గత పదేళ్లలో అత్యంత విజయవంతమైన టెస్టు జట్టుగా టీమిండియా నిలుస్తూ ఉంది. స్వదేశంలో టీమిండియాకు తిరుగేలేదు. అలాగే విదేశాల్లో కూడా టెస్టుల్లో కొన్ని విజయాలను సాధించింది టీమిండియా. గత పదేళ్లలో మరే జట్టూ సాధించని స్థాయిలో టెస్టుల్లో విజయాలను సాధించింది భారత క్రికెట్ జట్టు. అలాగే చాలా కాలంగా టెస్టుల్లో నంబర్ వన్ ప్లేస్ ను భారత జట్టే పదిల పరుచుకుంది!
ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో సాధించిన విజయంతో టీమిండియా మరో ఘనతను సొంతం చేసుకుంది. పింక్ బాల్ తో తను ఆడిన తొలి టెస్టులోనే టీమిండియా విజయం సాధించింది. అది కూడా ఇన్నింగ్స్ తేడాతో. బంగ్లాను ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది.
విశేషం ఏమిటంటే.. ఇండియాకు ఇది వరసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం! ఇంత వరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కూడా వరసగా నాలుగు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని సాధించలేదు! ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం అంటే ఏమిటో క్రికెట్ ఫ్యాన్స్ కు వేరే వివరించనక్కర్లేదు.
సౌతాఫ్రికాతో చివరి రెండు టెస్టులనూ ఇండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. పుణే టెస్టును ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఇండియా నెగ్గింది. రాంచీ టెస్టును ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో సొంతం చేసుకుంది. బంగ్లాతో తొలి టెస్టును ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఇండియా నెగ్గింది.
ఇలా వరసగా ఇన్నింగ్స్ విజయాలతో కొత్త రికార్డును సృష్టించింది. టీమిండియా ఒక్క ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసి సాధించిన స్కోర్లను ప్రత్యర్థి జట్లు రెండు ఇన్నింగ్స్ లు ఆడి కూడా సాధించలేకపోవడం గమనార్హం. ఇది అరుదైన టెస్ట్ క్రికెట్ ఫీట్ గా నిలుస్తోంది.