విరాట్‌ పర్వం: ఆ పొగడ్తలేంటి? ఆ బాదుడేంటి.?

విరాట్‌ కోహ్లీ బాదేశాడు.. టీమిండియా సెమీస్‌లోకి దూసుకెళ్ళింది. టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా, టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చావు దెబ్బ తిన్నాక, ఈక్వేషన్స్‌ మారిపోయాయి. అభిమానుల అంచనాలు తారుమారైపోయాయి.…

విరాట్‌ కోహ్లీ బాదేశాడు.. టీమిండియా సెమీస్‌లోకి దూసుకెళ్ళింది. టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా, టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చావు దెబ్బ తిన్నాక, ఈక్వేషన్స్‌ మారిపోయాయి. అభిమానుల అంచనాలు తారుమారైపోయాయి. టెన్షన్‌ షురూ అయ్యింది. దాదాపుగా అన్నీ నాకౌట్‌ మ్యాచ్‌లే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ అయినా, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అయినా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అయినా.. సెమీస్‌లో వెస్టిండీస్‌తో అయినా, ఫైనల్‌ మ్యాచ్‌ అయినా.! 

కానీ, ఒక్కో మెట్టూ జాగ్రత్తగా ఎక్కుతూ వచ్చింది. తొలి మ్యాచ్‌లో వేసిన తప్పటడుగుల నుంచి గుణపాఠమే నేర్చుకుందో ఏమోగానీ, పరిస్థితుల్లో అయితే మార్పు స్పష్టంగా కన్పించింది. బంగ్లాతో మ్యాచ్‌ చేజారిపోయిందనుకుంటే, తిరిగొచ్చింది. పాకిస్తాన్‌తో వరల్డ్‌కప్‌లో గెలుపు అలవాటే గనుక, సాధించేశాం. ఆసీస్‌ని బోల్తా కొట్టించగలిగాం. ఆసీస్‌తో మ్యాచ్‌కి ముందు అభిమానుల్లో బోల్డన్ని అనుమానాలు. అవన్నీ పటాపంచలైపోయాయి. దానిక్కారణం విరాట్‌ కోహ్లీ. 

ఒకప్పుడు టీమిండియాలో సచిన్‌కి ముందు.. సచిన్‌ తర్వాత.. అని చెప్పుకునేవాళ్ళం. ఇకపై విరాట్‌ కోహ్లీకి ముందు, కోహ్లీ తర్వాత.. అని మాట్లాడుకోవాలేమో. ఎందుకంటే, ఛేజింగ్‌లో విరాట్‌ కోహ్లీ చెలరేగిపోతాడు. టెన్షన్‌ పెరిగిపోతోంటే, విరాట్‌ బాదుడుకి హద్దూ అదుపూ వుండదు. మైదానంలో అభిమానుల కేరింతల సంగతెలా వున్నా, కామెంటేటర్లు తీవ్ర ఉత్కంఠతో మ్యాచ్‌ గురించి మాట్లాడేస్తుంటారు. నిన్నటి మ్యాచ్‌లో అయితే, కోహ్లీ బంతి ఎదుర్కొంటున్నాడంటేచాలు, కామెంటేటర్లు టెన్షన్‌తో ఊగిపోయారు. వారి మాటల్లో ఆ ఉత్కంఠ స్పష్టంగా కన్పించింది. 

బంతిని కోహ్లీ బాదిన ప్రతిసారీ, కామెంటేటర్లు చేసే కామెంట్లు బంతి కన్నా జోరుగా బయటకొచ్చాయి. కోహ్లీని పొగిడేందుకు కామెంటేటర్లు మాటలు వెతుక్కోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ లేని విధంగా కామెంటేటర్లు పొగడ్తల కామెంటరీతో ఊగిపోయారనడం అతిశయోక్తి కాదేమో. కామెంటేటర్ల కామెంట్లకు టీవీల్లో మ్యాచ్‌ని తిలకిస్తోన్న భారత క్రికెట్‌ అభిమానులు పండగ చేసుకున్నారు. సంబరాల్లో మునిగి తేలారు. టెన్షన్‌ని తగ్గించుకున్నారు. 

మైదానంలో మాత్రం బంతి బంతికీ ఆనందందో కూడిన టెన్షన్‌. మ్యాచ్‌ చివరి అరగంట అయితే, మైదానం మోతెక్కిపోయింది. ఔను, ఇది విరాట్‌ పర్వం. విరాట్‌ కోహ్లీ శకం. టెన్షన్‌ తనలో కసిని పెంచేస్తుందనీ, ఆ కసి మరింత బాధ్యతను తీసుకొస్తుంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాగ్రత కోల్పోకూడదనే ఆత్మస్థయిర్యాన్ని పెంచుతుందనీ కోహ్లీ ప్రతిసారీ చెబుతుంటాడు. అది నూటికి నూరుపాళ్ళూ నిజం. బహుశా ప్రపంచ క్రికెట్‌లోనే కోహ్లీలా ఒత్తిడిని జయించే క్రికెటర్‌ ఇంకొకరు లేరనడం అతిశయోకి ఎంతమాత్రమూ కాదు.