జావియర్ మోరో అనే స్పానిష్ నవలా రచయిత సోనియా జీవితం గురించి రాసిన ''ద రెడ్ శారీ'' అనే పుస్తకం స్పెయిన్‌లో 2008 అక్టోబరులో వెలువడింది. దాదాపు పన్నెండు భాషల్లో అనువదించబడింది. కానీ ఇంగ్లీషులోకి మాత్రం కాలేదు. దానిపై భారతదేశంలో అప్రకటిత నిషేధం వుంటూ వచ్చింది. బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ పుస్తకాన్ని యింగ్లీషులో ఇండియాలోని బుక్ స్టోర్స్‌లో లభిస్తోంది. ''ఔట్‌లుక్'' వారపత్రిక ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను ముద్రించడమే కాకుండా, ఆ రచయితతో యింటర్వ్యూ కూడా ప్రచురించింది. భారత స్వాతంత్య్రంపై వచ్చిన ''ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్'' రచయితల్లో ఒకరైన డొమెనిక్ మేనల్లుడే ఆ రచయిత. తన మామ రచనల ద్వారా ఇండియా గురించి, నెహ్రూ కుటుంబం గురించి అతనికి అవగాహన ఏర్పడింది. ఇటలీలో పేద కుటుంబంలో పుట్టి సామాన్యమైన తెలివితేటలున్న సోనియా అనూహ్య పరిస్థితుల్లో ఆ కుటుంబంలో కోడలుగా వచ్చి భారతదేశాన్ని పరోక్షంగా ఏలగలగడం అతనికి అబ్బురంగా తోచింది. ఆమె యీ పయనాన్ని రసవత్తరమైన కథగా చూశాడతను. రోమ్‌లోని అతి పెద్ద బుక్‌స్టోర్స్‌కి వెళ్లి సోనియా జీవితంపై పుస్తకం వుందా అని వాకబు చేశాడు. ఒక్కటి కూడా లేదన్నారు. తన జీవితం గ్రంథస్తం కావడానికి సోనియా యిష్టపడలేదని, ఎవరికీ అనుమతి యివ్వలేదని, యింటర్వ్యూలు యివ్వదని, వివరాలు చెప్పదని అందుకే ఏ ఇటాలియన్, ఏ యూరోపియన్ జర్నలిస్టూ ఆమె జీవితచరిత్ర రాయడానికి సాహసించలేదని అతనికి అర్థమైంది. ఆ పని తనే ఎందుకు చేయకూడదనుకుని ఆమెతో చెప్పకుండానే ఆమె వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఆమె పుట్టిన ఆర్బాసోనో అనే వూరికి వెళ్లి మూడువారాలు హోటల్లో కాపురం పెట్టి ఆమెకు బాల్యంలో ఐస్‌క్రీమ్ అమ్మినవాడి దగ్గర్నుంచి అందర్నీ పలకరించాడు. వాళ్ల నాన్న ఎంత దారిద్య్రంలో బతికాడో తెలిసింది. వెతుకులాటలో జావియర్‌కు అదృష్టం కలిసి వచ్చి స్పెయిన్‌లో జర్నలిస్టుగా పనిచేసే జోస్టో మాఫియో అనే ఇటాలియన్ పరిచయమయ్యాడు. అతను ఆ వూరి పోలీసు అధికారి కొడుకు. సోనియాకు 15 ఏళ్ల వయసులో తొలి బాయ్‌ఫ్రెండ్!
జావియర్ ఇండియాకు వచ్చి సోనియా సర్కిల్‌లోని ప్రముఖులను కదలేస్తే ఎవరూ పెదవి విప్పలేదు. చివరకు 10 జనపథ్‌లో తోటమాలిగా పనిచేసిన ఒకతను దొరికాడు. ఇంటి విషయాలెన్నో చెప్పాడు. ఇందిరకు 16 ఏళ్ల పాటు సెక్రటరీగా పనిచేసిన ఉషా భగత్ అనే ఆమె కొన్ని సంగతులు చెప్పింది. ఇలా సేకరించిన సమాచారంతో చక్కటి నవలలా తన పుస్తకాన్ని రాశాడు. దాన్ని పబ్లిష్ చేయడానికి ముందు అతను సోనియాను కలిసి, ''నేను రాసిన పుస్తకం కాపీ పంపమంటారా?'' అని అడిగాడు. ''అక్కరలేదు, మా గురించి రాసిన పుస్తకాల్ని మేం ఎప్పుడూ చదవం'' అందామె రాజసం ఒలకబోస్తూ. ఇవన్నీ అతను చెప్పాడు. 'మీరు రాసిన పుస్తకం యీ దేశప్రజలు చదవకూడదని కాంగ్రెసు పార్టీ ఎందుకు ప్రయత్నించింది?' అనే ప్రశ్నకు బదులుగా అతను 'అప్పటికే ఆమె విదేశీయురాలనే చర్చ జరుగుతోంది. విదేశీయురాలైనా గొప్ప కుటుంబం నుంచి వచ్చిందన్న భావం భారతప్రజల్లో వుండాలని పార్టీ ఆశపడింది. ఆమె ఒక లోక్లాస్ యూరోపియన్ పిల్ల అని బయపడడం వాళ్లకు యిష్టం లేదు.' అన్నాడు. పుస్తకం చదివితే సోనియా తండ్రి ఒకప్పుడు గొఱ్ఱెలు కాచుకునేవాడని తెలుస్తుంది. అంతేకాదు, పెద్దగా లోకజ్ఞానం లేనివాడు, భయస్తుడు కూడా. ఇండియా వంటి దూరదేశంలో తన కూతురు స్థిరపడడం జీర్ణించుకోలేక పోయాడు. ఆమె పెళ్లికి అతను రాలేదు. తన స్నేహితుడితో 'అక్కడ ఆమెను పులులకు ఆహారంగా వేసేస్తారు' అని చెప్పుకుని బాధపడ్డాడు. పెళ్లికి సోనియా తల్లి, సోదరి, మేనమామ మాత్రమే వచ్చారు.
సోనియాను పెళ్లి చేసుకుంటానని తనని అడగడానికి రాజీవ్ వాళ్లింటికి వచ్చినపుడు అతను చాలా కంగారుపడ్డాడు. రాజీవ్‌కు, అతనికి మధ్య దుబాసీగా సోనియాయే పనిచేసింది. ''మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అనుమతి కోరడానికై వచ్చాను.'' అని రాజీవ్ అంటే అతను ''నీ కళ్లల్లో నిజాయితీ కనబడుతోంది. కానీ సోనియా విషయమే నాకు సందేహంగా వుంది. చిన్నపిల్ల. ఇండియా వంటి దూరదేశంలో బతకలేదు. మన సంస్కృతుల్లో చాలా తేడా వుంది.'' అన్నాడు. ''పోనీ ఆమెను ఇండియాకు పంపి అక్కడ అలవాటు పడుతుందో లేదో చూదాం. మా అమ్మకు ఆల్‌రెడీ పరిచయం చేశాను. సోనియా ఒక్కత్తీ అక్కడకు వెళ్లి మా యింట్లో వుంటుంది, కొన్ని రోజులకు నేను వెళ్తాను. తనకు ధైర్యం చిక్కితేనే పెళ్లి చేసుకుంటాం.'' అని సూచించాడు రాజీవ్. ''ఈ ప్రయోగమైనా తనకు 21 ఏళ్లు నిండితేనే తప్ప నేను అనుమతించలేను. అంటే యింకో ఏడాది అన్నమాట. అప్పటికి కూడా మీకు ఒకరిపై మరొకరికి యింత యిష్టం వుంటుందో లేదో చూదాం.'' అన్నాడు.
సోనియా తండ్రి విధానం యిలా వుంటే రాజీవ్ తల్లి ఇందిరా గాంధీ పద్ధతి యింకెలా వుందో కూడా రాశాడు రచయిత. ఇందిరా గాంధీ లండన్ వచ్చి ఇండియన్ ఎంబసీలో బస చేసిందని తెలిసి రాజీవ్ సోనియాను ఆమె దగ్గరకు వెంటబెట్టుకుని వెళతానన్నాడు. ఆమె సరేనంది కానీ సగందారిలో భయం పట్టుకుంది. 'అంత ఉన్నతస్థానంలో వున్నావిడ దగ్గర నేనెలా ప్రవర్తించాలో అర్థం కావటం లేదు, యీ సారి కాదు, వచ్చేసారి వస్తానులే' అందామె. కొన్ని రోజుల తర్వాత ధైర్యం కూడగట్టుకుంది. ఓ స్టూడెంటు పార్టీకి వెళుతూ రాజీవ్‌తో కలిసి అతని గర్ల్‌ఫ్రెండ్‌గా ఇందిర వద్దకు వెళ్లింది. ఆమెతో కాస్సేపు మాట్లాడగానే ఇందిరకు అర్థమైంది – ఇంగ్లీషు సరిగ్గా రాదని. ఆమె కోసం ఫ్రెంచ్‌లో మాట్లాడింది. ''నేనూ నీ లాగే ఒకప్పుడు మొహమాటస్తురాలిని, యవ్వనంలో వుండగా ప్రేమలో పడినదాన్ని, నీ యిబ్బంది అర్థం చేసుకోగలను'' అని ధైర్యం చెప్పింది. సోనియా ''పార్టీకి వెళ్లడానికి యీవెనింగ్ డ్రెస్ వేసుకోవాలి. పక్కరూములో కెళ్లి బట్టలు మార్చుకోవచ్చా?'' అని అడిగితే సరేనంది. డ్రస్సు వేసుకుని బయటకు వెళ్లబోతూ వుంటే తూలి కాలికి వేసుకున్న హైహీల్ గుచ్చుకుని ఆమె గౌను అంచు చిరిగిపోయింది. ఇందిర వెంటనే సూది, నల్లదారం తీసుకుని అంచు కుట్టి యిచ్చింది. ''ఆ పరిస్థితుల్లో మా అమ్మ ఎలా చేస్తుందో అచ్చు అలాగే ఆమె చేసింది. ఇక దానితో నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి' అని సన్నిహితులతో చెప్పుకుంది సోనియా.
కేంబ్రిజ్‌లో వాళ్లు కలిసిన సరిగ్గా మూడేళ్ల తర్వాత రాజీవ్, సోనియా ఇండియాకు కలిసి వచ్చి పెళ్లి చేసుకుంటామని తనతో చెప్పినపుడు ఇందిర ఆశ్చర్యపడింది. ఇన్నాళ్లయినా వాళ్ల నిర్ణయం మారలేదంటే ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారని, అడ్డు చెప్పి ప్రయోజనం లేదనీ ఆమెకు అర్థమైంది. కానీ భారతీయులు యీ వివాహాన్ని ఆమోదించరని ఆమెకు తెలుసు. తను ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంటానన్నపుడే నెహ్రూ కుటుంబీకులు అలాటి సామాన్యుణ్ని చేసుకోవడమేమిటి అని అభ్యంతరం తెలుపుతూ ఉత్తరాలు, టెలిగ్రాంలు పంపారు. పత్రికల్లో చర్చలు జరిపారు. ఇక సోనియా విదేశీయురాలు. 'ఈమెలో ఏం చూసి రాజీవ్ చేసుకుంటున్నాడు? ఇండియాలో యింతకంటె అందగత్తె దొరకలేదా?' అంటారని వూహించింది. వాళ్లిద్దరూ కలిసి ఢిల్లీలో తిరుగుతూ వుంటే పత్రికల మాట ఎలా వున్నా ఢిల్లీ సోషల్ సర్కిల్స్‌లో చర్చ ప్రారంభమైంది. సోనియా మూలాలు ఎవరికీ నచ్చలేదు. 'ఈమె కంటె మా అమ్మాయి అందంగా వుంటుంది, ఓ సారి పలకరించి చూడు' అని వెంటపడే సొసైటీ లేడీస్ తయారయ్యారు. ఇలా ఓ వారం గడిచేసరికి ఇందిరకు గత్యంతరం లేదని తెలిసింది. ''పెళ్లికి ఒప్పుకుంటాను కానీ ఒక షరతు. పెళ్లయ్యాక ఆ అమ్మాయి మనింట్లోనే వుండాలి. కోడలు అత్తవారింట్లో వుండడం భారతీయ సంప్రదాయం. భర్తతో విడిగా కాపురం పెట్టడం విదేశీ సంప్రదాయం. ఇప్పటికే నేను కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నానని, నాకు భారతీయ సంస్కృతి పట్ల గౌరవం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడు విదేశీయురాలిని కోడలుగా ఆమోదిస్తున్నాను కాబట్టి అవి మరింత పెరుగుతాయి. ఇక మీరు విడిగా వుండడం కూడా అనుమతిస్తే హద్దు మీరినట్లే. సోనియా ఏమంటుందో కనుక్కో.'' అని కొడుక్కి చెప్పింది.
పెళ్లయ్యాక అత్తవారింట్లో వుండడం అంటే అత్తగారు, మరిది, రాబోయే తోడికోడలు అందరితో కలిసి వుండాలి. సోనియా పెరిగిన వాతావరణానికి యిది విరుద్ధం. అయినా రాజీవ్‌పై ప్రేమతో సరేనంది. ''ఎక్కువకాలం ఆగినకొద్దీ చిక్కులు పెరుగుతాయి తప్ప ఉపయోగం లేదు. ఫిబ్రవరి 25న పెళ్లి.'' అంది ఇందిర… అంటే సోనియా ఢిల్లీకి వచ్చిన నెల్లాళ్లలోనే. ఇటలీ వెళ్లి తలిదండ్రులను ఒప్పించే వ్యవధి లేదు సోనియాకు. పరిస్థితి వివరిస్తూ ఉత్తరం రాసింది. పెళ్లికి రమ్మనమని కోరింది. ఉత్తరం చేరే లోపున అంతర్జాతీయ మీడియాలో వీరి వివాహవార్త వచ్చేసింది. ట్యురిన్ నుండి ''లా స్టాంపా'' పత్రికా విలేకరి సోనియా యింటికి వెళ్లి అక్కడేమైందో రాశాడు. సోనియా తలిదండ్రులు, సోదరి అందరూ టెన్షన్‌తో కొట్టుమిట్టులాడుతున్నారు. ఇంటి చుట్టూ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, ఫోన్ నిరంతరం మోగుతూ గాభరా పెంచుతోంది. 53 ఏళ్ల ఆమె తండ్రి అతి తక్కువ మాటల్లోనే తన ఆవేదన తెలిపాడు – ''నా కూతుళ్ల భవిష్యత్తు కోసమే నేను నిరంతరం శ్రమించాను. ఇక సోనియా పెళ్లి గురించి అంటారా, అదేదో పూర్తయిన తర్వాతే వ్యాఖ్యానించడం మంచిది, అంతకంటె మంచిపని ఏమిటంటే – దాని గురించి ఎప్పటికీ మాట్లాడకపోవడం?!'' 45 ఏళ్ల ఆమె తల్లి కన్నీరు కారుస్తూ ''మా అమ్మాయి అంత దూరానికి వెళ్లిపోతుందన్న ఆలోచనే నన్ను భయపెడుతోంది.'' అంది. పెళ్లికి వెళుతున్నారా అన్న ప్రశ్నకు బదులుగా ఆమె తండ్రి ''మా ఆవిడ వెళుతుంది. నాకిక్కడ చాలా పని వుంది. అక్కడకి వెళ్లి నా టైము వేస్టు చేసుకోలేను.'' అన్నాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)