పసికూన చేతిలో మరో పరాజయం తప్పదేమో అనుకున్నారు భారత క్రికెట్ అభిమానులు.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ముగిశాక. జింబాబ్వే మీద టీమిండియా 255 పరుగులతో సరిపెట్టడమా.? అంబటి రాయుడు ఆదుకున్నాడుగానీ, లేదంటే 150 లోపలే టీమిండియా దుకాణం సర్దేసేదే. ఎలాగైతేనేం.. ఆపద్బాంధవుడిలా అంబటిరాయుడు టీమిండియాని గటెక్కించాడు.
255 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తొలుత తడబడినా ఆ తర్వాత పుంజుకుంది. అలా ఇలా కాదు, చివరి ఓవర్‌లో తేడా కొట్టిందిగానీ లేదంటే జింబాబ్వే, టీమిండియాకి పంజా దెబ్బ రుచి చూపించేదే. బంగ్లాదేశ్ టూర్‌లో దెబ్బతిన్న టీమిండియా ఎలాగైతేనేం.. తృటిలో పెను ప్రమాదం తప్పించుకుంది.
సీనియర్లెవరూ జట్టులో లేకపోవడంతో, కుర్రాళ్ళు తడబడ్డారు. అయితేనేం అంబటిరాయుడు మెరిశాడు. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ అదరగొట్టాడు. అలాగని సరిపెట్టుకోడానికి లేదు. సీనియర్లు జట్టుకు వివిధ కారణాలతో దూరమవుతున్న దరిమిలా, కుర్రాళ్ళే టీమిండియాని భుజాన మోయాల్సి వుంటుంది. అజింక్య రెహానే ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా సరికొత్త పాత్రలో ఒదిగిపోయాడు. ఓపెనింగ్‌కి దిగాడు. అయితే జట్టును నడిపించాల్సిన కెప్టెన్ ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో వచ్చి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు మాజీ క్రికెటర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏదిఏమైనా.. టీమిండియా బొక్కబోర్లా పడబోయి కోలుకుంది జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇది జస్ట్ గెలుపు అంతే.