గత వరల్డ్‌కప్ హీరో, మ్యాన్ ఆఫ్ ది సిరీస్.. యువరాజ్‌సింగ్‌కి, ఈ వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్ దొరికేలా వుంది. వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా సభ్యుల్లో తొలుత యువరాజ్‌సింగ్‌కి అవకాశం దక్కలేదు. అయితే చోటు దక్కించుకున్న రవీంద్ర జడేజా ఇంకా ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో, యువరాజ్‌సింగ్‌కి అవకాశం దక్కనుందని సమాచారం.
వాస్తవానికి టీమ్‌ని సెలక్ట్ చేసినప్పుడే రవీంద్ర జడేజాపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు రవీంద్ర జడేజా. గాయం నుంచి ఇప్పుడిప్పుడే జడేజా కోలుకుంటున్నా, వరల్డ్ కప్ సమీపించిన దరిమిలా, అతని ఫిట్‌నెస్ ఎలా వుందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలోనే రేపు ఫిట్‌నెస్ టెస్ట్ మరోమారు జరగనుంది.
రవీంద్ర జడేజాతోపాటు ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మలకీ రేపు ఫిట్‌నెస్ టెస్ట్ జరగనుండగా, ఆ టెస్ట్ తర్వాత పరిస్థితిని అంచనా వేసి, యువరాజ్‌సింగ్‌ని కూడా జట్టులోకి తీసుకుంటారట. రవీంద్రజడేజా పరిస్థితి ఎలా వున్నా, యువీని జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమన్న ప్రచారం, యువీ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.
గత వరల్డ్‌కప్ తర్వాత యువరాజ్‌సింగ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక మునుపటి ఫామ్‌ని పొందడంలో యువీ విఫలమవుతున్నాడు. రంజీల్లో రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్‌లలో యువీ ఫెయిలవుతుండడంతో, యువీని పక్కన పెట్టింది బీసీసీఐ. ఇప్పుడు వేరే ఆప్షన్ లేకపోవడంతో యువరాజ్‌సింగ్‌ని పిలిచేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.