విండీస్‌కి చుక్కలు కన్పిస్తున్నాయ్‌

300 దాటి పరుగులు చేసినా మ్యాచ్‌ని కాపాడుకోలేని దుస్థితిలో వుంది వెస్టిండీస్‌. వరల్డ్‌ కప్‌లో భాగంగా జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఐర్లాండ్‌ తలపడ్తోంది. క్రికెట్‌లో పసికూనలుగా చెప్పుకునే జట్లలో ఒకటి ఐర్లాండ్‌. ఐర్లాండ్‌…

300 దాటి పరుగులు చేసినా మ్యాచ్‌ని కాపాడుకోలేని దుస్థితిలో వుంది వెస్టిండీస్‌. వరల్డ్‌ కప్‌లో భాగంగా జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఐర్లాండ్‌ తలపడ్తోంది. క్రికెట్‌లో పసికూనలుగా చెప్పుకునే జట్లలో ఒకటి ఐర్లాండ్‌. ఐర్లాండ్‌ బౌలింగ్‌లో పస చూపలేకపోయినా, బ్యాటింగ్‌లో మాత్రం దుమ్మురేగ్గొడ్తోంది.

87 పరుగులకే ఐదు వికెట్లు తీసిన ఐర్లాండ్‌, ఆ తర్వాత చేతులెత్తేసేసరికి, వెస్టిండీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌ 304 పరుగులు చేసింది. సిమ్మన్స్‌ సెంచరీ చేస్తే అతనికి జతగా నిలిచిన సామి 89 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఇలా వుంటే, ఐర్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్‌ని ఛేదించే క్రమంలో ఎక్కడా తడబాటు ప్రదర్శించలేదు. ఓపెనర్లలో విలియమ్‌ 23 పరుగులకే ఔట్‌ కాగా, మరో ఓపెనర్‌ స్ట్రింగ్‌ ధాటిగా ఆడి 92 పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

ప్రస్తుతం ఐర్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జాయిస్‌ 79 పరుగులతోనూ, బ్రెయిన్‌ 37 పరుగులతోనూ స్కోర్‌ బోర్డ్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. విజయానికి కేవలం 62 పరుగుల దూరంలో వుంది. చేతిలో 8 వికెట్లు వుండటంతో ఐర్లాండ్‌ తనంతట తాను పొరపాట్లు చేస్తే తప్ప, విజయం సాధించడం ఖాయమే. అదే గనుక జరిగితే వరల్డ్‌ కప్‌లో ఐర్లాండ్‌ సంచలనం నమోదు చేసినట్లవుతుంది.

ఇప్పటిదాకా ఈ వరల్డ్‌ కప్‌లో 300 పరుగులు, ఆపై స్కోర్‌ చేసిన జట్లు అన్నీ విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్‌ని ఐర్లాండ్‌ అధిగమిస్తుందేమో వేచి చూడాలి.