వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడ్తున్న విషయం విదితమే. సెమీస్‌లో సౌతాఫ్రికాపై నరాలు తెగే ఉత్కంఠ నడుమ విజయం సాధించింది న్యూజిలాండ్. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాని సెమీస్‌లో మట్టికరిపించింది ఆస్ట్రేలియా.
ఫైనల్ బరిలోకి దిగుతోన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమ ఉజ్జీలుగా వున్నాయి. ఎవర్నీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మ్యాచ్ ఏకపక్షంగా సాగే అవకాశమే లేదు. బరిలో రెండు బలమైన జట్లు తలపడితే, ఉత్కంఠ ఏ రేంజ్లో వుంటుందో, ఆ ఉత్కంఠను అనుభవించడానికి క్రికెట్ అభిమానులు రెడీ అయిపోవాల్సిందే.
మాక్స్వెల్ రెచ్చిపోతే, మెక్కల్లమ్ ఇరగదీస్తే.. జాన్సన్ నిప్పులు చెరిగే బంతులు విసిరితే.. బోల్డ్ వికెట్లను గిరాటేస్తే.. ఇవన్నీ రేపటి మ్యాచ్‌లో చూడబోతున్నాం. బంతికీ, వికెట్లకీ రేపు మూడనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా సెమీస్‌లో తడబడ్డంతో ఆసీస్ గెలుపు సులభతరమైంది. కానీ న్యూజిలాండ్ – సౌతాఫ్రికా మ్యాచ్ అలా కాదు. తీవ్రమైన ఒత్తిడిని జయించింది న్యూజిలాండ్. అంటే ఇక్కడ ఒత్తిడి న్యూజిలాండ్‌కి అలవాటైపోయిందనే కదా. ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌లలో మంచి ట్రాక్ రికార్డ్ వుంది. చాలాసార్లు వరల్డ్ కప్ టైటిల్‌ని గెలుచుకున్న జట్టు అది.
ఎవరి ప్లస్ పాయింట్స్ వాళ్ళకి వున్నాయి. వీక్నెస్లు మాత్రం ఇద్దరికీ తక్కువగానే వున్నాయి. వెరసి, బరిలో భీకరమైన పోరును చూడబోతున్నాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 2015 వరల్డ్ కప్ పోటీల్లో గెలుపెవరిది.? అన్న సంగతి మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.