయిలం?

సినిమా నటీనటుల మా అసోసియేషన్ వ్యవహారాలు ఇక ఎంతమాత్రం గుట్టుగా వుండవు. ఎందుకంటే పైకి ఎన్నికబుర్లు చెప్పినా, మా అసోసియేషన్  ప్రస్తుతానికి రెండుగా చీలిపోయినట్లే. గత అసోసియేషన్ తన చిత్తానికి తాను చేసింది. ఎవరికి…

సినిమా నటీనటుల మా అసోసియేషన్ వ్యవహారాలు ఇక ఎంతమాత్రం గుట్టుగా వుండవు. ఎందుకంటే పైకి ఎన్నికబుర్లు చెప్పినా, మా అసోసియేషన్  ప్రస్తుతానికి రెండుగా చీలిపోయినట్లే. గత అసోసియేషన్ తన చిత్తానికి తాను చేసింది. ఎవరికి పడితే వారికి సభ్యత్వం తన చిత్తానికి కట్టబెట్టింది అన్న ఆరోపణలు వున్నాయి. ఇప్పుడు కొత్త సంఘం వచ్చింది. దీని పని ఇది మొదలుపెట్టింది. దాంతో పాత సంఘం ఈ కన్నాలు వెదికిమరీ వెలికితీస్తోంది.

లేటెస్ట్ గా మా సంఘ సభ్యుల కోసం మాత్రమే ఖర్చు చేయాల్సిన ఏడులక్షల పైచిలుకు మొత్తం జీవిత రాజశేఖర్ కుమార్తె ఖాతాలోకి వెళ్లిపోయాయని వార్తలు గుప్పుమన్నాయి. ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఆరాతీస్తే వ్యవహారం ఇలా వుంది.

మా సంఘ భవనం కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని స్థలం అడగాలని అనుకున్నారు. అయితే అందుకు ముందుగా ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలనే ఐడియా మా సంఘానికి కొందరు తెరాస పార్టీ ప్రతినిధుల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వ పథకాలను పొగుడుతూ కొన్ని ప్రకటనలు చేయించి, కానుకగా ఇద్దాం అనే ఆలోచన చేసారు. ఇందుకు ఏడున్నర లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఖర్చును ముందుగా జీవిత రాజశేఖర్ కుమార్తె భరించి, ప్రకటనలు చేయించినట్లు బోగట్టా. అందువల్ల ఆ డబ్బును మా నిధుల నుంచి ఆమె అక్కౌంట్ లో వేసారని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే రభసగా మారబోతోందని తెలుస్తోంది. మా సంఘ నిధులు సభ్యుల సంక్షేమానికి ఖర్చుచేయాలి కానీ, ఇలా వేరే పనులకు వాడడం ఏమిటి? అన్నిది ఒక పాయింట్ ఆఫ్ ఆర్టర్. 

ప్రకటనలు నేరుగా చేయించకుండా, వేరేవాళ్లతో చేయించడం, వేరేవాళ్లు నగదు చెల్లించడం, ఇప్పుడు వాళ్లకి నిధులు మళ్లించడం ఏమిటి అని మరో అభ్యంతరం. వెరసి మొత్తంమీద మా సంఘ వ్యవహారాలు ఇప్పట్లో సమసిపోయేలా, గుట్టుగా వుండేలా లేవు. తరచు రచ్చకు ఎక్కేలాగే వున్నాయి.

అయినా ఇన్ని పెద్ద కబుర్లు చెబుతారు. సినిమా పెద్దోళ్లందరికీ  వందలాది ఎకరాలు వున్నాయి. ఎక్కడో ఒ చోట ఓ పది సెంట్ల భూమి ఇవ్వలేరా? ప్రభుత్వమే ఇవ్వాలా?

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది