టీమిండియాకు క్రికెట్ ప్రపంచకప్ లో సెమిస్ బెర్త్ ఖాయమైంది. మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే సెమిస్ బెర్త్ ను అధికారికంగా ఖరారు చేసుకుంది భారత క్రికెట్ జట్టు. ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో టీమిండియాకు సెమిస్ బెర్త్ ఖరారు అయినట్టే. తద్వారా వరసగా మూడో ప్రపంచకప్ లో సెమిస్ లోకి అడుగుపెట్టింది భారత జట్టు.
మరోసారి ప్రపంచకప్ విజేతగా నిలిచేందుకు కేవలం రెండు అడుగుల దూరంలోనే ఉంది టీమిండియా. ఈ క్రమంలో ఇండియాకు సెమిస్ లో ప్రత్యర్థి ఎవరు అవుతారనేది ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటి వరకూ సెమిస్ లో స్థానం సంపాదించిన జట్లు రెండే. ఆస్ట్రేలియా, ఇండియాలు సెమిస్ కు చేరాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఆ రెండు జట్లూ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ ఆడబోతూ ఉన్నాయి. అదే వాటికి చివరి లీగ్ మ్యాచ్.
ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకుంటుంది. ఓడిన జట్టుకూ ఇంకా అవకాశాలు మిగిలే ఉంటాయి. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే.. హ్యాపీగా అది సెమిస్ లో స్థానం సంపాదించుకుంటుంది. అలా జరిగితే.. ఇంగ్లండ్ కు అవకాశాలు తక్కువే ఉంటాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం మీద ఇంగ్లండ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఆ మ్యాచ్ లో బంగ్లా గెలిస్తే ఇంగ్లండ్ సెమిస్ చేరుతుంది. పాక్ గెలిస్తే ఆ జట్టుకు అవకాశాలుంటాయి. ఒకవేళ తదుపరి మ్యాచ్ లో ఇంగ్లండ్ నెగ్గితే ఆ జట్టుకు సెమిస్ బెర్త్ గ్యారెంటీ. న్యూజిలాండ్ కూ అవకాశాలుంటాయి. పాక్, బంగ్లా మ్యాచ్ లో పాక్ గెలిచినా… పాయింట్ల వారీగా న్యూజిలాండ్ తో సమానం అవుతుంది.
అయితే రన్ రేట్ రీత్యా న్యూజిలాండ్ కు అవకాశం ఉంటుంది. పాక్, బంగ్లా మ్యాచ్ లో పాక్ ఓడిపోతే.. మరే టెన్షన్ లేకుండా న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమిస్ కు చేరవచ్చు. పాయింట్ల పట్టికలో ఈ జట్ల స్థానాల వారీగా సెమిస్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. పాయింట్ల టేబుల్ లో నంబర్ 1 జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో సెమిస్ ఆడుతుంది, రెండు, మూడు స్థానాల్లోని జట్లు మరో సెమిస్ ఆడతాయి.