'కన్నయ్య' అంటే ఎవరు అని అడిగే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఏదో ఒక రకంగా అతని పేరును బిజెపివారు, లెఫ్టిస్టులు, కాంగ్రెసువాళ్లు అందరూ జపిస్తున్నారు. హైదరాబాదు వస్తే కమ్యూనిస్టు నాయకులు ఎయిర్‌పోర్టుకెళ్లి రిసీవ్ చేసుకున్నారు. అతని కుటుంబం, విద్యార్థి యూనియన్ అన్నీ సిపిఐకు చెందినవి. అందుకనే నారాయణగారు వాటేసుకుని వూరంతా తిప్పారు. ఒకప్పటి తమ కంచుకోట విజయవాడకు తీసుకెళ్లారు. ఇంకా విద్యార్థిగానే వున్న అతను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రసంగం యిస్తే చుక్కా రామయ్యగారి వంటి విద్యావేత్తలు హాజరయ్యారు. అతని ప్రతి కదలికను వార్తాపత్రికలు ఫ్రంట్ పేజీల్లో వేశాయి. అతన్ని భగత్ సింగ్‌తో కాంగ్రెసు నాయకుడు పోలిస్తే, అతను రోహిత్‌ను భగత్ సింగ్‌తో పోల్చాడు. చూడబోతే ఇంటికో అఫ్జల్ నినాదంతో పాటు, ఇంటికో భగత్ సింగ్ నినాదం కూడా వూపందుకుంటుందేమో! ఇలా ప్రతీవాణ్నీ భగత్ సింగ్ చేస్తూ పోయి, అసలు భగత్ సింగ్ విలువేమైనా మిగులుస్తారా?
మోదీని, బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ గడ్డిపోచ దొరికినా దాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చేద్దామని ప్రతిపక్షాలు ఊహూ కుతూహలపడుతున్నాయి. దేశరాజకీయాలకు కాంగ్రెసు నేర్పిన టక్కుటమార విద్యలన్నీ బిజెపి వంటబట్టించుకుని అమలు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని చీల్చి కూల్చివేసే కార్యక్రమం అయిపోయాక, ఉత్తరాఖండ్ పని పడుతోంది. ప్రతి ప్రభుత్వవ్యవస్థను, రాజ్యాంగవ్యవస్థను తన ప్రయోజనాలకు వాడుకుంటూ రాజకీయంగా కాంగ్రెసుకు ఏమీ తీసిపోనని నిరూపించుకుంటోంది. దాన్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు తత్తరపడుతున్నాయి. బిజెపి అండదండలతో ఎబివిపి చెలరేగిపోతోంది. విద్యాసంస్థలన్నిటిలో తన పతాకాన్ని ఎగరవేస్తోంది. ఈ ఉధృతిని ఉద్యమాల ద్వారా ఎదుర్కోలేని ప్రతిపక్షాలు ఏ వామనుడు దొరికినా అతన్ని త్రివిక్రమావతారంలో చూపిస్తూ మోదీ అనే గోలియత్‌పై పోరాడగలిగే డేవిడ్ యితనే అతని మనల్ని నమ్మిద్దామని చూస్తున్నారు. కన్నయ్యకు కూడా ఆ నమ్మకం కలిగేసినట్లుంది, హైదరాబాదు సమావేశంలోనే ఆవేశం రగిలి అక్కడికక్కడ మోదీపై కవిత రాసిపారేశాడు. ఇక్కడకు వచ్చే ముందు రాహుల్ గాంధీని కలిసి వచ్చాడు. అంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టేశాడనే అనుకోవాలి. అందుకే కాబోలు అతన్ని బెంగాల్ ఎన్నికలలో తిప్పుతామని సిపిఎం అంటోంది. బుద్ధిగా చదువుకునే రోహిత్ యిలాగే రాజకీయాల్లో పడి చదువు అటకెక్కించాడు. ఇప్పుడు కన్నయ్య కూడా అదే బాటలో వెళుతున్నట్లు కనబడుతోంది.
ప్రస్తుతానికి కన్నయ్య విప్లవకారుడేమీ కాదు, సిద్ధాంతకర్త కాదు, కేవలం జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకుడు. 7300 మంది విద్యార్థులుంటే వెయ్యి మంది యితనికి ఓట్లేశారు. అతను గొప్ప ఆలోచనాపరుడు, వక్త వగైరా కాబట్టే యింత గుర్తింపని సమర్థించనక్కరలేదు. జెఎన్‌యు వంటి యూనివర్శిటీలో విద్యార్థి సంఘానికి నాయకుడనగానే యివన్నీ వుంటాయని ఎవరూ విడిగా చెప్పనక్కరలేదు. ఆ యూనివర్శిటీ యిలాటి నాయకులను ఎంతోమందిని చూసి వుంటుంది. మరి వారెవరికీ దొరకని గుర్తింపు యితనికి ఎందుకు దక్కింది అంటే దానికి కారణం ఎబివిపి అతనిపై పగ బట్టింది కాబట్టి అనే చెప్పాలి. ఎబివిపి అతన్ని మాటే(ర్) (సిద్ధాంతానికి కట్టుబడడం చేత హింసకు గురైనవాడు) చేసిపడేసింది. దాంతో లెఫ్ట్ అతన్ని వాటేసుకుంది. రోహిత్ విషయంలోనూ అదే జరిగింది. ఎబివిపి అతనిపై ఫిర్యాదు చేసింది కాబట్టి, యిద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాశారు కాబట్టి ఆత్మహత్య చేసుకున్న భీరుడు లెఫ్ట్ దృష్టిలో వీరుడై పోయాడు. అతని పేర ఎవార్డులు యిచ్చేసే, చట్టం చేయాలని డిమాండ్ చేసే స్థితికి చేరింది సమాజం. తనకూ భావప్రకటన చేసే హక్కు వుందని చూపుకున్న ఎబివిపి నాయకుడిపై రోహిత్ దాడికి వెళ్లాడు. అది వారికి తప్పుగా తోచలేదు. ఈ రోజు కన్నయ్య మీటింగులో అతని ప్రసంగాన్ని వినకుండా బూట్లు విసిరిన వాణ్ని చావగొట్టారు మరి. తమకు భావప్రకటనా స్వేచ్ఛ లేదా అని ఆనాడు అడిగిన ఎబివిపి యీ రోజు కన్నయ్యపై దాడిని ఖండించలేదు.
కన్నయ్య లోపలకి వస్తే ఏదో ఉత్పాతం సంభవిస్తుందన్న బిల్డప్ యిచ్చి హైదరాబాదు యూనివర్శిటీ అతన్ని లోపలకి రానీయలేదు. గేటు దగ్గరే ఆపేశారు. ఇదే పద్ధతిని జెఎన్‌యు పాటించింది. కన్నయ్య బెయిల్ మీద బయటకు వచ్చాక అతనిపై చర్య తీసుకోబోయింది. సస్పెండ్ చేసింది, దాన్ని వెనక్కి తీసుకుంది, కానీ ఫైన్ వేస్తానంది. కానీ ఆ కమిటీలో వున్న కొందరు డీన్‌లు యీ నివేదిక మాకు చూపించలేదన్నారు. అంటే యూనివర్శిటీ కన్నయ్యపై పగ బట్టింది అని అందరికీ విదితమైంది. బిజెపి ఎంపీ చందన్ మిత్రా అయితే ఏకంగా యూనివర్శిటీమీదే పగబట్టేసి, దాన్ని మూసి పారేయాలన్నాడు. ఈ చర్యలన్నిటివలన కేంద్రంలో అధికారంలో వున్న బిజెపియే కన్నయ్యపై కక్ష కట్టిందని తేటతెల్లమౌతోంది. అతను కోర్టుకి హాజరయితే కొందరు లాయర్లు వచ్చి కొట్టారు. బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మ కన్నయ్య అనుచరులపై దాడి చేస్తున్న ఫోటో పేపర్లలో వచ్చేసింది. వారిపై యింకా శిక్ష పడలేదు. అతను బెయిల్ నుంచి తిరిగి రాగానే బయటివాడెవడో వచ్చి లెంపకాయ కొట్టిపోయాడు. కేసు పెట్టిన పోలీసులు కోర్టువాళ్లు సాక్ష్యాలడిగినపుడు తెల్లమొహం వేశారు. కన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చిన వీడియోలను ఎవరో మార్చేశారని తేలినపుడు యిదంతా అతనిపై కావాలని జరుగుతున్న కుట్ర అనిపించి అయ్యోపాపం అనిపిస్తుంది.
పెట్టిన కేసు చిన్నాచితకా కాదు, దేశద్రోహం! దాన్ని గతంలో కూడా చిత్తం వచ్చినట్లు వాడారు. 2003లో విఎచ్‌పి లీడరు ప్రవీణ్ తొగాడియా త్రిశూలాల నిషేధంపై నిరసన తెలపడానికి రాజస్థాన్ వెళ్లినపుడు అక్కడి కాంగ్రెసు ప్రభుత్వం అతనిపై దేశద్రోహం కేసు పెట్టింది. ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవ సందర్భంగా 2005లో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడైన సిమ్రాన్‌జిత్ మాన్ స్వర్ణదేవాలయంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు యిచ్చినందుకు పంజాబ్‌లో వున్న కాంగ్రెసు ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టింది. ''సూరత్ సామ్నా'' అనే పత్రిక సంపాదకీయంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' భాష వుపయోగించినందుకు దాని సంపాదకుడు మనోజ్ షిండేపై 2006లో గుజరాత్ ప్రభుత్వం పెట్టిన కేసు – దేశద్రోహం! తెలుగు రచయితలు దేశవిచ్ఛిత్తికై కుట్ర పన్నారంటూ కేసులు పెట్టిన సందర్భాలు గతంలో మన రాష్ట్రంలో చూశాం. దేశద్రోహం చేశాడనగానే సరిపోదు, గతంలో ఎటువంటి నేరాలు చేశాడు, ఎవరితో చేతులు కలిపాడు, ఏం చేద్దామని ప్లాను చేశాడు అని అనేకరకాలుగా నిరూపించాలి. పోలీసులు అవేమీ లేకుండా కేసు పెట్టేసి, అతన్ని హీరో చేసేశారు. ఇంతకీ అతనేమిటి? అతను చేసినదేమిటి? చేయనిదేమిటి? అతనితో బాటు కేసులు ఎదుర్కుంటున్నవారెవరు అనే విషయాలను సేకరించి రాస్తున్నాను. తప్పులుంటే ఎత్తి చూపండి.
అతని గురించి రాయడం మొదలుపెట్టగానే నన్నూ దేశద్రోహి అనేసేవాళ్ల కోసం ముందుగానే రాస్తున్నాను – నా దృష్టిలో కోర్టు తీర్పును కాని, ఉరిశిక్షను కాని వ్యతిరేకించినవారు దేశద్రోహులు కారు. సమాజమంతా తప్పుపట్టి, శిక్ష వేసిన సందర్భాల్లో కూడా వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయం కలిగి వుండవచ్చు. మహాత్మా గాంధీ హత్యను భారతసమాజం నిరసించి గోడ్సేని ఉరి తీసింది. అయినా 'గోడ్సే చేసినది తప్పు కాదు, అతన్ని ఉరితీయడం తప్పు, అతను దేశభక్తుడు' అని వాదించేవారికి దేశభక్తి లేదని అనలేం. అలాగే రాజీవ్ గాంధీ హంతకులను వదిలేయమని అడిగేవారినీ, ఇందిరా గాంధీ హంతకులను సన్మానించాలనేవారినీ దేశద్రోహులనలేం. 'చైనా చైర్మనే మా చైర్మన్' అని నినాదాలిచ్చిన నక్సలైట్లను దేశభక్తులుగా వర్ణించినవారినీ దేశద్రోహులనలేం. ఒక్కొక్కరిది ఒక్కో భావజాలం. అయితే 'దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాం, దీన్ని నాశనం చేసేదాకా నిద్రపోము' అనే నినాదం మాత్రం నిశ్చయంగా దేశద్రోహమే. అయితే అలా నినాదం యిచ్చినంత మాత్రాన దేశద్రోహం కేసు పెట్టాలా అంటే ఆలోచించాలి. కోపంలో 'నిన్ను చంపేదాకా నిద్రపోను' అన్నంత మాత్రాన హత్యానేరంపై జైల్లో పెట్టరు. హత్య జరగాలి. అప్పుడు యీ మాటలకు విలువ వస్తుంది. లేకపోతే బెదిరించిన దానికే కేసు పెట్టాలి. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)