కెరీర్ ఆరంభంలో తన దూకుడైన తీరుతో విమర్శల పాలయ్యాడు విరాట్ కొహ్లీ. ఆ తర్వాత అలాంటి విషయాలను పక్కనపెట్టి ఆట మీద దృష్టిపెట్టి అందరి అభినందనలూ అందుకున్నాడు. సచిన్ తర్వాత.. ఇండియాకు దొరికిన క్రికెట్ వజ్రం అనిపించుకొంటూ ఉన్నాడు. అయితే అనూహ్యంగా కొహ్లీ ఇప్పుడు మరోసారి అసహనభరితుడు అయ్యాడు. ఒక మొబైల్ యాప్ లో కొహ్లీ కామెంట్లు వివాదస్పదం అవుతున్నాయి.
తన పేరు మీద స్టార్ట్ అయిన ఒక మొబైల్ యాప్ లో ఒక నెటిజన్ తో కొహ్లీ సంభాషించిన తీరు ఏమంత బాగోలేదు. ఆ యాప్ లోకి వచ్చి ఎవడో ఒకడు కొహ్లీని విమర్శించాడు. కొహ్లీ గొప్ప బ్యాట్స్ మన్ ఏమీ కాదని.. అతడి కన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియన్ క్రికెటర్లు గొప్పోళ్లని వాడు కామెంట్ చేశాడు. దాన్ని కొహ్లీ పూర్తిగా లైట్ తీసుకోవాల్సింది.
అలాంటి అభిప్రాయంతో కొహ్లీకి పోయేదేమీ లేదు. అయితే కొహ్లీ అతడిపై విరుచుకుపడ్డాడు. వాడి అభిమానం తనకు అవసరం లేదని అంటూనే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు నచ్చేట్టు అయితే, ఇండియాలో ఉండవద్దని, ఆ దేశాలకు వెళ్లిపోవాలని కొహ్లీ దురుసుగా వ్యాఖ్యానించాడు.
ఎవడో ఏదో అంటే.. దానికి కొహ్లీ రియాక్ట్ కావడమే అనవసరమైన అంశం. అంతటితో అయినా ఆగకుండా.. దేశం విడిచి వెళ్లు అని మాట్లాడటం మాత్రం సబబుకాదు. ఎవరు దేశంలో ఉండాలో.. ఎవరు దేశం విడిచి వెళ్లాలో చెప్పడం కొహ్లీ పనికాదు.
విదేశీ ఆటగాళ్లను అభిమానించే వాళ్లు ఈ దేశానికి సరిపోరు.. అని కొహ్లీ వ్యాఖ్యానించడం మరీ విడ్డూరం. విమర్శలను లైట్ తీసుకోవాల్సింది. విమర్శించిన వాడు మరీ అనామకుడు కాబట్టి అస్సలు రియాక్ట్ కావాల్సింది కాదు. ఇక విదేశీ అభిమానం.. అనే అంశం గురించి భారత క్రికెటర్లు మాట్లాడటం అసలు సరికాదు.
ఎందుకంటే.. వీళ్ల ఒప్పందాలు, ఎండార్స్ మెంట్.. వెకేషన్లు, పెళ్లిళ్లు. అన్నీ విదేశాలతోనే ముడిపడి ఉంటాయి. ఆ మధ్య బంగ్లాదేశీ క్రికెటర్ ఒకరు చెప్పాడు.. తామంతా డబ్బు తీసుకునే ఆడుతున్నామని.. అలాంటిది తమది దేశభక్తి ఏంటని కుండబద్దలు కొట్టాడు ఆ క్రికెటర్. ఇప్పుడు జనాలు కూడా క్రికెట్ ను అలాగే చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొహ్లీ ఇలా రెచ్చిపోవడం సబబు కాదేమో!
జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్