వరల్డ్‌కప్‌ ఫీవర్‌ షురూ…

అతి త్వరలో వన్డే వరల్డ్‌కప్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈలోగానే అసలైన క్రికెట్‌ మజా మొదలైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఇండియా జట్ల మధ్య ట్రై సిరీస్‌ ఓ పక్క జరుగుతోంటే, ఇంకోపక్క వెస్టిండీస్‌ –…

అతి త్వరలో వన్డే వరల్డ్‌కప్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈలోగానే అసలైన క్రికెట్‌ మజా మొదలైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఇండియా జట్ల మధ్య ట్రై సిరీస్‌ ఓ పక్క జరుగుతోంటే, ఇంకోపక్క వెస్టిండీస్‌ – సౌతాఫ్రికా జట్ల మధ్య సిరీస్‌ జరుగుతోంది. ఏ మ్యాచ్‌కి ఆ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండడంతో క్రికెట్‌ అభిమానులు అప్పుడే వన్డే వరల్డ్‌కప్‌ ప్రారంభమైందా.? అన్న ఆశ్చర్యంలోనే క్రికెట్‌ మజాని ఎంజాయ్‌ చేస్తున్నారు.

ట్రై సిరీస్‌లో ఇంగ్లాండ్‌, టీమిండియా రెండూ ఆస్ట్రేలియా చేతిలో పరాజయాల్ని చవిచూశాయి. అయితేనేం, టీమిండియా తురుపుముక్క రోహిత్‌శర్మ ఫామ్‌లోకొచ్చేశాడు. వన్డే స్పెషలిస్ట్‌ రైనా తానెంత విలువైన ఆటగాడో ప్రూవ్‌ చేసుకున్నాడు. కానీ, బౌలర్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో టీమిండియా పరాజయం పాలైనా, మ్యాచ్‌ సూపర్‌ కిక్‌ ఇచ్చింది అభిమానులకి.

మరోపక్క, సౌతాఫ్రికా వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోయారు. తొలి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు చేశారు. ఓ సెంచరీ అయితే అతి తక్కువ బంతుల్లో అదీ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మొత్తంగా 44 బంతులు ఆడిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌ 149 పరుగులు బాదాడు. ఇందులో 16 సిక్సర్లు వుండటం గమనార్హం. సౌతాఫ్రికా యాభై ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 439 పరుగులు చేసింది. ఇదొక్కటి చాలు, వన్డే వరల్డ్‌కప్‌ ఎలా వుండనుందో ఊహించడానికి.

ఇక, టీమిండియా విషయానికొస్తే.. గత వరల్డ్‌కప్‌ విజేత అయినా టీమిండియా మరోమారు, పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఒకరిద్దరు మినహా అందరూ యంగ్‌స్టర్స్‌ కావడం, బౌలింగ్‌ వీక్‌గా వుండటం.. ఇవన్నీ నిరాశపరిచే అంశాలు. అయినాసరే, ఒక్కసారి వరల్డ్‌కప్‌ పోటీలు ప్రారంభమయ్యాక, ఎవరు ఎలా చెలరేగిపోతారో ఊహించడం కష్టం. చూద్దాం.. ఏం జరుగుతుందో.!