ఇండియా టూర్లో పరుగులైతే సాధిస్తున్నాడుగానీ, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ వివాదాల్లోంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాడు. మైదానంలో ఓవరాక్షన్‌కి 'స్లెడ్జింగ్' అని పేరు పెట్టేసి.. ఓవరాక్షన్ కొనసాగిస్తున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇప్పటికే డీఆర్ఎస్ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయి, ఎలాగో ఆ వివాదం నుంచి బయటపడ్డాడు. కెప్టెన్ కోహ్లీ పెద్ద మనసు చేసుకోవడం, బీసీసీఐ క్షమించేయడంతో స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ వివాదం నుంచి తప్పించుకున్నాడుగానీ, లేదంటే పరిస్థితి ఇంకోలా వుండేది.
తాజాగా స్మిత్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. టీమిండియా ఆటగాడు విజయ్‌ని ఉద్దేశించి, అనకూడని మాటలు అన్నాడట స్టీవ్ స్మిత్. అది కూడా ఆస్ట్రేలియా మీడియా తెరపైకి తెచ్చిన అంశం. ఈ రోజు (సోమవారం మార్చి 27) ధర్మశాలలో జరుగుతున్న టెస్ట్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 137 పరుగులకే ముగిసింది. అయితే, చివరి వికెట్ నాటకీయ పరిణామాల మధ్య పడింది. విజయ్ క్యాచ్‌ని అందుకోవడంతో మ్యాచ్ ముగిసిందనుకున్నారంతా. కానీ, రీప్లేలో అది నాటౌట్ అని తేలింది. ఇక్కడే స్మిత్‌కి ఒళ్ళు మండిపోయింది. డ్రెస్సింగ్ రూమ్‌లోంచే విజయ్‌పై తిట్ల దండకం అందుకున్నాడు. అది కాస్తా వీడియోకి చిక్కంది. వాయిస్ రికార్డ్ అవలేదుగానీ, లిప్ మూమెంట్ ద్వారా అతనేమన్నాడనేది అందరికీ అర్థమయిపోయింది.
అయితే, ఆటలో ఇవన్నీ మామూలేననీ వ్యక్తిగతంగా విజయ్‌ని స్మిత్ దూషించలేదనీ, ఆ సమయంలో భావోద్వేగాలు వుంటాయని ఆసీస్ మీడియా ఆ తర్వాత కవరింగ్ చేసేసింది. మ్యాచ్ చేజారిపోతుందన్న 'బాధ' స్మిత్‌ని వెంటాడుతుండడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, క్రికెట్లో క్రీడా స్ఫూర్తిని పూర్తిగా చెరిపేసిన వ్యక్తిగా స్మిత్ వార్తల్లోకెక్కుతుండడమే విశేషమిక్కడ.