తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, ప్రముఖ తమిళ హీరో ధనుష్ మీద నమోదైన కేసు విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ రోజే ఈ కేసులో తీర్పు వచ్చేస్తుందనుకుంటే, ధనుష్ తరఫు లాయర్, 'కాస్త సమయం కావాలి..' అని కోరడంతో, ఏప్రిల్ 11 వరకు కేసు విచారణ వాయిదాపడింది. ఇంకేముంది, షరామామూలుగానే ఈ కేసులో ఉత్కంఠ మరింత పెరిగింది.
ధనుష్ శరీరంపై పుట్టుమచ్చలు 'లేజర్ పద్ధతిలో' మాయం చేశారని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇవ్వడంతో, ఆయన తమ బిడ్డేనని చెబుతోన్న కదిరీశన్, మీనాక్షి దంపతుల వాదనే నిజమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ధనుష్ తమ కొడుకే అనడానికి కదిరీశన్ దంపతులు పూర్తిస్థాయిలో ఆధారాల్ని కోర్టుముందుంచారు. వారి వాదనలకు తగ్గట్టుగానే, విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
మరోపక్క, ధనుష్ తన కొడుకేనని గతంలో గట్టిగా వాదించిన ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరిరాజా ఇప్పుడు సైలెంటయిపోయారు. డీఎన్‌ఏ పరీక్ష జరిగితే తప్ప ఈ కేసులో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కన్పించడంలేదు. ఆ డీఎన్‌ఏ పరీక్ష విషయంలో ధనుష్ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేకపోయినా, కోర్టు ఒక్కసారి ఆదేశించిందంటే ఇక అంతే సంగతులు. ఆ డీఎన్‌ఏ పరీక్షపైనే నేడు క్లారిటీ వస్తుందని అంతా ఆశించారు.
ఇదిలా వుంటే, ధనుష్ – కస్తూరిరాజా తనయుడు కాదా.? అన్న విషయమై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పైకి మాత్రం ఎవ్వరూ సూపర్ స్టార్ అల్లుడి వ్యవహారంపై నోరు మెదపడంలేదు. తమిళ సినీ రంగంలో 'స్టార్ స్టేటస్' సంపాదించుకున్న ధనుష్, ఈ వివాదంలో పీకల్లోతు కూరుకుపోవడం, పైగా ఆధారాలు ఆయనకు వ్యతిరేకంగా కన్పిస్తుండడం విశేషమే మరి. ఓ సినీ ప్రముఖుడికి సంబంధించిన కేసు.. ఇంతదాకా రావడం బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి అనుకోవాలేమో.!